logo

వీడని ముసురు

రెండు రోజులుగా తెరిపివ్వని వానకలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: అల్పపీడన ప్రభావంతో జిల్లాపై వానముసురు పట్టింది. రెండు రోజులుగా వర్షం తెరపివ్వకుండా పడుతూనే ఉంది. పండగ రోజు సైతం కాస్తంత విరామం లేకుండా వర్షం పడుతూనే ఉంది. ప్రజలు బయటకు వెళ్లనివ్వకుండా వర్షం ఆటంకాన్ని ఏర్పరచింది

Published : 07 Oct 2022 06:08 IST

ప్రత్తిపాడు: జగనన్నకాలనీలో వర్షపు నీరు నిలవడంతో అధ్వానంగా రోడ్డు

రెండు రోజులుగా తెరిపివ్వని వానకలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: అల్పపీడన ప్రభావంతో జిల్లాపై వానముసురు పట్టింది. రెండు రోజులుగా వర్షం తెరపివ్వకుండా పడుతూనే ఉంది. పండగ రోజు సైతం కాస్తంత విరామం లేకుండా వర్షం పడుతూనే ఉంది. ప్రజలు బయటకు వెళ్లనివ్వకుండా వర్షం ఆటంకాన్ని ఏర్పరచింది. పట్టణాలు, పల్లెలు వానతో ముసురు పట్టడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. పలు మండలాల్లో భారీ వర్షం కురవటంతో కాల్వలు పొంగిపొర్లాయి.

నగరాన్ని ముంచెత్తిన వాన
గుంటూరు నగరాన్ని వర్షం ముంచెత్తింది.  బుధవారం పండగ రోజు సైతం వర్షం దశల వారీగా కురుస్తూనే ఉంది. గురువారం అదే పరిస్థితి కొనసాగింది. శివారు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు వీలుకాలేదు.  
* జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు సగటున 46.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చేబ్రోలు మండలంలో వంద మిల్లీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. వట్టిచెరుకూరు 75.6, తాడికొండ 65.4, ప్రత్తిపాడు 64.4, తెనాలి 63.2, దుగ్గిరాల 62.8, మంగళగిరి 52.4, తుళ్ళూరు 49.2, పెదకాకాని 45.2, గుంటూరు తూర్పు 39.6, గుంటూరు పశ్చిమ 38.6, ఫిరంగిపురం 23.6, పొన్నూరు 22.4, తాడేపల్లి 18.6, మేడికొండూరు 17.8, కొల్లిపర 15.8, కాకుమాను 12.8, పెదనందిపాడు 11.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే వట్టిచెరుకూరు మండలంలోని గ్రామాల్లో రెండు రోజులుగా కుంభవృష్టిగా వర్షం కురిసింది.  గురువారం వట్టిచెరుకూరు మండల కేంద్రంలో 75.6 మి.మీ వర్షపాతం నమోదైంది. గత మూడేళ్లుగా కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో వట్టిచెరుకూరు, యామర్రు, కాట్రపాడు, చమళ్లమూడి, వింజనంపాడు, ముట్లూరు, కారంపూడిపాడు, లేమల్లెపాడు, అనంతవరప్పాడులో పంట పొలాలపై వరద నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వట్టిచెరుకూరు, యామర్రులలో రైతులు సొంతంగా విరాళాలు సమకూర్చుకుని పొక్లెయినర్‌తో గుర్రపుడెక్క ఆకు తొలగింపునకు ముందుకొచ్చారు.వట్టిచెరుకూరు విద్యుత్‌ ఉపకేంద్రం, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ మూడు అడుగుల లోతున నీరు చేరింది. మండల విద్యావనరుల కేంద్రంలోకి నీరు వెళ్లింది. ఒకటో నంబర్‌ జల్లవాగు కట్టలుపైకి ఎగసిపడుతూ నీరు ప్రవహిస్తోంది.
ప్రత్తిపాడులో 64.4 మి.మీ వర్షపాతం
ప్రత్తిపాడు మండలంలో రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన కురిసిన వర్షాలకు వంగిపురం, మేడవారిపాలెం, తిమ్మాపురం, గింజుపల్లివారిపాలెం, పాతమల్లాయపాలెం గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. గత శుక్రవారం కురిసిన వర్షంతో పత్తి, మిరప, అపరాల పంటలు నీట మునిగాయి. ఊపిరి పోసుకుంటుండగా మరోసారి వర్షం ముంచెత్తింది. ప్రత్తిపాడులో వైద్యశాల, సమీపంలోని నివాసాలను ముంచెత్తుతున్న చిన్న చెరువు గోడను ఈవోపీఆర్డీ మోషే, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు జేసీబీతో తొలగింపజేశారు. జగనన్న కాలనీల్లో భారీగా నీరు నిలిచింది. చినకొండ్రుపాడు, గొట్టిపాడు రోడ్డులో భారీ గుంతల్లో నీరు నిలిచింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు