logo

‘రైతు బతుకే మారలేదు’

మూడు దశాబ్దాల దేశ చరిత్రను తీసుకుంటే అందరికీ అన్నంపెట్టే రైతన్న జీవితమే అభివృద్ధి చెందకుండా, ఏ మార్పూ లేకుండా అయిపోయిందని పార్లమెంటు మాజీ సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 26 Sep 2022 06:01 IST

మాట్లాడుతున్న వడ్డే శోభనాద్రీశ్వరరావు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మూడు దశాబ్దాల దేశ చరిత్రను తీసుకుంటే అందరికీ అన్నంపెట్టే రైతన్న జీవితమే అభివృద్ధి చెందకుండా, ఏ మార్పూ లేకుండా అయిపోయిందని పార్లమెంటు మాజీ సభ్యుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక బృందావన గార్డెన్స్‌ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం పద్మావతీ కల్యాణ వేదిక మీద భారతీదేవి రంగా 50వ సంస్మరణ సభ జరిగింది. సభలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఏ ఉద్యోగి  జీతంతో పోల్చినా రైతు సంపాదన తక్కువేనన్నారు. కొంతమంది మరణించినప్పుడు లక్షలాది రూపాయల నష్టపరిహారాన్నిచ్చే ప్రభుత్వాలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే చోద్యం చూస్తున్నాయన్నారు. భారతీదేవి భర్త బాటలో నడిచి మంచి నాయకురాలుగానే కాక ఉత్తమ ఇల్లాలుగా కూడా తన బాధ్యతలను నిర్వర్తించిన ఆదర్శ మూర్తి అని కొనియాడారు. రైతు ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. డాక్టర్‌ జక్కంపూడి సీతారామారావు మాట్లాడుతూ నేటి మహిళలంతా భారతీదేవిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా రంగా శిష్యుడు పులుకొల్లు సత్యనారాయణను నూతన వస్త్రాలతో సత్కరించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభలో డాక్టర్‌ వి.సింగారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకుమార్‌, తక్కెళ్లపాడు సుబ్బారావు, జీవీ రాయుడు, అన్నే సాంబశివరావు, బీవీ మిత్ర, చంద్రశేఖర్‌, డాక్టర్‌ యర్రా నాగేశ్వరరావు, నూతలపాటి తిరుపతయ్య, సుధాకర్‌, పొన్నూరు వెంకట రాయుడు తదితరులు ప్రసంగించారు. డాక్టర్‌ ఎ.విజయలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని