logo

దిగొచ్చిన పోషక ఫలం

ఒకప్పుడు పేదవారి యాపిల్‌గా జామకాయను చెప్పేవారు.. కాలం మారుతోంది.. యాపిల్‌ కాయల ఉత్పత్తి పెరగడంతో అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలకే పరిమితమైన యాపిల్‌ నేడు

Updated : 29 Sep 2022 06:35 IST

యాపిల్‌ ధరలు తగ్గడంతో భారీగా కొనుగోళ్లు

ఈనాడు, బాపట్ల

ఒకప్పుడు పేదవారి యాపిల్‌గా జామకాయను చెప్పేవారు.. కాలం మారుతోంది.. యాపిల్‌ కాయల ఉత్పత్తి పెరగడంతో అవి సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలకే పరిమితమైన యాపిల్‌ నేడు అందరికీ చేరువైనట్లయింది. కిలో రూ.100 లేదా వందకు 5 నుంచి 8 కాయలు చొప్పున విక్రయిస్తున్నారు. కాయ పరిమాణాన్ని ఒక్కో కాయ రూ.5 ధరకు కూడా లభిస్తుంది. యాపిల్‌ పండే హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో నాణ్యమైన కాయలతోపాటు అధిక దిగుబడులు వచ్చాయి. దీంతో మార్కెట్‌లో సరకు లభ్యత పెరిగి ధరలు కొంత దిగివచ్చాయి.

యాపిల్‌లో పైబర్‌ ఎక్కువగా ఉండి కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్‌-సి ఎక్కువగా ఉండి జీర్ణక్రియలో దోహదపడుతుంది. గుంటూరు నగరంలో లాలాపేట పండ్లబజారు, మార్కెట్‌ కూడలి, లాడ్జిసెంటర్‌, జూట్‌ మిల్లు వద్ద, పట్టాభిపురం, ఆర్టీసీ బస్టాండు, అరండల్‌పేట ప్రధాన రహదారి, కొరిటెపాడు, బుడంపాడు బైపాస్‌, కొత్తపేట, ఏటుకూరు కూడలి, అమరావతి రోడ్డు, మంగళగిరి రోడ్డులో ప్రతిచోటా రకరకాల పరిమాణాల్లో యాపిల్‌ అమ్ముతున్నారు. వీటికితోడు సైకిళ్లు, తోపుడు బండ్లు మీద తిరుగుతూ వీధుల్లో సైతం ఇళ్ల వెంబడి విక్రయిస్తున్నారు. ఈ సీజన్‌లో సీతాఫలం, దానిమ్మ, అరటి, బత్తాయి వీటన్నింటితోపాటు యాపిల్‌ ఉండేది. ఇప్పుడు ఇందులో సింహభాగం వాటా యాపిల్‌ ఆక్రమిస్తోంది. ధరలు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

ఛండీగఢ్‌ నుంచి నేరుగా గుంటూరుకు..: జిల్లాకు ఎక్కువగా సిమ్లా యాపిల్‌ వస్తున్నాయి. వీటికి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు సీజన్‌ ఉంటుంది. సిమ్లా పరిసర ప్రాంతాల్లో పండే యాపిల్‌కు ఛండీగఢ్‌ మార్కెట్‌ కూడలిగా ఉంది. అక్కడి నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు సరకు తరలివస్తుంది. గుంటూరు నగరంతోపాటు జిల్లాలో ప్రధాన పట్టణాలకు చెందిన వ్యాపారులు ఛండీగఢ్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసి నేరుగా గుంటూరు నగరానికి తెప్పిస్తున్నారు. ఒక్కొక్క లారీలో 650 నుంచి 700 బాక్సులు ఉంటాయి. సుమారు 20 నుంచి 22 టన్నుల కాయలు ఒక లారీలో తరలిస్తున్నారు. సగటున రోజుకు నగరానికి రెండు లారీల చొప్పున వస్తున్నాయి. అక్కడి నుంచి జిల్లాకు రవాణా చేయడానికి రూ.లక్షకుపైగా బాడుగ చెల్లిస్తున్నారు. ఒక్కొక్క బాక్సులో పరిమాణాన్ని అనుసరించి 80 నుంచి 240 వరకు ఉంటాయి. ఒక్కొక్క బాక్సు నగరానికి చేరేసరికి రూ.1200 నుంచి రూ.2500 ధరకు విక్రయిస్తున్నారు. గతంలో ఇది రూ.3500 వరకు ఉండేదని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడి మార్కెట్‌లో ధర తక్కువగా ఉండటంతో ఎక్కువ సరకు తెప్పించుకుని జిల్లాలోని శీతల గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. దీపావళి తర్వాత సిమ్లా యాపిల్‌ లభ్యత తగ్గుతుంది. ఆ సమయంలో శీతల గోదాముల్లో నిల్వ చేసిన వాటిని మార్కెట్‌కు తరలించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కిలో రూ.100 చొప్పున నెల రోజులుగా నిలకడగా ఉండగా దీపావళి వరకు ఇదే ధరలు కొనసాగే అవకాశముందని తెనాలికి చెందిన టోకు వ్యాపారి ఒకరు తెలిపారు. విజయవాడలోని హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌ నుంచి చీరాల, బాపట్లకు తీసుకొచ్చి, అక్కడి నుంచి తీరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రోజూవారీ విక్రయాలు బాగానే సాగుతున్నటు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని