logo

ఆంగ్ల అధ్యాపకుడి నుంచి వీసీ దాకా

ఆచార్య నాగార్జున వర్సిటీ ఉపకులపతి కావాలనే కాంక్షను ప్రొఫెసర్‌ పేటేటి రాజశేఖర్‌ ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన రాజశేఖర్‌ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. కేరళ, తెలంగాణ రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

Updated : 28 Sep 2022 05:14 IST

ఏఎన్‌యూ వీసీగా రాజశేఖర్‌ నియామకం
మూడేళ్ల పదవీకాలం.. అభినందనలు వెల్లువ
ఈనాడు-అమరావతి, ఏఎన్‌యూ, న్యూస్‌టుడే


ఆచార్య రాజశేఖర్‌, ఉపకులపతి, ఏఎన్‌యూ

ఆచార్య నాగార్జున వర్సిటీ ఉపకులపతి కావాలనే కాంక్షను ప్రొఫెసర్‌ పేటేటి రాజశేఖర్‌ ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన రాజశేఖర్‌ ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. కేరళ, తెలంగాణ రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. గత 20 ఏళ్లకు పైగా ఏఎన్‌యూలో ఆంగ్ల విభాగం ఆచార్యుడిగా ఉంటున్నారు. గతంలో ఏఎన్‌యూ రిజిస్ట్రార్‌గాను పని చేశారు. . సుమారు మూడేళ్ల నుంచి ఇంచార్జి వీసీగా కొనసాగుతున్నారు. విశ్వవిద్యాలయ రెగ్యులర్‌ వీసీ నియామకానికి పోటీ పడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులకు దగ్గరయ్యారు. ఉమ్మడి గుంటూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో సాన్నిహిత్యం కలిగిన ఆయన ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకుని వారి సహాయ, సహకారాలతోనే వీసీగా నియామకమయ్యారు. రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో ఆయన నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగ నియామకాలు చేశారని, జీతభత్యాలు, ఓడీలు వంటివి చెల్లింపులు చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే  అభియోగాలు వచ్చాయి. వాటిపై నాటి తెదేపా ప్రభుత్వం చక్రపాణి కమిటీతో విచారణ చేయించింది. ఆకమిటీ ఆర్థిక అవకతవకలు నిర్ధారించినా చర్యలు తీసుకునే విషయంలో జాప్యం జరగటం, ఆతర్వాత తెదేపా ప్రభుత్వం అధికారం కోల్పోయి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో తనపై వచ్చిన అవినీతి, ఆరోపణలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా చాకచక్యంగా వ్యవహరించారని వర్సిటీ వర్గాలు అంటున్నాయి.  ప్రొఫెసర్‌ రాజశేఖర్‌  వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నవంబరు 4న వీసీగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌ఏసీ వీసీగా నియమించిన తర్వాత ఏఎన్‌యూలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం పెట్టారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల విగ్రహాలు పెట్టడం కూడా ఏఎన్‌యూ నుంచే ప్రారంభమైంది. అదొక్కటే కాదు ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని బలపరుస్తూ ప్రభుత్వానికి మద్దతుగా విశ్వవిద్యాలయాల్లో ర్యాలీలు, సదస్సుల నిర్వహణ వంటివి కూడా ఏఎన్‌యూ నుంచే ప్రారంభమయ్యాయి. ఇలా ప్రభుత్వ అనుకూల కార్యక్రమాలు చేస్తూ తనపై ఎన్ని అవినీతి, ఆరోపణలు వచ్చినా వాటిపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీసే సాహసం చేయకుండా విధేయతతో అడ్డుకోగలిగారు. రాజకీయాలకతీతంగా నడవాల్సిన విశ్వవిద్యాలయంలో రాజకీయ సదస్సులు పెట్టి  విపక్షాలు, అమరావతి రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ప్రొఫెసర్‌ రాజశేఖర్‌పై చక్రపాణి కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకపోయినా నిరుపమారాణి కమిటీ విచారణ  పూర్తయ్యే వరకు ఆయన్ని ఇంఛార్జి వీసీ బాధ్యతల నుంచి తప్పించాలని వర్సిటీకి చెందిన  అధ్యాపకులు ఆచార్య  రత్నశీలామణి కోర్టులో కేసు వేశారు.  ఒకవైపు ఆయనకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు, మరోవైపు ఆయనపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయటం వంటివి చేసినా అవేం పరిగణనలోకి తీసుకోకుండా రాజశేఖర్‌కు అత్యున్నతమైన వీసీ పదవిని కట్టబెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆచార్య రత్నశీలామణి, విద్యార్ధిని నంద కూడా రాజశేఖర్‌కు వ్యతిరేకంగా కోర్టును  ఆశ్రయించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు, ఆతర్వాత  వైకాపా ప్లీనరీ సమావేశాలకు హాజరైన వాహనాలు  ఏఎన్‌యూలో పార్కింగ్‌ చేసుకోవటానికి అవకాశం కల్పించారు. ఇంత వ్యతిరేకత మధ్య రెండు స్నాతకోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్‌ హయాంలో వందకుపైగా జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు, అవార్డులు వర్సిటీకి రావటం కొసమెరుపు. రెగ్యులర్‌ వీసీగా ఉత్తర్వులు వెలువడిన వెంటనే వర్సిటీలోని అధ్యాపకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో రాజశేఖర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని