logo

అడ్డుకట్ట.. ఆక్వా రైతు మునక

గుత్తేదారు నిర్లక్ష్యం మత్స్యకారులు, ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. 216ఎ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మండల పరిధిలోని నందిరాజుతోట- హైదర్‌పేట గ్రామాల మధ్య నల్లమడ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే.

Published : 02 Oct 2022 05:32 IST

నల్లమడ వాగుపై వ్యర్థాలతో కలగలిసిన మట్టితో వేసిన కట్ట

బాపట్ల, న్యూస్‌టుడే : గుత్తేదారు నిర్లక్ష్యం మత్స్యకారులు, ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. 216ఎ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మండల పరిధిలోని నందిరాజుతోట- హైదర్‌పేట గ్రామాల మధ్య నల్లమడ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. దీని నిర్మాణ పనుల్లో వినియోగించే భారీ వాహనాల రాకపోకలకు అనువుగా వాగులో నీటి ప్రవాహానికి అడ్డుగా వ్యర్థాలతో మట్టి కట్ట పోశారు. బాపట్ల పట్టణం, కర్లపాలెం డంపింగ్‌ యార్డు నుంచి ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు తీసుకొచ్చి మట్టిలో కలిపి వాగులో అరవై శాతం మేర నీటి ప్రవాహానికి అడ్డుగా కట్టపోశారు. నీటి ప్రవాహ వేగానికి వ్యర్థాలు కొట్టుకుపోతున్నాయి. నల్లమడ వాగు దిగువన ముత్తాయపాలెం, తూర్పు, పడమర పిన్నిబోయినవారిపాలెం, కప్పలవారిపాలెంలో వెయ్యి ఎకరాలకు పైగా ఆక్వా చెరువులు ఉన్నాయి. రైతులు వాగు నుంచి నీటిని మోటార్లతో చెరువులోకి తోడి రొయ్యలు సాగు చేస్తున్నారు. నందిరాజుతోట వద్ద వేసిన కట్ట నుంచి ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలు నీటిలో కొట్టుకొచ్చి మోటార్ల పైపులకు అడ్డుపడుతున్నాయి. రొయ్యల సాగుకు కలుషితం కాని నీరు అవసరం. వ్యర్థాల వల్ల వాగులో నీరు కలుషితంగా మారటంతో చెరువుల్లోకి తోడటానికి రైతులు భయపడుతున్నారు. కలుషిత నీటితో వైరస్‌ ప్రబలి రొయ్యలు చనిపోతే రూ.లక్షల్లో నష్టపోతామని వాపోతున్నారు. మత్స్యకారులు వాగులో చేపలు పట్టడానికి వేసిన వలల్లో వ్యర్థాలు చిక్కుకుని అవి దెబ్బతింటున్నాయి. వంతెన నిర్మాణానికి మట్టి కట్ట వేయాలి కానీ వ్యర్థాలతో కట్ట వేసి ఆక్వా సాగును ప్రమాదంలోకి నెట్టారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి ఖర్చు తగ్గించుకోవటానికి ఇలా చేయడం తగదంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని