logo

అమెరికాలో చదవడానికి దొంగగా మారి..

అమెరికాలో చదవాలనుకున్న ఆ యువకుడు అందుకు కావాల్సిన నగదు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చివరికి చోరీ చేసిన బంగారు నగలు, వాహనాలు విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో

Published : 29 Sep 2022 04:40 IST

వాహనాలు విక్రయిస్తూ దొరికిపోయిన వైనం

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అమెరికాలో చదవాలనుకున్న ఆ యువకుడు అందుకు కావాల్సిన నగదు కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. చివరికి చోరీ చేసిన బంగారు నగలు, వాహనాలు విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్ని పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి పోలీసులు బంగారు ఆభరణాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టాభిపురం ఠాణాలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ రాజశేఖరరెడ్డి వివరాలు వెల్లడించారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరానికి చెందిన కాకాని మనోజ్‌కుమార్‌ హైదరాబాద్‌లో యానిమేషన్‌ కోర్సు పూర్తి చేసి డిజిటల్‌ యానిమేషన్‌ వర్కు చేస్తుంటాడు. అమెరికాలో సైబర్‌ సెక్యూరిటీ మాస్టర్‌ కోర్సు చదవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన సొమ్మును దొంగతనాలు చేసి సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గత కొంతకాలంగా గుంటూరు నగరాలులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. బీటెక్‌లో చేరేందుకు ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరానికి చెందిన ఓ బాలుడు గుంటూరుకు వచ్చి అదే ఫ్లాట్‌లో ఉంటున్నాడు. ఇద్దరు కలిసి పట్టాభిపురం, అరండల్‌పేట ఠాణాల పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు విజయవాడ నగరంలో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. అదేవిధంగా పట్టాభిపురం, నగరంపాలెం ఠాణాల పరిధిలో వాహనాలను దొంగిలించారు. మనోజ్‌కుమార్‌ యాప్‌ ద్వారా నకిలీ ఐడీ కార్డులు ఇచ్చి హైదరాబాద్‌లో అద్దెకు తీసుకువచ్చిన మూడు ద్విచక్ర వాహనాలను తన గ్రామంలో తాకట్టు పెట్టుకున్నాడు. అదేవిధంగా తీసుకువచ్చిన కారుకు ఉన్న జీపీఎస్‌ ట్రాకర్‌ను పీకివేసి స్నేహితులతో కలిసి కేరళ వెళ్లి అద్దె చెల్లించకుండా విజయవాడ బెంజి సర్కిల్‌లో పెట్టి జీపీఎస్‌ ట్రాకర్‌ను కనెక్ట్‌ చేయగా జూమ్‌ యాప్‌ ద్వారా వచ్చి ఆ కారుకు సంబంధించిన వారు తీసుకువెళ్లారు. దొంగిలించిన బంగారు గొలుసులు, వాహనాలను గుజ్జనగుండ్ల వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సీఐ రాజశేఖరరెడ్డితో పాటు పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ఇద్దరు దొంగల్ని అరెస్టు చేసి 75 గ్రాముల బంగారు ఆభరణాలను, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని