logo

మిర్చి లారీ దొంగలను పట్టించిన జీపీఎస్‌

ఎండు మిర్చి లోడు లారీని అపహరించిన దొంగలను ఆ వాహనంలో అమర్చిన జీపీఎస్‌ పరికరం పట్టించినట్టు డీఎస్పీ జె.రాంబాబు తెలిపారు. పెదకాకానిలో నిందితుల అరెస్టు వివరాలను బుధవారం సీఐ బండారు సురేష్‌బాబుతో కలిసి ఆయన వెల్లడించారు.

Published : 07 Oct 2022 06:08 IST

ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

పట్టుకున్న మిర్చి లోడు లారీ, నిందితులతో డీఎస్పీ రాంబాబు, సీఐ సురేష్‌బాబు

పెదకాకాని, న్యూస్‌టుడే: ఎండు మిర్చి లోడు లారీని అపహరించిన దొంగలను ఆ వాహనంలో అమర్చిన జీపీఎస్‌ పరికరం పట్టించినట్టు డీఎస్పీ జె.రాంబాబు తెలిపారు. పెదకాకానిలో నిందితుల అరెస్టు వివరాలను బుధవారం సీఐ బండారు సురేష్‌బాబుతో కలిసి ఆయన వెల్లడించారు. పెదకాకానికి చెందిన సోమవరపు రవి తాను చేసిన మిర్చి వ్యాపారంలో నష్టాలు రావడంలో అప్పులపాలయ్యాడు. వాటి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆలోచిస్తుండగా.. గుంటూరు నగర శివారులోని మద్దిరాలకాలనీకి చెందిన ముగ్గురితో ఆయనకు పరిచయమైంది. షేక్‌ మస్తాన్‌, షేక్‌ గౌస్‌బాషా, షేక్‌ జాన్‌సైదా అనే ఈ ముగ్గురు స్నేహితులు. వ్యసనాలకు బానిసలైన వీరు సులువుగా డబ్బు సంపాదించాలని అనుకొంటుండగా, వారికి రవి తారసపడ్డాడు. ఈ నలుగురు కలిసి ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి ఆటోనగర్‌ వంద అడుగుల రోడ్డులో నిలిపివుంచిన మిర్చి లోడు లారీని అపహరించాలని నిర్ణయించుకున్నారు. ఆ లారీకి ఇరువైపులా రవి, మస్తాన్‌ కాపలాగా నిలబడగా.. గౌస్‌బాషా, జాన్‌సైదాలు దాని తలుపులకు వేసిన తాళాలు పగలకొట్టి, తీగలు కలిపి లారీ ఇంజిన్‌ స్టార్ట్‌ చేశారు. లారీని పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని ముర్తజాపురం శివారులోకి తీసుకెళ్లారు. అప్పటికే ఆ గ్రామానికి చెందిన ఆవులమంద నాగేశ్వరరావుతో లారీలోని మిర్చిని అమ్మిపెట్టాలని వారు ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నవిధంగా లారీలోని మిర్చి బస్తాలను మరొక వాహనంలో మార్చుతుండగా పోలీసులు దాడిచేసి, నాగేశ్వరరావుతో సహా ఐదుగురినీ పట్టుకున్నట్టు తెలిపారు. లారీ విలువ రూ.8 లక్షలు కాగా, అందులో ఉన్న 365 మిర్చి బస్తాల విలువ రూ.35 లక్షల మేర ఉంటుదని డీఎస్పీ తెలిపారు. వాహనాలను జాగ్రత్త చేసుకోవడం కోసం యజమానులు జీపీఎస్‌ పరికరాన్ని అమర్చుకోవాలని ఆయన సూచించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు