logo

కమీషన్‌కు కక్కుర్తి

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సొమ్ము చేసుకోవాలంటే అన్నదాతకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ నేతల ప్రసన్నం లేకపోతే రైతులు తమ పంట ఉత్పుత్తులను ఊరు దాటించలేకపోతున్నారు..

Published : 29 Sep 2022 04:40 IST

అన్నదాతల పంట విక్రయంపై రాజకీయ ఆంక్షలు

సుబాబుల్‌ కర్రలు తరలిస్తున్న లారీలను అడ్డుకున్న పోలీసులు

అర్ధాంతంగా నిలిపివేసిన సుబాబుల్‌ లోడింగ్‌

ఎండుగుంపాలెం (నాదెండ్ల), న్యూస్‌టుడే : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సొమ్ము చేసుకోవాలంటే అన్నదాతకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రాజకీయ నేతల ప్రసన్నం లేకపోతే రైతులు తమ పంట ఉత్పుత్తులను ఊరు దాటించలేకపోతున్నారు.. ఒకవేళ వారి సిపార్సులతో దళారులకు విక్రయించితే ధరలో కోత పెడుతున్నారు. తమ ఆదేశాలు ధిక్కరించి ఇతరులు కొంటే ఆ పంటను తరలించే లారీలపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు.. అధికారమున్న దళారులకే పంట కొనే హక్కు ఉందంటూ ఓ పోలీసు అధికారి ఏకంగా తన పరిధిని అతిక్రమించి హెచ్చరికలు జారీ చేయడంతో కర్షకులు అవాక్కయ్యారు

నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో సుమారు 1200 ఎకరాల్లో సుబాబుల్‌ సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేక రైతులు పంట అమ్మలేదు. పేపరు తయారీ పరిశ్రమలు నామమాత్రంగానే సుబాబుల్‌ కర్ర కొన్నాయి. దీంతో రైతులు పంట విక్రయించుకునేందుకు నిరీక్షిస్తున్నారు. కుటుంబ ఖర్చులు, వైద్యం, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు జరుగుబాటు కూడా లేక అవస్థ పడుతున్నారు. కొన్ని రోజులుగా పరిశ్రమల గేట్లు తెరచి లారీల కొద్ది సరకు కొనుగోలుకు అధిక సంఖ్యలో పర్మిట్లు (బిల్లులు) ఇస్తున్నాయి. దీంతో తమ పంట విక్రయించుకునే అవకాశం లభించిందన్న రైతుల సంతోషాన్ని కొంత మంది దళారులు నీరుగారుస్తున్నారు. ఈ వ్యాపారాన్ని అధికార పార్టీ నేతల మద్ధతుదారులు చేజిక్కించుకుంటున్నారు. గత ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేయని వారి పంటను కొనమని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

చిలకలూరిపేట గ్రామీణ పోలీసు స్టేషన్‌లో రైతుల పడిగాపులు 

రైతు కష్టంలో టన్నుకు రూ.300 దోపిడీ

నాలుగైదేళ్లు శ్రమించి పండించిన సుబాబుల్‌ పంట ఎకరాకు సుమారు 70 టన్నుల దిగుబడి వస్తుంది. నాణ్యమైన కర్ర ఒక టన్నుకు రూ.2,200 వంతున ధరను రైతు ఖాతాకు పేపరు మిల్లులు జమ చేస్తున్నాయి. కూలీలు సుబాబుల్‌ చెట్లు నరకడం, ట్రాక్టరు, లారీ ఎగుమతి, బాడుగ తదితర ఖర్చులన్నింటిని కొనుగోలు సంస్థలే భరిస్తున్నాయి. అయితే కూలీలు, పంట తరలించేందుకు తాము పెట్టుబడి పెడుతున్నామని, ఇందులో టన్నుకు రూ.300 చొప్పున దళారులు కమీషన్‌గా వసూలు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాకు డబ్బు జమ అవగానే తమకు ఆ మొత్తం సంబంధిత రైతు నుంచి గుంజుతున్నారు. తమ మాట కాదంటే పంటని మరోసారి కొనమని బెదిరిస్తున్నారు. ఇందులో గుత్తాధిపత్యం చెలాయించేందుకు ఓ ప్రజాప్రతినిధి చక్రం తిప్పాడు. ప్రతిపక్ష పార్టీ దళారులు, ఇతర మధ్యవర్తులు తమ గ్రామంలో సుబాబుల్‌ పంట కొనకూడదని షరతులు విధించాడు. అతనికి అండగా లారీ చోదకులు, కూలీలపై తప్పుడు కేసులు పెడతామని ఓ పోలీసు అధికారితో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండ్రోజులుగా చిలకలూరిపేట గ్రామీణ పోలీసు స్టేషన్‌ చుట్టూ అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. పోలీసు అధికారులు సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు అన్నదాతలు తెలిపారు. న్యాయం చేయకపోతే ఉద్యమబాట పడతామని చెబుతున్నారు.

సమస్య లేకుండా చూస్తాం

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే హక్కు ఉంది. దళారుల మధ్య తలెత్తిన విబేధాలు సరిచేస్తాం. ఇదే విషయమై గతంలో వారంతా ఒప్పందం కుదుర్చుకున్నారు. పంట కొనుగోలు బహిష్కరణకు గురైన రైతుల పేర్లు చెబితే వారు నష్టపోకుండా చర్య తీసుకుంటాం. - అచ్చయ్య, చిలకలూరిపేట గ్రామీణ సీఐ

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని