logo

‘రైతుల బతుకులను రాజకీయాలకు బలిచేయొద్దు’

మూడు రాజధానులంటూ నాయకులు తమ బతుకులను రాజకీయాలకు బలిచేయొద్దని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా ఇంకా ఎన్నాళ్లు అమరావతిపై బురద చల్లుతారంటూ ప్రశ్నించారు.

Published : 08 Oct 2022 04:23 IST

వెంకటపాలెంలో వెలుగుతున్న కొవ్వొత్తులు

పట్టుకొని నిరసన తెలుపుతున్న మహిళలు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మూడు రాజధానులంటూ నాయకులు తమ బతుకులను రాజకీయాలకు బలిచేయొద్దని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా ఇంకా ఎన్నాళ్లు అమరావతిపై బురద చల్లుతారంటూ ప్రశ్నించారు. ప్రపంచమంతా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుంటే రాష్ట్ర పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. వైకాపా నాయకులు అవమానపరిచినా, అవరోధాలు కల్పించినా జన ప్రభంజనమై పాదయాత్ర ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి విజ్ఞతతో ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. పాలన వికేంద్రీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గ్రామాల్లో అన్నదాతలు చేస్తున్న నిరసనలు 1025వ రోజుకు చేరాయి. అమరావతి ఐకాస ఆధ్వర్యంలో అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహాపాదయాత్రలో పాల్గొనడానికి శుక్రవారం రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, రైతుకూలీలు, మహిళలు పెద్ద సంఖ్యలో పశ్చిమగోదావరి జిల్లాకు తరలివెళ్లారు. అమరావతిని నిర్మించాలి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, నీరుకొండ, కృష్ణాయపాలెం, తుళ్లూరు, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. వెంకటపాలెంలో వెలుగుతున్న కొవ్వొత్తులు పట్టుకొని మహిళలు నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని