logo

జింకానా.. నిలుస్తుంది ప్రజల హృదయాన

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగ్గా సేవలు అందించాలని నాడు-నేడు పేరుతో వాటి రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు.

Published : 08 Oct 2022 04:23 IST

జీజీహెచ్‌లో మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులకు శంకుస్థాపన

ఈనాడు-అమరావతి

గుంటూరు జీజీహెచ్‌లో మాతాశిశు సంరక్షణ భవనానికి శంకుస్థాపన సందర్భంగా ప్రసంగిస్తున్న మంత్రి విడదల రజిని. చిత్రంలో సూపరింటెండెంట్‌ ప్రభావతి, డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్‌, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, శ్రీదేవి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, కేఎస్‌ లక్ష్మణరావు

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగ్గా సేవలు అందించాలని నాడు-నేడు పేరుతో వాటి రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో శుక్రవారం డాక్టర్‌ కానూరి రామచంద్రరావు మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులను ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాధారణ జబ్బులకే కాదు కేన్సర్‌ వంటి ఖరీదైన రోగాలకు ఏపీలోనే వైద్యసేవలు అందించాలని, కేన్సర్‌ వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా మహిళల్లో వస్తున్న రొమ్ము కేన్సర్‌, గర్భాశయ కేన్సర్ల నివారణపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. గుంటూరు వైద్య కళాశాలలో చదివి ఉత్తర అమెరికాలో స్ధిరపడిన వైద్యులు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తూ జీజీహెచ్‌ అభివృద్ధికి పాటు పడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ప్రశంసించారు. వారి సేవా నిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం కావాలని సూచించారు. వ్యక్తిగత స్వార్థంతో నిండిపోయిన ఈ రోజుల్లో డాక్టర్‌ గవిని ఉమాదేవి ఏకంగా రూ.22 కోట్లు మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులకు భూరి విరాళంగా ఇవ్వటం అభినందనీయమన్నారు. ఆమె సేవానిరతికి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ప్రశంసించారు. బొంగరాలబీడులోనూ ఆస్పత్రుల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ కరోనాలో గుంటూరు జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్‌కు ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తారని ఈ ఆసుపత్రి అభివృద్ధిలో జింకానా పాత్ర మరువలేనిదన్నారు. తాను మండలి సభ్యునిగా పల్నాడులో కూడా ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరానని, పిడుగురాళ్లలో వైద్య కళాశాల నిర్మాణం ద్వారా ఆ కలనెరవేరబోతుందని తెలిపారు. మండలి విప్‌ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అన్నీ ప్రభుత్వమే చేయలేదని, జింకానా లాంటి సంస్థలు ఉదారంగా ముందుకు వచ్చి చేయూతనివ్వటం గర్వకారణమన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఖాళీలు మొత్తం భర్తీ అయ్యాయని చెప్పారు. ఆస్పత్రిలో 600 పడకలతో మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులు పూర్తయితే ప్రసూతి వైద్యసేవలు మరింత మెరుగవుతాయని చెప్పారు. డాక్టర్‌ గవిని ఉమాదేవి రూ.22 కోట్లు, డాక్టర్‌ మువ్వా వెంకటేశ్వరరావు రూ.22 కోట్లు, డాక్టర్‌ సూరపనేని, డాక్టర్‌ తేళ్ల నళిని రూ.11 కోట్లు చొప్పున 1994-95 బ్యాచ్‌కు చెందిన వైద్యులు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, నామినేటెడ్‌ ఛైర్మన్లు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మందపాటి శేషగిరిరావు. జింకానా తరపున డాక్టర్‌ కళాధర్‌, నాట్కో ట్రస్టు నుంచి డాక్టర్‌ సదాశివరావు, వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ఏపీవీపీ కమిషనర్‌ వినోద్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. మూడేళ్ల క్రితం ఆస్పత్రిలో చేపట్టిన మాతా-శిశు సంరక్షణ కేంద్రం పనులు నిలిచిపోయి తిరిగి వాటిని జింకానా ఆర్థిక సౌజన్యంతో పునఃప్రారంభించటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మంత్రి రజినిని, జింకానా స్థానిక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బాలభాస్కరరావులను ఎమ్మెల్యే ముస్తాఫా, సూపరింటెండెంట్‌ ప్రభావతి అభినందించారు. ఈ కార్యక్రమానికి జీజీహెచ్‌, వైద్య కళాశాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య ప్రభావతి ఐ లవ్‌ ఇండియా, భలే మంచి రోజు అంటూ పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచారు.

సభకు హాజరైన వైద్య సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని