logo

నిషేధిత జాబితాలోకి అనధికార లేఔట్‌

గుంటూరు నగరం అంకిరెడ్డిపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్థిరాస్తి వెంచర్‌లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చాలని కోరుతూ పట్టణ ప్రణాళిక విభాగం రాష్ట్ర సంచాలకులకు (డీటీసీపీ).. గుంటూరు కార్పొరేషన్‌ అధికారులు లేఖ రాశారు.

Published : 02 Oct 2022 05:32 IST

డీటీసీపీకి లేఖ రాసిన నగరపాలక సంస్థ అధికారులు
నోటీసులిచ్చి తర్వాత పట్టించుకోకపోవడంపై కమిషనర్‌ ఆగ్రహం

ఈనాడు-అమరావతి: గుంటూరు నగరం అంకిరెడ్డిపాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్థిరాస్తి వెంచర్‌లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆ సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చాలని కోరుతూ పట్టణ ప్రణాళిక విభాగం రాష్ట్ర సంచాలకులకు (డీటీసీపీ).. గుంటూరు కార్పొరేషన్‌ అధికారులు లేఖ రాశారు. వెంచర్‌ నిర్వాహకులకు కూడా అందులో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఆదేశించారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంచర్‌ నిర్మాణ సమయంలోనే గుర్తించి నోటీసు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యం వహించడంపై కమిషనర్‌ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం ప్రణాళికాధికారులతో సమావేశమయ్యారు. ఈ వెంచర్‌పై పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. 40 అడుగుల రహదారి నిర్మాణం చేపట్టి చుట్టూ ప్రహరీ నిర్మించే వరకు, అటుగా ఎందుకు వెళ్లలేదని ఆ ప్రాంత ఏసీపీ, సూపర్‌వైజర్‌, సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీలపై కమిషనర్‌ మండిపడ్డారు. నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోతే సరిపోతుందా? అని ప్రశ్నించారు. దీనికి యంత్రాంగం నుంచి సమాధానం కరవైంది.

విచారణకు ఆదేశించినా.. చర్యలు కరవు

నగరంఓలని మణిపురం బ్రిడ్జికి సమీపంలో మరో అనధికారిక లేఔట్‌లో క్రయ, విక్రయాలు చేయడం వల్ల నగరపాలక సంస్థకు ఓపెన్‌స్పేస్‌ కింద రావాల్సిన సుమారు 4 వేల గజాల స్థలం రాలేదు. అదే విధంగా పరిశ్రమల నుంచి రెసిడెన్షియల్‌ జోన్‌లోకి మార్చారు. కానీ ఎలాంటి కన్వర్షన్‌ ఛార్జీలు చెల్లించకుండా దాన్ని ఇప్పటికే విక్రయించేశారు. ఆ లేఔట్‌పై అప్పటి మున్సిపల్‌శాఖమంత్రి బొత్స సత్యనారాయణ విచారణకు ఆదేశించారు. తర్వాత ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిషేధిత జాబితాలో పెడుతున్నామని అధికారులు మౌఖికంగా తెలియజేసి మిన్నకుండిపోయారు. దానిలో ప్లాట్లు చాలావరకు రిజిస్ట్రేషన్లు అయ్యాయని తెలుసుకుని ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలను మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు కోరినట్లు సమాచారం. ఒక పక్క కళ్లముందే మణిపురం బ్రిడ్జికి సమీపంలోని లేఔట్‌లో ఓపెన్‌స్పేస్‌ కింద 10 శాతం స్థలం రాలేదని ఉన్నతాధికారులు నివేదిక కోరినా, అంకిరెడ్డిపాలెం లేఔట్‌ విషయంలోనూ ప్రణాళికాధికారులు అప్రమత్తం కాకపోవడం వారి నిర్వాకాన్ని తెలియజేస్తోంది.

అనధికార నిర్మాణంపైనా అంతే..

లాలాపేట నూకాలమ్మ గుడికి సమీపంలో జీ+1కు అనుమతి తీసుకుని ఏకంగా నాలుగంతస్తులు నిర్మించారు. దానిపై నగర కమిషనర్‌ నెల కిందటే విచారణకు ఆదేశించారు. ఇప్పటి వరకు కనీసం దాని కూల్చివేతకు చర్యలు తీసుకోలేదు. పనులు చేపట్టరాదని భవన యజమానికి నోటీసులిచ్చి ఊరుకున్నారు. అయినా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. దాని కూల్చివేతకు కార్యాచరణ రూపొందిస్తున్నామని నగర ప్రణాళికాధికారి జీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. ఆ భవనం పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకునే వరకు ఆ ప్రాంత టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌, ప్లానింగ్‌ కార్యదర్శులు మౌనం దాల్చడంపైనా వారి నుంచి వివరణ కోరామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని