logo

గుండె గుబులొద్దు!

ఇంజినీరింగ్‌ రెండో ఏడాది విద్యార్థి(21) ఛాతీ నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. పొగ తాగటం, మాదక ద్రవ్యాల వాడకంతో గుండె పోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

Published : 29 Sep 2022 04:40 IST

నేడు ప్రపంచ హృదయ దినోత్సవం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

గుండెజబ్బుల విభాగం

ఇంజినీరింగ్‌ రెండో ఏడాది విద్యార్థి(21) ఛాతీ నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. వైద్యులు వెంటనే స్పందించి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. పొగ తాగటం, మాదక ద్రవ్యాల వాడకంతో గుండె పోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు.

సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌(28). వివాహమై రెండేళ్లే. ఉన్నట్టుండి కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో మెరుగైన చికిత్స అందించడంతో కోలుకున్నాడు. దీర్ఘకాలంగా ఒత్తిడిలో గడుపుతున్నందునే గుండెపోటు వచ్చిందని వైద్యులు గుర్తించారు.

మన ప్రాణాలను నిలబెట్టేది గుండేనని తెలుసు.. అయినా దాన్ని కనిపెట్టుకుని కాపాడుకోవడంలోనే ఎక్కడో తడబడుతున్నాం. నేటికీ మన జిల్లాలో గుండె జబ్బులే అతిపెద్ద మరణ కారణంగా నిలుస్తుండటం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. వీరిలో పిల్లలు, యువకులు, స్త్రీలు, వృద్ధులు అన్ని వయసుల వారూ ఉంటున్నారు. నిజానికి ఇవన్నీ చాలావరకూ నివారించదగ్గ మరణాలే. మనం ఆరోగ్యకరమైన బాటలో పయనిస్తే చాలు.. గుండె జబ్బులు మన జోలికి రావు. కాబట్టి దారి తెలిసిన తర్వాత గమ్యం తప్పడం అర్థరహితం. అందుకే ఈ ఏడాది ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన బాట పడదాం రండి అంటూ ప్రత్యేకంగా పిలుపునిస్తోంది ప్రపంచ హృదయ సమాఖ్య. గుండెతో ఆత్మీయ బంధం ఏర్పరచుకోండని నినదిస్తోంది. దీనిపై ‘న్యూస్‌టుడే’ సమగ్ర కథనం ఇది.

గుండెపోటు లక్షణాలు: ఆయాసం, నీరసం నిస్సత్తువ, దవడ, చేయి, మెడ నొప్పులు, ఛాతీ నొప్పి, కడుపు నొప్పి, గుండె దడ

గుండెపోటు ముప్పులు: పొగ తాగటం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, మానసిక ఒత్తిడి, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం

జీజీహెచ్‌లో భరోసా పరీక్షలు: గుండెలో పూడికలు ఉన్నాయా? లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు సర్వజనాసుపత్రిలో ఈసీజీ, ఎకో కార్డియోగ్రామ్‌(ఎకో), ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌(టీఎంటీ) వంటి పరీక్షలు చేస్తారు. కొంతమంది మూడు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ఆధారంగా గుండెలోని రక్తనాళాల్లో ఎక్కడైనా పూడికలున్నట్టు బలంగా అనుమానిస్తే యాంజియోగ్రామ్‌ పరీక్షకు పంపిస్తారు.

యాంజియోగ్రామ్‌: గుండె రక్తనాళాల్లో పూడికలున్నాయా? లేదా? ఉంటే మూడు రక్తనాళాల్లో ఎన్నింటిలో పూడికలు వచ్చాయి? ఎన్ని చోట్ల, ఎంత శాతం పూడుకున్నాయి? వాటితో ఇబ్బంది ఎంత ఉంటుంది? వంటి సమాచారాన్నంతా కచ్చితంగా చెప్పే అత్యంత ప్రామాణికమైన పరీక్ష ఇది. ఇందుకు అవసరమైన అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌ జీజీహెచ్‌లో ఉంది. గుండెలోని రక్తనాళాల్లో పూడిక ఉన్నప్పుడు బైపాస్‌ ఎవరికి? స్టెంట్‌ ఎవరికి అన్నది కూడా ఇక్కడే నిర్ధారిస్తారు. స్టెంట్‌ అమర్చే ప్రక్రియ కూడా అక్కడే పూర్తి చేస్తారు. గుండె జబ్బుల చికిత్స కోసం వచ్చేవారు సోమ, బుధ, శుక్రవారాల్లో పొరుగు రోగుల విభాగంలో 10వ నెంబరు గదికి రావాలి. ముందుగా 2వ నెంబరులో పేరు నమోదు చేయించుకోవాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే తప్పకుండా తీసుకురావాలి.

అందుబాటులో అత్యాధునిక చికిత్సలు: గుంటూరు సర్వజనాసుపత్రిలో గుండె జబ్బుల నిర్ధారణ, చికిత్సల కోసం అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. గతంలో ఈ చికిత్సల కోసం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లేవారు. ప్రస్తుతం ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి కూడా చికిత్సకు వస్తుండటం గమనార్హం.

క్యాథ్‌ల్యాబ్‌​​​​​​​

యువ గుండెకు షాక్‌

ఇటీవల చిన్నవయసులోనే ఎంతోమంది గుండెపోటు బారిన పడటం కలవరం కలిగిస్తోంది. ఊపిరితిత్తులకు, గుండెకు మధ్య రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం ఎక్కువగా చూస్తున్నాం. యువకులు పొగ, మద్యానికి బానిసలు కావడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు ప్రారంభించే ముందు ఒకసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. గుండెజబ్బులేవైనా ఉంటే గుర్తించి జాగ్రత్త పడటానికి వీలుంటుంది. కరోనా అనంతరం గుండె జబ్బులు పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. చిన్న చిన్న పరీక్షలతోనే గుండె జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించొచ్ఛు మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి చేస్తే మేలు. నిత్యం మన ఆహారంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వల్ల గుండెకు ప్రయోజనం చేకూరుతుంది. - కారుమూరి శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, గుంటూరు

తాత్సారం చేయొద్దు

గుండెపోటు తీవ్రమైన సమస్య. అందువల్ల అంతకుముందు లేకుండా కొత్తగా ఏవైనా ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తే తాత్సారం పనికిరాదు. వయసు మీద పడటం వల్ల, ఎక్కువ పని చేయడం వల్ల ఆయాసం వచ్చిందనో, రాత్రి ఒక పక్కకు తిరిగి పడుకోవటం వల్ల మెడనొప్పి వచ్చిందనో, తిన్నది సరిగా అరగకపోవటం వల్ల కడుపు ఉబ్బిందనో మనకు మనమే సమాధాన పడటం తప్ఫు అసలు కారణం ఏంటన్నది ఆసుపత్రికి వెళ్లి నిర్ధారించుకోవడం మంచిది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత నిర్లక్ష్యం అసలే పనికిరాదు. ఇలాంటి లక్షణాలు గుండె సమస్యకు సంబంధించినవి కాదని కచ్చితంగా తీసిపారేయలేం. ఒకవేళ గుండెపోటుతో ముడిపడిన లక్షణాలైతే ముందుగానే జాగ్రత్త పడటానికి వీలుంటుంది. - ఆచార్య శ్రీకాంత్‌, గుండె జబ్బుల విభాగం అధిపతి, సర్వజనాసుపత్రి, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని