logo

ఇంకా బడిబయటే పిల్లలు!

ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డుల్లో విద్యార్థుల పేర్లు ఉంటున్నా చాలా మంది రావడం లేదు. వారి వివరాలు ప్రత్యేకంగా డ్రాప్‌బాక్సులో నమోదు చేస్తున్నారు. ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఎందుకు ఉంటున్నాయి, వాటికి కారణాలేమిటని గత రెండు నెలలుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి అడుగుతున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదు.

Updated : 02 Oct 2022 05:53 IST

కమిషనర్‌ కార్యాలయ ఉద్యోగుల విచారణలో వెల్లడి
బయటపడుతున్న విద్యాశాఖ అధికారుల నిర్వాకం


గుంటూరు కేవీపీకాలనీలో బడిబయట ఉన్న పిల్లల్ని గుర్తించి స్కూల్‌ బ్యాగులు పంపిణీ చేయిస్తున్న కమిషనర్‌ కార్యాలయ అధికారులు

ఈనాడు-అమరావతి  : ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డుల్లో విద్యార్థుల పేర్లు ఉంటున్నా చాలా మంది రావడం లేదు. వారి వివరాలు ప్రత్యేకంగా డ్రాప్‌బాక్సులో నమోదు చేస్తున్నారు. ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఎందుకు ఉంటున్నాయి, వాటికి కారణాలేమిటని గత రెండు నెలలుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి అడుగుతున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదు. దీంతో కమిషనర్‌ తన కార్యాలయం అధికారులను నేరుగా రంగంలోకి దింపారు. అసలు గుట్టు బయట పడింది. చాలామంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారని గుర్తించారు. కమిషనర్‌ కార్యాలయంలోని ఐటీ విభాగం ఉద్యోగులను జిల్లాల వారీగా పంపి డ్రాప్‌బాక్సులో ఉన్న విద్యార్థుల వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మూడు రోజుల నుంచి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఐటీ విభాగం ఉద్యోగులు రమేష్‌, వెంకట్రావు పర్యటిస్తున్నారు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఉన్న ఎమ్మార్సీ కార్యాలయాలకు వెళ్లి విద్యార్థుల వివరాలు ధ్రువీకరించుకుంటున్నారు. ఛైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థి, వారి తల్లిదండ్రుల చిరునామా, చరవాణి నంబర్లు ఉంటాయి. వారికి ఫోన్లు చేస్తే వారి దృష్టికి విస్తుపోయే అంశాలు వచ్చాయి.

కేవీపీ కాలనీలో 30 మంది గుర్తింపు

గుంటూరు కేవీపీ కాలనీ, పరిసరాల్లో సుమారు 30 మంది పిల్లలు బడి బయట ఉన్నారని గుర్తించారు. దారిద్య్రరేఖకు అట్టడుగున ఉండే వారు చాలా వరకు ఆ కాలనీలోనే ఉంటారు. కొందరు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మీ పిల్లలను ఎందుకు బడికి పంపటం లేదని ప్రశ్నించగా, గతంలో జాతీయ బాలకార్మికుల పాఠశాలలు(ఎన్‌సీఎల్‌పీ స్కూళ్లు) తమ ప్రాంతంలో ఉండేవని, గతేడాది నుంచి మూసేశారని, దీంతో ఎక్కడ చేర్పించాలో తెలియడం లేదని చెప్పారు. ఆ ఇద్దరు అధికారులు నేరుగా శనివారం కేవీపీ కాలనీలోకి వెళ్లారు. వారు పర్యటించిన ప్రాంతాల్లో కొందరు పిల్లలు రహదారులపై ఆడుకుంటూ ఉండగా, మరికొందరు చిత్తుకాగితాలు ఏరుకునే వృత్తిలో తల్లిదండ్రులతో పాటు కనిపించారు. వారితో అధికారులు మాట్లాడి పిల్లల్ని బడికి పంపాలని, ప్రభుత్వమే ఉచితంగా భోజనం పెడుతుందని, పుస్తకాలు, బ్యాగ్‌లు అందిస్తామని చెప్పటంతో అంగీకరించారు. గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఖుద్దూస్‌, అర్బన్‌ డీఐ ఖాశింలను పిలిపించి ఆ పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు అందపజేసి వారి వయస్సుల ఆధారంగా ప్రధాన స్కూళ్లల్లో చేర్పించాలని, దసరా సెలవులు ముగియగానే బడులకు వెళ్లేలా చూడాలని చెప్పారు. ఎంఈఓ వారి వివరాలు మొత్తం నమోదు చేసుకున్నారు. కమిషనర్‌ ఆదేశాలతో బృందాలు నేరుగా రంగంలోకి దిగడంతో కేవలం గుంటూరులో ఒకే ఒక్క కాలనీలోనే 30 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు తేలింది. నగరం అంతటా పర్యటిస్తే వందల సంఖ్యలో పిల్లలు నిగ్గు తేలుతారని అధికారులు భావిస్తున్నారు. పల్నాడు, బాపట్ల జిల్లాలో కూడా ఇలాంటి ఉదంతాలు వారి దృష్టికి వచ్చాయి.  

పట్టించుకోని సమగ్రశిక్ష అధికారులు

వాస్తవానికి ఈ వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఎంఈఓ, స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు డ్రాప్‌బాక్సులో క్లియర్‌ చేస్తే విద్యార్థుల వివరాలు గుట్టలుగా పేరుకుపోయేవి కావని అధికారులు చెబుతున్నారు.  ఉమ్మడి గుంటూరు జిల్లాలో 27 వేల మంది విద్యార్థుల వివరాలు డ్రాప్‌బాక్సులోకి చేరాయని వారు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదని క్షేత్రస్థాయిలో పర్యటించిన బృందాలు తెలిపాయి. సమగ్ర శిక్ష అధికారుల నిర్లక్ష్యంతో వందల సంఖ్యలో బడికి దూరంగా పిల్లలు ఉంటున్నారని తమ పరిశీలనలో తేలిందని, దీనిపై కమిషనర్‌కు నివేదిక పంపుతామని వెల్లడించారు. గుంటూరుతో పాటు పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయని ఓ అధికారి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు