logo

వరదల్లే.. విద్యుత్తు వెలుగులు

కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ సీజన్‌లో  ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూన్‌ నెలలోనే వరద ప్రారంభమై ఇప్పటి వరకు  కొనసాగుతూనే ఉంది. దీంతో కృష్ణానదిపై ఉన్న జలాశయాలు గరిష్ఠ నీటి సామర్థ్యంతో ఉండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది

Updated : 07 Oct 2022 06:44 IST

సీజన్‌ ఆరంభం నుంచి  సాగర్‌ జలాశయానికి భారీగా నీటి ప్రవాహం

కుడిగట్టు వద్ద 72.79 ఎంయూ యూనిట్లు
టెయిల్‌ పాండ్‌ వద్ద  20.39 మిలియన్‌ యూనిట్లు

ఈనాడు, నరసరావుపేట

కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ సీజన్‌లో  ఆశించిన స్థాయిలో వర్షాలు పడటంతో నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూన్‌ నెలలోనే వరద ప్రారంభమై ఇప్పటి వరకు  కొనసాగుతూనే ఉంది. దీంతో కృష్ణానదిపై ఉన్న జలాశయాలు గరిష్ఠ నీటి సామర్థ్యంతో ఉండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలో నాగార్జునసాగర్‌, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ వద్ద జలవిద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. నాలుగు నెలలుగా  నదిలో నీటిలభ్యత ఉండటంతో జలవిద్యుత్తు యూనిట్లు ఈసారి ఎక్కువ రోజులు పని చేశాయి. దీంతో జలవిద్యుత్తు ఉత్పత్తి గతంలో కంటే ఎక్కువగా జరిగింది. కీలకమైన సమయంలో విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులోకి రావడం కలిసొచ్చింది. అత్యంత తక్కువ ఖర్చుతో జెన్‌కో జల విద్యుత్తు ఉత్పత్తి చేసింది. కృష్ణానదికి ఇప్పటికీ వరద కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు జల విద్యుత్తు యూనిట్లు పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయనున్నాయి. ఇప్పటికీ నదిలో 50వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌ కుడిగట్టు మీద ఉన్న జల విద్యుత్తు కేంద్రం ద్వారా ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకు 72.79 మిలియన్‌ యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేశారు. కుడి కాలువకు నీటిని విడుదల చేసే నీటితో కుడిగట్టు జలవిద్యుత్తు కేంద్రం పని చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్క యూనిట్‌ 30 మెగావాట్ల సామర్థ్యంతో మూడు యూనిట్లు కలిపి 90 మెగావాట్ల సామర్థ్యం ఉంది. జలాశయంలో గరిష్ఠ నీటిమట్టం ఉండి కుడి కాలువకు 10వేల క్యూసెక్కులు విడుదల చేస్తే మూడు యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి కాలువలకు నీటి విడుదల చేయడంతో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగింది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటిని తీసుకుంటుండటంతో మూడు యూనిట్లు పని చేస్తున్నాయి. కుడిగట్టు వద్ద ఉత్పత్తి చేసే విద్యుత్తు మొత్తం మన రాష్ట్రానికి వస్తుంది. జలవిద్యుత్తు 24 గంటలూ ఉత్పత్తి చేసే వెసులుబాటుతో పాటు కీలకమైన సమయంలోనూ అందుబాటులో ఉన్నందున జెన్‌కోకు కలిసివచ్చింది. సాగర్‌ కుడి కాలువకు నీరు అవసరమైనప్పుడు విడుదల చేసే నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.

నాగార్జునసాగర్‌ దిగువన 21 కిలోమీటర్ల దూరంలో రెంటచింతల మండలంలో సత్రశాల సమీపంలో నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ నిర్మించారు. సాగర్‌ ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో రివర్సబుల్‌ టర్బయిన్లు ఉన్నాయి. సాగర్‌ జలాశయంలో నీటినిల్వలు తక్కువగా ఉన్నప్పుడు జలవిద్యుత్తు ద్వారా దిగువకు విడుదల చేసిన నీటిని నిల్వ చేసి మళ్లీ తిరిగి జలాశయంలోకి ఎత్తిపోయడానికి నిర్మించినదే టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు. దీని నీటి నిల్వ సామర్థ్యం 6 టీఎంసీలు. ఇక్కడ 6 టీఎంసీలు నీరు నిల్వ చేస్తే నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వరకు బ్యాక్‌వాటర్‌ నిలుస్తుంది. ఈ నీటిని రివర్సబుల్‌ టర్బయిన్ల ద్వారా జలాశయంలోకి ఎత్తిపోస్తారు. అయితే నదికి వరద వచ్చినప్పుడు జలవిద్యుత్తు ఉత్పత్తి చేయడానికి వీలుగా 25 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 50 మెగావాట్ల సామర్థ్యంతో ఇవి పని చేస్తాయి. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ అవసరాలకు విడుదల చేసిన నీటిని ఉపయోగించుకుని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ 2017 సంవత్సరంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఈ ఏడాది నదికి వరుసగా వరదనీరు కొనసాగుతుండటంతో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు యూనిట్లు పని చేస్తున్నాయి. ప్రస్తుతం వరద కొనసాగుతున్నందున పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని