logo

పానకాలస్వామి కొండ...పర్యటక అండ...

మంగళగిరి పానకాలస్వామి కొండను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ సంకల్పించింది. నగరం మధ్యలో ఉన్న కొండపై దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉన్న కొండ ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటుందని గుర్తించారు.

Published : 08 Oct 2022 04:23 IST

ట్రెక్కింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు

న్యూస్‌టుడే, మంగళగిరి

ట్రెక్కింగ్‌ ఏర్పాటు చేసే కొండ

మంగళగిరి పానకాలస్వామి కొండను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అటవీ శాఖ సంకల్పించింది. నగరం మధ్యలో ఉన్న కొండపై దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ఉన్న కొండ ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటుందని గుర్తించారు. దీంతో అటవీ శాఖ ఇందకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఎయిమ్స్‌కు ముఖద్వారం వద్ద నుంచి ట్రెక్కింగ్‌కు అవసరమైన మార్గాలను గుర్తించారు.

రాష్ట్రంలోనే విశాఖ తరువాత 192 చ.కి.మీ మేర విస్తరించిన మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ అతిపెద్ద నగరంగా ఆవిర్భవించింది. అటవీ శాఖ ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. కాలినడకన కొండపైకి వెళ్లేందుకు ట్రెక్కింగ్‌ మార్గాలను పరిశీలించి ఎంపిక చేశారు. వృద్ధులు, యువకులకు వేర్వేరు మార్గాలను ప్రతిపాదించారు. రెండు నెలల్లో దీనిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

కొండపై రమణీయ దృశ్యాలు...

పానకాలస్వామి కొండపై నుంచి చూస్తే చుట్టూ రమణీయమైన దృశ్యలు కనువిందు చేస్తాయి. ఓవైపు ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపించే రాజధాని అమరావతిలోని భవనాలు, మరోవైపు ఎయిమ్స్‌ భవనాలు, మంగళగిరి నగరం పర్యటకులను ఆకట్టుకుంటాయి. పానకాలస్వామి ఆలయం వద్ద నుంచి దేవస్థానం కొండ శిఖరంపైకి మెట్లతో మార్గం ఏర్పాటు చేశారు. తాజాగా కొండ చుట్టూ ఏడు కి.మీ గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మించారు. దీనిని రోజూ ఆరోగ్యం కోసం నడక సాగించే వారు వినియోగించుకుంటున్నారు. భక్తులు గండదీపం సందర్శిస్తున్నారు. కొండపైకి వెళ్లే వారి సౌలభ్యం కోసం తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. గండదీపం కోసం దాతలు రాతి మండప నిర్మాణం చేపడుతున్నారు. భక్తులే కాకుండా యువతీ యువకులను ఆకట్టుకునే రీతిలో అటవీ అధికారులు ట్రెక్కింగ్‌ నిర్వహణకు చర్యలు చేట్టారు. మంగళగిరి కొండను పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.

తీగ మార్గం ఏర్పాటుపై దృష్టి

పర్యటకులను ఆకట్టుకునేందుకు పానకాలస్వామి గుడి వద్ద నుంచి కొండ శిఖరంపై ఉన్న గండాలయస్వామిని భక్తులు దర్శనం చేసుకునేందుకు అనువుగా తీగమార్గం (రోప్‌వే) ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు. ప్రాజెక్టునకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వంతో చర్చించిన తరువాత తీగమార్గం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

టెంపుల్‌ హిల్‌ పార్క్‌

టెంపుల్‌ ఎకోహిల్‌ పార్క్‌ అభివృద్ధి

ఎయిమ్స్‌ ముఖద్వారం పక్కనే నగర ప్రజలు సేద తీరేందుకు అవసరమైన టెంపుల్‌ ఎకో హిల్‌ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. నగరం నుంచి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో చిన్నారులకు ఆటవిడుపుగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేట్టారు. చిన్నారులకు ఆటవస్తువులు, పెద్దలకు జిమ్‌ సౌలభ్యం కల్పించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు సిమెంట్‌ బల్లలను ఏర్పాటు చేశారు.

మూడు జిల్లాల్లో ట్రెక్కింగ్‌ ప్రతిపాదన

గుంటూరు జిల్లా మంగళగిరి, పేరేచర్ల, పల్నాడు జిల్లాలో కొండవీడు, కోటప్పకొండ వంటి కొండలపై ట్రెక్కింగ్‌ ఏర్పాటుకు ప్రతిపాదించాం. ప్రస్తుత జీవనశైలిలో ఇది మంచి వ్యయామం అవుతుంది. కొండపైకి నడక సాగించే సమయంలో వివిధ రకాల ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి దోహదపడుతుంది. రెండు నెలల్లో మంగళగిరి ట్రెక్కింగ్‌ ఆచరణలోకి తీసుకురావాలని భావిస్తున్నాం. - రామచంద్రరావు, అటవీశాఖ జిల్లా అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని