logo

సీజన్‌ ముగుస్తున్నా.. ఇంకా పంట లెక్కలే!

పంటలు సాగు చేస్తున్న రైతుల భూమి విస్తీర్ణం, సర్వే నంబరు, పంట రకం, వ్యక్తిగత వివరాలతో సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. నమోదుకు సంబంధించి గడువులు పెంచుకుంటూ

Updated : 26 Sep 2022 06:21 IST

పూర్తికాని ఈ-పంట నమోదు నీ క్షేత్రస్థాయిలో ప్రతిబంధకాలెన్నో..


పొలంలో పంట వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

ఈనాడు-అమరావతి: పంటలు సాగు చేస్తున్న రైతుల భూమి విస్తీర్ణం, సర్వే నంబరు, పంట రకం, వ్యక్తిగత వివరాలతో సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. నమోదుకు సంబంధించి గడువులు పెంచుకుంటూ సెప్టెంబరు 27 తుది గడువుగా మరోమారు పొడిగించారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నా జిల్లాలో ఇంకా 20శాతంపైగా విస్తీర్ణం ఈ-పంటలో నమోదు కాలేదు. దేవాదాయ, వక్‌్్ఫ, ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన భూములు సాగు చేస్తున్నచోట.. ఆయా శాఖల నుంచి అనుమతి పత్రాలు తెచ్చుకుని కౌలుకార్డులు పొందనివారు కూడా ఉన్నారు. వారసత్వంగా తాతల కాలం నుంచి వస్తున్న భూములను ఇప్పటికీ వారసుల పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో నవీకరించుకోలేని రైతులు ఉన్నారు. కృష్ణానది కరకట్ట లోపల లంకల్లో ఉన్న భూములు నదీపాతం కింద నమోదయ్యాయి. నది విభాగం కింద ఉండటంతో ఈ-పంట నమోదు చేయడానికి వీల్లేకుండా పోయింది. ఇలా పలు సమస్యలతో సాగుచేస్తున్న వారి పేరుతో ఈ-పంటలో నమోదుచేయించుకోలేని పరిస్థితి. విదేశాలు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి ఇక్కడ భూములు ఉన్నాయి. వీరు వారి పేరుతో నమోదుచేయించుకోవడానికి వేలిముద్ర వేయాల్సి ఉంది. దీంతో ఇక్కడికి రాలేక ఈ-పంట నమోదు వద్దని చెబుతున్నారు. ఐదెకరాలు మించి భూములు ఉన్న రైతులు ఐదెకరాలు మాత్రమే నమోదు చేయించుకొని మిగిలినది వద్దని వారిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో రైతుభరోసా కేంద్రం సిబ్బంది ప్రత్యేకంగా డ్రైవ్‌ చేస్తున్నా వంద శాతం చేయలేకపోతున్నారు. జూన్‌ నెలలోనే పంటల నమోదు ప్రారంభించాలి. అయితే యాప్‌లో మార్పులు చేసి ప్రారంభించేసరికి ఆగస్టు నెల వచ్చింది. పూర్తిస్థాయిలో సెప్టెంబరు ప్రారంభం నుంచి అందుబాటులోకి వచ్చిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

నోషనల్‌ ఖాతాలు, ప్రభుత్వశాఖల భూములు, కౌలుదారుల నమోదులో పలు సమస్యలు వస్తుండగా వాటిని నమోదు చేయలేకపోతున్నారు. మరోవైపు ఈ-పంట యాప్‌ సర్వరు అత్యంత నెమ్మదిగా ఉంటోంది. కొన్ని రోజులుగా సర్వర్‌ మొరాయించడంతో రైతుభరోసా సిబ్బంది పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. సర్వర్‌ పనిచేయని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వెంటనే పరిష్కారం కావడం లేదు. సెలవు రోజుల్లో సంబంధిత సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. గతంతో పోల్చితే యాప్‌లో చేసిన మార్పుల వల్ల మరింత సంక్లిష్టత నెలకొంది. ఇతర ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్ల నుంచి సంబంధిత ధ్రువపత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరముంది.

నష్టపోయేది రైతులే..

ఈ-పంట నమోదులో వివరాలు పొందుపరచకపోతే రైతులు పలు విధాలుగా నష్టపోతారు. పంటల బీమా, రుణాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు నష్టపోతే అందించే పెట్టుబడి రాయితీ, మద్దతు ధరకు పంట ఉత్పత్తుల అమ్మకాలు, రాయితీ విత్తనాలు, యంత్ర పరికరాలు తదితర లబ్ధి పొందలేరు. ఈ-పంట నమోదుతో పాటు తర్వాత ఈకేవైసీ సైతం పూర్తిచేయించుకుంటేనే పథకాలకు అర్హులవుతారు. ఇప్పటికీ ఈ-పంట నమోదు చేయించుకోని రైతులు వెంటనే చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని