logo

కృష్ణా తీరానికి... వందనం

అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం కృష్ణా జిల్లాలో ముగిసింది. ఈ నెల 20న పెనుమూడి వారధి దాటి కృష్ణాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆరు రోజుల పాటు జిల్లాలో సుమారు 90 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.

Published : 26 Sep 2022 06:15 IST

ఆరు రోజుల పాటు 90 కి.మీ సాగిన యాత్ర


నందివాడ మండలం రామాపురం వద్ద..

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుడివాడ (నెహ్రూచౌక్‌), నందివాడ: అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం కృష్ణా జిల్లాలో ముగిసింది. ఈ నెల 20న పెనుమూడి వారధి దాటి కృష్ణాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఆరు రోజుల పాటు జిల్లాలో సుమారు 90 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఆదివారం రాత్రి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజకవర్గాల గుండా రైతుల పాదయాత్ర సాగింది. మంత్రి జోగి రమేష్‌ ప్రాతినిధ్యం వహించే పెడన, కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో యాత్ర సాగుతున్న సమయంలో కొంత అలజడులు చెలరేగే అవకాశం ఉందని భావించినా సాఫీగా సాగిపోయింది. దీంతో అటు రైతులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  జిల్లాలో యాత్ర సాగిన ఆరు రోజుల పాటు వైకాపా మినహా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. రైతుల వెంట నడిచారు. వారి యాత్రకు సంఘీభావం తెలిపారు. రైతుల లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. జిల్లా వాసులు చూపిన ఆదరాభిమానాలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సరిహద్దున నేలను తాకి నమస్కరించారు. మిగిలిన రోజులకు తీసిపోని విధంగా ఆదివారం కూడా యాత్ర సాగిన 15 కి.మీ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలు వారి గ్రామాల సరిహద్దు వరకు వచ్చి స్వాగతించారు. బంతిపూలతో రైతులు, మహిళలపై పుష్పాభిషేకం కురిపించారు. ప్రధాన రహదారికి దూరంగా గ్రామాలు ఉన్నా రోడ్డుపైకి వచ్చి మరీ యాత్ర వచ్చే వరకు ఉండి ఉద్యమానికి మద్దతు తెలిపారు. అన్నిచోట్లా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు తాగునీరు, మజ్జిగ, శీతలపానీయాలు, బిస్కెట్లు, ఎవరికి తోచినవి వారు అందజేశారు. అన్నదాతలకు జిల్లాలో ఎటువంటి కష్టం రానీయకుండా ఆప్యాయంగా చూసుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం బంగారం లాంటి భూములను త్యాగం చేసిన రైతులపై అన్ని ప్రాంతాల్లో ప్రశంసలు కురిపించారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచారు. పాలకుల కుటిల వైఖరిని ప్రజల ముందు ఉంచారు. తమ కష్టాలను ప్రజలకు వివరించడంలో రైతులు సఫలమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని