logo

3 నాటికి ఉపాధి పనుల గుర్తింపు

జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులను గుర్తించేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టరు ఎం.యుగంధర్‌కుమార్‌ తెలిపారు. నగరంలోని స్వశక్తి భవనాల

Published : 02 Oct 2022 05:37 IST

‘న్యూస్‌టుడే’తో డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌

- జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే

జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులను గుర్తించేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టరు ఎం.యుగంధర్‌కుమార్‌ తెలిపారు. నగరంలోని స్వశక్తి భవనాల సముదాయంలో ఆయన ‘న్యూస్‌టుడే’తో ప్రత్యేకంగా ‘ముఖాముఖి’ మాట్లాడారు. వివరాలివీ.

న్యూస్‌టుడే: 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు ఎంత వరకు చేశారు? సాధించిన ప్రగతి ఏమిటి?
పీడీ: ప్రస్తుత సంవత్సరంలో 17 లక్షల మందికి పని దినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికి 22.23 లక్షల మందికి పని దినాలు కల్పించి 146 శాతం ప్రగతిని సాధించాం. ఇది రికార్డు స్థాయిలో సాధించిన ప్రగతిగా చెప్పుకోవచ్చు.

న్యూస్‌టుడే: కూలీలకు ఎంత మొత్తంలో వేతనాలు చెల్లించారు?
పీడీ: జిల్లాలో ఉపాధి పనుల కోసం 4.32 లక్షల మంది జాబ్‌కార్డులు పొందారు. వీరిలో 2.28 లక్షల మంది పనుల్లోకి వస్తున్నారు. మొత్తం రూ.57.5 కోట్ల మేరకు పనులు జరిగాయి. కూలీల కోసమే రూ.46.03 కోట్లను చెల్లించాం. ఇది 80 శాతం. వేసవిలో జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే పనులు చూపెట్టడం ద్వారా వలసలను నివారించి ఉపాధి కల్పించాం. మెటీరియల్‌ కాంపొనెంట్‌, పరిపాలన ఖర్చుల కోసం మిగిలిన 20 శాతం నిధులు ఖర్చు చేశాం.

న్యూస్‌టుడే: ప్రాజెక్ట్‌ అమృత్‌ సరోవర్‌ చెరువుల నిర్మాణాలు ఎంత వరకు చేశారు?
పీడీ: భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా జిల్లాకు ప్రాజెక్టు అమృత్‌ సరోవర్‌ కింద 75 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకం నిధులతో చెరువులను సుందర, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నాం. ఇప్పటికి 25 చెరువుల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2023, జనవరి లోపు మిగిలిన 50 చెరువులను అభివృద్ధి చేస్తాం. ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.

మొక్కల పెంపకం కోసం ఏం చర్యలు తీసుకున్నారు?
పీడీ: గతంలో అవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలను కొనుగోలు చేసి గ్రామాలకు వెళ్లే రహదారుల్లో నాటాం. సంరక్షణ చర్యలు లేకపోవడంతో పాటు ఇతరత్రా కారణాలతో వీటిలో సగం మొక్కలు చనిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పేరేచర్ల, దుగ్గిరాలలో సొంతంగా డ్వామా నర్సరీలు మూడు ఏర్పాటు చేశాం. ఒక్కో నర్సరీలో లక్ష చొప్పున మూడు లక్షల మొక్కలను పెంచి ఉచితంగా గ్రామ పంచాయతీలతో పాటు ప్రజలకు పంపిణీ చేయనున్నాం. దీనివల్ల నిధుల వృథాను అరికట్టవచ్చు. నర్సరీల్లో పలు రకాల మొక్కలను పెంచుతున్నాం. త్వరలోనే పంపిణీని చేపడతాం.

2023-24 సంవత్సరంలో ఉపాధి పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా?
పీడీ: ప్రస్తుతం వర్షాకాలంలో ఉపాధి పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో 2023-24 సంవత్సరంలో 4.32 లక్షల మంది జాబ్‌కార్డులు పొందిన వారికి ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించనున్నారు. దీనికోసం అక్టోబరు 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని 277 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించాలని మండలాధికారులను ఆదేశించాం. సర్పంచులు స్థానికంగా చేయడానికి వీలున్న పనుల గురించి తెలియజేస్తే మా సిబ్బంది నమోదు చేసుకుంటారు. నవంబరు 3వ తేదీ నాటికి అన్ని గ్రామాల్లో పనులను గుర్తించి జిల్లా కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. స్థానికంగా చేయడానికి వీలున్న పనులను ఖరారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతాం. అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత వేసవిలో పనులు ప్రారంభిస్తాం. 100 రోజుల్లో పనులు పూర్తి చేసి ఎక్కువ మంది కూలీలను పనుల్లోకి తీసుకొచ్చేలా సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని