logo

కొండంత పండగ

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు సోమవారం నుంచి అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 5 వరకూ వేడుకలు జరుగుతాయి.

Published : 26 Sep 2022 06:11 IST

నేటి నుంచి అక్టోబర్‌ 5 వరకూ వేడుకలు
14 లక్షల మందికి పైగా పాల్గొంటారని అంచనా
మూడు కిలోమీటర్ల దూరం నుంచి క్యూలైన్లు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలుగులు

ఈనాడు, అమరావతి: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు సోమవారం నుంచి అంగరంగ వైభవంగా ఆరంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 5 వరకూ వేడుకలు జరుగుతాయి. పది రోజుల్లో కనీసం 14లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా ఇంద్రకీలాద్రి కొండ దిగువన, పైభాగంలో ఏర్పాట్లు చేశారు. కొండ కిందన వినాయక ఆలయం వద్ద నుంచి మూడు కి.మీ దూరం క్యూలైన్లను వేశారు. భక్తులు ఈ క్యూలైన్లలో ఒకసారి ప్రవేశిస్తే నేరుగా అమ్మవారిని దర్శించుకుని కిందకు వచ్చేస్తారు.

దసరా ఉత్సవాల మొదటి రోజు తెల్లవారుజామున 3గంటల నుంచి అమ్మవారి ఆలయం, ఉపాలయాల్లోని మూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు. అందుకే మొదటి రోజు భక్తులను దర్శనానికి ఆలస్యంగా అనుమతిస్తారు. ఉదయం 9గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత రోజు ఉదయం 4గంటల నుంచి రాత్రి 11 వరకూ దర్శనాలకు అనుమతిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతులు, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి. ఆ సమయంలో దర్శనాలను నిలిపేస్తారు. ఆలయంలో ప్రతి రోజూ సాయంత్రం 6.30కు మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి నగరోత్సవం ప్రారంభమవుతుంది. అక్టోబరు 5న దసరా రోజు మాత్రం సాయంత్రం 4గంటలకే నగరోత్సవం ఉంటుంది.

కనకదుర్గమ్మకు నగర పోలీసుల తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీపీ కాంతిరాణా టాటా దంపతులు, చిత్రంలో ఈవో భ్రమరాంబ తదితరులు

దసరాలో ప్రత్యేక పూజలు..

అమ్మవారి ఆలయంలో దసరా పది రోజులు ప్రత్యేక పూజలు ఉంటాయి. ప్రత్యేక లక్ష కుంకుమార్చన పూజలకు రూ.3వేల ధర నిర్ణయించారు. మూలానక్షత్రం రోజున మాత్రం రూ.5వేలు టిక్కెట్‌ ధర పెట్టారు. ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 9గంటల వరకు, ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు రెండు షిఫ్టుల్లో పూజలు నిర్వహిస్తారు. వీటితో పాటు శ్రీచక్రార్చన పూజలుంటాయి. దీనికి టిక్కెట్‌ ధర రూ.3వేలు నిర్ణయించారు. ఇద్దరు పూజలో పాల్గొనొచ్చు. మహామండపంలోని ఆరో అంతస్తులో పూజలు జరుగుతాయి. ఒక టిక్కెట్‌పై ఇద్దరు పూజ చేసుకునేందుకు అనుమతిస్తారు. చీర, పంచె, పెద్దలడ్డూ, ఫొటో, శ్రీచక్రపీఠం, కుంకుమ భరిణె, శక్తికంకణం, కుంకుమ ప్రసాదం, అక్షింతలు ఇస్తారు.

నేడు స్వర్ణకవచాలంకృత రూపం..

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల తొలి రోజు సోమవారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా దర్శనమిస్తారు. స్వర్ణ కవచాలంకృత రూపంలోని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల దరిద్రాలు పోయి ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుందని భక్తుల నమ్మకం.

* దర్శన సమయం: ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు.

వేడుకకు సన్నాహలు ఇలా..

* క్యూలైన్లు: 5

* దర్శనాలు: రూ.100, రూ.300, ఉచిత దర్శనం

* ప్రసాదం కౌంటర్లు: కనకదుర్గానగర్‌లో 13, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, పున్నమిఘాట్‌, స్టేట్‌గెస్ట్‌హౌస్‌, ఘాట్‌రోడ్డులో ఒక్కొక్కటి

* లడ్డూ ప్రసాదం తయారీ: 20లక్షలు

* కృష్ణానది ఘాట్‌లలో స్నానాలకు షవర్లు: 800

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని