logo

బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణ దిమ్మె కూల్చివేత

వెనుకబడిన సామాజికవర్గ పితామహుడు బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు చేసిన దిమ్మెను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన అమరావతి రోడ్డు

Published : 29 Sep 2022 04:40 IST

బీసీ సంఘాల నాయకుల నిరసన

నేడు అధికారులను కలిసేందుకు సన్నాహాలు

బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణ ప్రాంతం వద్ద రోడ్డుపై భైటాయించి

నిరసన తెలుపుతున్న బీసీ సంఘాల నాయకులు

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: వెనుకబడిన సామాజికవర్గ పితామహుడు బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు చేసిన దిమ్మెను నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేయడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన అమరావతి రోడ్డు ఇన్నర్‌రింగ్‌రోడ్డు కూడలిలోని డివైడర్‌పై బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, నాయకుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. విగ్రహాన్ని నిలిపేందుకు ఏర్పాటు చేసిన దిమ్మెను మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నం చేస్తే బీసీ నాయకులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసిన తర్వాత ఎవరికీ చెప్పకుండా దిమ్మెను కూల్చివేశారు. దీనిపై బీసీ సంఘాల నాయకులు నగరపాలక సంస్థ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. తక్షణం నగరపాలక సంస్థ అధికారులు విగ్రహ దిమ్మెను ఏర్పాటు చేయాలంటూ రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బి.పి.మండల్‌ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు, వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విగ్రహ నిర్మాణం కోసం ఏడాది కిందటే జిల్లా కలెక్టర్‌కు అనుమతి కోరుతూ వినతిని అందించామని, ఇటీవల నగరపాలక సంస్థ అధికారులకు, మేయర్‌కు వినతులు అందించామని తెలిపారు. శంకుస్థాపన జరిగి పనులు జరుగుతుండగా నగరపాలక సంస్థ అధికారులు అడ్డుపడటం సరికాదన్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పేరయ్య మాట్లాడుతూ నగరంలో అనేక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, వాటన్నింటికి అనుమతులున్నాయా అని ప్రశ్నించారు. దిమ్మెను పడగొడుతూ కనీస సమాచారం ఇవ్వకుండా నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై బీసీ నాయకులంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంతో అమరావతి రోడ్డులో ట్రాఫిక్‌ పెద్ద ఎత్తున నిలిచింది. పోలీసులు నిరసనకారుల వద్దకు చేరుకుని, సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం ట్రాఫిక్‌ను నియంత్రించారు. నిరసనలో బీసీ సంఘాల నాయకులు తాళ్ల నాగరాజు, దాసరి శివకుమార్‌, కె.సుబ్రహ్మణ్యం, తాళ్ల శ్రీనివాసరావు, పెద్దిబోయిన బాలయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.

కూల్చివేసిన దిమ్మె​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని