logo

జ్వరం పీడిస్తోంది

వినుకొండలోని ఉర్దూ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి పఠాన్‌ ఖాశిం పెదవలి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంటిదగ్గర ఉన్నా తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రావడంతో నీరసంగా

Published : 18 Aug 2022 06:15 IST

తరగతుల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరు


ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థి పఠాన్‌ ఖాశింపెదవలి చేతికి సెలైన్‌

వినుకొండలోని ఉర్దూ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి పఠాన్‌ ఖాశిం పెదవలి నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇంటిదగ్గర ఉన్నా తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రావడంతో నీరసంగా ఉన్న విద్యార్థికి వైద్యులు పరీక్షించి సెలైన్‌ పెట్టారు. పట్టణంలోని ధర్మపురికాలనీ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదోతరగతి విద్యార్థి సాయికౌశిక్‌నాయక్‌ జ్వరంతో మూడు రోజులుగా బడికి రావడం లేదు. విద్యార్థిని షేక్‌ హసినా ది ఇదే పరిస్థితి. ఈ పాఠశాలలో 29 మంది ఐదోతరగతి విద్యార్థులుంటే అందులో 10 మంది బుధవారం పాఠశాలకు రాలేదు.

సీతయ్యనగర్‌ ప్రాథమిక పాఠశాలలో మొత్తం రోల్‌ 91 ఉంటే 66 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 2, 3 తరగతుల పిల్లలు ఎక్కువ మంది బడికి రాలేదు. గైర్హాజరుకు పలు కారణాలున్నప్పటికీ ఇందులో జ్వరం కూడా ఒకటని ఉపాధ్యాయులు తెలిపారు.

న్యూస్‌టుడే, వినుకొండ

సీజనల్‌ వ్యాధుల విజృంభణతో పెద్దలతో పాటు పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. విష జ్వరాలు, టైఫాయిడ్‌, డెంగీ, మలేరియాలతో బాధపడుతున్నారు. కొందరిని రోజుల తరబడి దగ్గు వేధిస్తోంది. కనీసం మూడు రోజులకు జ్వరం తగ్గినా దగ్గు మాత్రం పక్షం రోజులుపైగానే ఉంటోంది. పరిసరాల అపరిశుభ్రతతో దోమలు పెరిగి డెంగీ జ్వరాలు నమోదవుతున్నాయి. మురికివాడల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ శాతం జ్వర పీడితులే ఉంటున్నారు.

చాలా పాఠశాలల్లో..
జ్వరంతో బాధపడుతూ ప్రతి పాఠశాలలో 10శాతం మంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరవుతున్నారు. కొంత మంది బడికి వచ్చినా నీరసంగా ఉంటున్నారు. వినుకొండ పట్టణంలోని సీతయ్యనగర్‌, ధర్మపురికాలనీ పాఠశాలలను ‘న్యూస్‌టుడే’ సందర్శించి ఉపాధ్యాయులను ఆరా తీయగా జ్వరంతో హాజరు తగ్గిన మాట వాస్తవమేనన్నారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లోని అధిక పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జులై చివరి వారంలో సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.


భయపడాల్సిన పనిలేదు

విష జ్వరాలు అధికంగా ఉంటున్నాయి. జ్వర పీడితుల్లో నీరసం అధికంగా ఉంటోంది. ఎక్కువ నీరు(ఓఆర్‌ఎస్‌) తీసుకోవాలి. భయపడాల్సిన పనిలేదు. డెంగీని వ్యాప్తి చేసే దోమల నివారణకు పరిశుభ్రత అవసరం. ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడితే మంచిది. కొవిడ్‌ కేసులు వస్తున్నాయి. టీకా వేయించుకున్న వారికి ప్రమాదం లేదు. జనసమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించాలి.

- డాక్టర్‌ కె.వెంకటసురేంద్ర, ఎండీ(జనరల్‌ మెడిసిన్‌)


అన్నిచోట్ల ప్రభావం

పాఠశాలలో విద్యార్థుల హాజరు తగ్గింది. కారణాలను పరిశీలిస్తే జ్వరాలని తెలిసింది. పాముల కాలనీ పాఠశాలను స్వయంగా సందర్శించగా సుమారు 40మంది రాలేదు. అన్నిచోట్ల ఈ ప్రభావం కనిపిస్తోంది. వైద్యశాఖ సిబ్బంది స్క్రీనింగ్‌ చేస్తామని సమాచారం కోరారు.

- సయ్యద్‌ జఫ్రుల్లా, మండల విద్యాశాఖాధికారి వినుకొండలో అపారిశుద్ధ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని