logo

‘వైకాపాలో దళితులనూ మోసం చేయడమే’

వైకాపాలో ఉన్న దళితులను కూడా జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్‌ అన్నారు. విదేశీ విద్యా పథకానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు తొలగించి జగన్‌మోహన్‌రెడ్డి పేరు పెట్టుకోవడాన్ని....

Updated : 18 Aug 2022 06:30 IST


మంగళగిరి : నిరవధిక దీక్షకు మద్దతు తెలుపుతున్న మాజీ మంత్రి జవహర్‌

మంగళగిరి (తాడేపల్లి), న్యూస్‌టుడే: వైకాపాలో ఉన్న దళితులను కూడా జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్‌ అన్నారు. విదేశీ విద్యా పథకానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు తొలగించి జగన్‌మోహన్‌రెడ్డి పేరు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ తెదేపా మంగళగిరి నియోజకవర్గ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజు బుధవారం ఆయన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వైకాపా దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మూడేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఒక్క దళిత విద్యార్థికైనా విదేశీ విద్యా పథకం ద్వారా లబ్ధి చేకూర్చారా అని ప్రశ్నించారు. దళితుల్లో ఐక్యత అవసరం ఏర్పడింది. సమాఖ్యగా పోరాడితేనే ఏదైనా సాదించగలుగుతామని తెలిపారు.

పేరు మార్చడం సిగ్గు చేటు: వర్ల రామయ్య
అంబేడ్కర్‌ పేరును విదేశీ విద్యా పథకానికి తొలగించి జగన్‌పేరు పెట్టుకోవడం సిగ్గు చేటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలో తెదేపా ఎస్సీ విభాగం చేపట్టిన ఆమరణ దీక్షకు బుధవారం ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. మూడేళ్ల తరువాత విదేశీ విద్యా పథకం కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన జగన్‌ అంబేడ్కర్‌ పేరును తొలగించారని తెలిపారు. దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌ వారి సంక్షేమాన్ని విస్మరించారని, అంబేడ్కర్‌ పేరును విదేశీ విద్యా పథకానికి పెట్టేవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దీక్షా శిబిరానికి మంగళగిరి, తాడేపల్లి, తెలుగుదేశం అనుబంధ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.


దీక్ష భగ్నం


దీక్ష చేస్తున్న నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: విదేశీ విద్యా పథకానికి జగన్‌ పేరు తీసి అంబేడ్కర్‌ పేరును పునరుద్ధరించాలంటూ తెదేపా ఎస్సీ విభాగం నేతలు చేస్తున్న ఆమరణ దీక్షను బుధవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. గురువారం చలో మంగళగిరికి దళిత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీక్షలో పాల్గొన్న నేతలను బలవంతంగా అరెస్టు చేశారు. వీరిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనైనా దీక్షను కొనసాగిస్తామని నేతలు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీక్షను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు