logo

రహదారి ప్రమాదంలో దంపతుల మృతి

చికిత్స నిమిత్తం చెన్నై వెళ్లిన ఆ దంపతులు తిరిగి స్వస్థలం వస్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషాదమిది. ఘటనలో వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు బైపాస్‌లోని కొప్పోలు పై వంతెన వద్ద బుధవారం సాయంత్రం

Published : 29 Sep 2022 04:40 IST

టిప్పర్‌ను ఢీకొన్న కారు

దంపతులు దుర్మరణం.. కుమారుడికి తీవ్ర గాయాలు

సీతారామయ్య, సుశీలదేవి (పాతచిత్రం)

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: చికిత్స నిమిత్తం చెన్నై వెళ్లిన ఆ దంపతులు తిరిగి స్వస్థలం వస్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషాదమిది. ఘటనలో వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు బైపాస్‌లోని కొప్పోలు పై వంతెన వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఔషధ దుకాణం నిర్వహిస్తున్న కందకట్ల సీతారామయ్య(62) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. చికిత్స నిమిత్తం ఇటీవల సీతారామయ్య, భార్య సుశీలదేవి(55) చెన్నై వెళ్లారు. అక్కడ చూపించుకొని బుధవారం సొంత కారులో సత్తెనపల్లి బయలుదేరారు. కారును వారి పెద్ద కుమారుడు శ్రీనివాసరావు నడుపుతున్నారు. సాయంత్రం 3.40 గంటల సమయంలో ఒంగోలు సమీపంలోని కొప్పోలు పై వంతెన వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ వెనుకభాగాన్ని వీరి కారు ఢీకొంది. దంపతులిద్దరూ అక్కడకక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తాలుకా పోలీస్‌ స్టేషన్‌ సీఐ వి.శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీతారామయ్య, సుశీలదేవిల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు సర్వజన వైద్యశాలకు తరలించారు.


ఆనందంగా వస్తూ.. అనంతలోకాలకు..

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: కుటుంబ పెద్దకు గుండె సంబంధిత సమస్య ఉండటంతో చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకుని.. ఇక పరవాలేదన్న ఆనందంతో ఆ కుటుంబం స్వస్థలానికి బయలుదేరింది. ఇంటికి చేరేలోపే దారి మధ్యలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మాటేసి దంపతులను బలి తీసుకుంది. ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనతో సత్తెనపల్లిలో విషాదం అలముకుంది.

* పట్టణంలోని పాత పోలీసు స్టేషన్‌ ఎదురుగా శ్రీనివాస మెడికల్స్‌ అండ్‌ ఫ్యాన్సీ స్టోర్‌ను నాలుగు దశాబ్దాలుగా కందకట్ల సీతారామయ్య నడిపేవారు. ఇంటి ముందుభాగంలో ఔషధ దుకాణం ఉంది. ఆయనకు వ్యాపారంలో భార్య సుశీలదేవి సహకరించే వారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుమారులు శ్రీనివాసరావు అలియాస్‌ వాసు, శివనాగేశ్వరరావు అలియాస్‌ శివ తండ్రితో పాటు దుకాణంలో పని చేస్తున్నారు.

నెల క్రితం చెన్నై వెళ్లి తిరిగివస్తూ.. సీతారామయ్యకు 11 ఏళ్ల క్రితం గుండెకు బైపాస్‌ సర్జరీ చేశారు. మళ్లీ గుండె సంబంధిత సమస్య రావడంతో నెల క్రితం గతంలో శస్త్రచికిత్స చేయించుకున్న చైన్నెలోని ఆసుపత్రిలో చేరారు. 20 రోజుల క్రితం ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. చెన్నైలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్న కుమార్తె పూర్ణ ఇంట్లో పది రోజుల పాటు ఉన్నారు. చెన్నై ఆసుపత్రిలో చెకప్‌ అనంతరం పెద్ద కుమారుడు శ్రీనివాసరావు సొంత కారులో వారిని తీసుకొస్తుండగా ఒంగోలు శివారు కొప్పోలు వంతెనపై ప్రమాదం జరిగి సీతారామయ్య, సుశీలాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉందని తెలిసి ఆయన భార్య లక్ష్మి, సోదరుడు ఆందోళన చెందుతున్నారు .రోటరీ క్లబ్‌ పట్టణ శాఖలో సీతారామయ్య గతంలో క్రియాశీలకంగా పని చేశారు.

తమ్ముడి మృతి షాక్‌ నుంచి కోలుకోక ముందే.. కందకట్ల సీతారామయ్య సోదరుడు కొండలరావు ఆగస్టు 21న వినాయక రెస్టారెంట్‌లోని మురుగు గుంతలో పడి మృతి చెందారు. ఆ షాక్‌ నుంచి కోలుకోక ముందే వారి సోదరుల కుటుంబాల్లో విషాదం అలముకుంది.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని