logo

కాళ్లరిగేలా తిరిగినా ఫలితం సున్నా

సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లకు పలు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ప్లాట్లను అభ్యంతరకర భూముల్లో ఇవ్వడమే ఇందుకు కారణం.

Published : 27 Sep 2022 04:41 IST

పరిష్కారానికి నోచుకోని రాజధాని రైతుల అర్జీలు

ఈనాడు - అమరావతి

సమీకరణలో భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లకు పలు చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. ప్లాట్లను అభ్యంతరకర భూముల్లో ఇవ్వడమే ఇందుకు కారణం. వీటిని మార్చి మరో చోట ఇవ్వమని అన్నదాతలు ఏళ్ల తరబడి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. కష్ట సమయాల్లో తమకు అక్కరకొస్తాయనుకున్న ప్లాట్లు కాగితాలకే పరిమితం అయ్యాయి. ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకోమని రైతులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈమాత్రం శ్రద్ధను వారి సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదు. ఫలితంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

పురోగతి అంతంతే..

రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సమీకరించింది. దీనికి గాను వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలన్నది ఒప్పందం. ఈ మేరకు భూయజమానులకు మొత్తం 64,735 ప్లాట్లను కేటాయించింది. ఇందులో 38,282 నివాస, 26,453.. వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. వీటిని రైతుల పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు. గత ప్రభుత్వ హయాంలో 40,378 ప్లాట్లుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అయింది. హైకోర్టు తీర్పు తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి తిరిగి సీఆర్డీఏ అధికారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 2,657 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఇంకా 21,722 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కాలేదు. అర్జీల పరిష్కారంలో సీఆర్డీఏ అధికారుల ఉదాశీనత కారణంగా రైతులు అనాసక్తి చూపిస్తున్నారు.

తిరిగి.. తిరిగి..

మందడం గ్రామానికి చెందిన రాజేష్‌ భూసమీకరణ కింద వెలగపూడి, మందడం, మల్కాపురం రెవెన్యూ గ్రామాల్లోని 4.85 ఎకరాలను ఇచ్చారు. ఇందులో మల్కాపురంలోని 1.03 ఎకరాల భూమికి సంబంధించి వెయ్యి గజాల మేర రెసిడెన్షియల్‌ ప్లాట్‌ వచ్చింది. దీనికి సంబంధించి న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఆ ప్లాట్‌ను అమ్ముదామన్నా వీలు కాని పరిస్థితి నెలకొంది. దీనిని మార్చి మరో చోట ఇవ్వమని గత మూడున్నర సంవత్సరాలుగా సీర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరుకు చెందిన వెంకటేశ్వరరావు 1.50 ఎకరాల భూమిని ఇచ్చారు. దీనికి బదులుగా సీఆర్డీఏ అధికారులు 500 గజాల ప్లాట్లు మూడు, 360 గజాల కమర్షియల్‌ ప్లాట్‌ ఒకటి లాటరీ విధానంలో కేటాయించి పత్రాలు అందజేశారు. ఇందులో 500 గజాల ప్లాట్‌ ఒకదానికి సంబంధించి పూలింగ్‌లో ఇవ్వని భూమిలో కేటాయించారు. ఈ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం సాధ్యం కాదు. తనకు వచ్చిన ప్లాట్‌ను వేరే చోట ఇప్పించమని వెంకటేశ్వరరావు పలు సార్లు అధికారులను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదు.

* తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు సమీకరణలో 3.24 ఎకరాల భూమిని సీర్డీఏకు అప్పగించారు. దీనికి గాను సీఆర్డీఏ అధికారులు వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ ప్లాట్లు మూడు, 750 గజాల కమర్షియల్‌ ప్లాట్‌ ఒకటి కేటాయించారు. ఇందులో ఓ నివాస ప్లాట్‌ను పూలింగ్‌లో అసలు భూమిలో, మరొకటి చెరువు పోరంబోకులో ఇచ్చారు.

స్పందించని సీఆర్డీఏ

ఎటువంటి అభివృద్ధి చేయకుండా.. ఎక్కడికక్కడ ముళ్ల కంపలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎలా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవలి? కనీసం స్థలంలోకి వెళ్లడానికి కూడా దారి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేసి, సరిహద్దులు చూపించాలని కోరుతున్నారు. సమీకరణలో ఇవ్వని భూముల్లో చాలా మంది రైతులకు ప్లాట్లు కేటాయించారు. ఇలా దాదాపు 500 మందికి ఇచ్చారు. ఇటువంటి వాటిని రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం సాధ్యపడదు. వీటిని మార్చమని మూడేళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదు. 29 గ్రామాల్లోని సుమారు 300 మంది వరకు దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో ప్లాట్లు వచ్చాయి. వీటిని మార్చమని పలు సార్లు అర్జీలు ఇచ్చినా స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం కేపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు ఇచ్చింది. ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రెండేళ్ల వరకే వర్తిస్తుంది. అసలు అభివృద్ధి లేకుండా తమకు కల్పించిన వెసులుబాటును ఎలా వదులుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఇలా దాదాపు 3,500 మంది రైతులకు సంబంధించి అభ్యంతరాలు సీఆర్డీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు పరిష్కారాన్ని కొనుగొన్న పాపాన పోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని