logo

గమ్యం చేరేలోగా కడతేర్చిన మృత్యువు

ఆ తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. పెద్ద కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు. అతనికి తొమ్మిది నెలల కిందట అంగరంగ వైభవంగా వివాహం చేశారు. కుమారుడు, కోడలిని బెంగళూరులో దిగపెట్టడానికి తోడుగా వెళుతున్న వారిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది.

Published : 18 Aug 2022 06:04 IST

కర్ణాటక బస్సు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దంపతుల మృతి


ప్రమాదంలో మృతి చెందిన షరీఫ్‌, మైమున్నీసా

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: ఆ తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. పెద్ద కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాడు. అతనికి తొమ్మిది నెలల కిందట అంగరంగ వైభవంగా వివాహం చేశారు. కుమారుడు, కోడలిని బెంగళూరులో దిగపెట్టడానికి తోడుగా వెళుతున్న వారిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది.

మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు గోరంట్లరోడ్డు ద్వారకానగర్‌కు చెందిన దంపతులు షరీఫ్‌(52), మైమున్నీసా(47)లకు ముగ్గురు పిల్లలు. షరీఫ్‌ టైలరింగ్‌ వృత్తి చేస్తుండేవారు. వారు కష్టపడి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కుమారులు మస్తాన్‌వలి, బాషా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కుమార్తె షకీలా గుంటూరు మెడికల్‌ కళాశాలలో హౌస్‌సర్జన్‌గా సేవలందిస్తోంది. పెద్దకుమారుడు మస్తాన్‌వలి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గత డిసెంబర్‌లో అతని వివాహం ఘనంగా చేశారు. కుమారుడు, కోడలిని బెంగళూరులో దించివద్దామని తోడుగా తల్లిదండ్రులు షరీఫ్‌, మైమున్సీసాలతోపాటు వారి కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురు మంగళవారం రాత్రి గుంటూరు నుంచి వేమూరి కావేరీ ట్రావెల్స్‌లో ప్రయాణమయ్యారు. బుధవారం వేకువజామున 5 గంటల ప్రాంతంతో డ్రైవర్‌ టీతాగాడు. అక్కడ నుంచి జాతీయ రహదారి 75పై కోలార్‌ జిల్లా, ముల్‌భగల్‌ పట్టణం సమీపంలో సుమారు 5.30 గంటల ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురయ్యింది.

కొద్ది గంటల్లో చేరుకుంటారనగా.. మరి కొద్ది గంటల్లో బెంగళూరు చేరుకుంటామని అందరు ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురవడంతో అందులో ఉన్న ప్రయాణికులు నిర్ఘాంతపోయారు. అరుపులు, కేకలతో భయాందోళన చెందారు. బస్సులో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. జాతీయ రహదారిపై ఉన్న పెద్దగోడను ఢీకొనడంతో అదుపుతప్పిన బస్సు పట్టీలుకొట్టుకుంటూ పక్కనే ఉన్న గోతుల్లోకి ఎగిరిపడినట్లు ప్రయాణికులు తెలిపారు. వందల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ బస్సుకు ఒకే డ్రైవర్‌ను నియమించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మైమున్నీసా, షరీఫ్‌లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మస్తాన్‌వలి అతని భార్య, కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.
తెల్లవారుతుంది త్వరగా ఇంటికి చేరుకుంటామనుకున్న క్రమంలో బస్సు రూపంలో మృత్యువు భార్య, భర్తలను కబళించివేయడం అందర్నీ కలచి వేసింది. అప్పటి వరకు తమతో సరదా ఉన్న వారు ఒక్కసారిగా రక్తపుమడుగులో విగతజీవులుగా కనిపించడంతో కుమారడు మస్తాన్‌వలి, కోడలు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. కర్ణాటక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో షరీఫ్‌, మైమున్నీసాలు మృతి చెందారనే సమాచారం తెలియడంతో ద్వారాకానగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.  భార్య, భర్తలు అందరితో ఎంతో మర్యాదగా కలుపుగోలుగా ఉండేవారని పిల్లలను ఎంతో కష్టపడి చదివించి ఉన్నత స్థానాలకు చేర్చారని ఇంతలో ఎంత దారుణం జరిగిందని ఆవేదన చెందారు. బుధవారం అర్ధరాత్రికి మృతదేహాలు గుంటూరుకు చేరుకుంటాయని బంధువులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని