logo

రైతుబజార్లు ఏవి?

కూరగాయలను పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం... వినియోగదారులకు సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందించడమే లక్ష్యంగా రైతుబజార్లు ఏర్పాటయ్యాయి. రోజువారీగా టోకు మార్కెట్‌ను పరిశీలించి మార్కెటింగ్‌ శాఖ ఇక్కడ ధరలు నిర్ణయిస్తుంది.

Published : 08 Oct 2022 04:23 IST

జిల్లా కేంద్రాల్లోనూ తప్పని ఎదురుచూపులు

ఈనాడు, నరసరావుపేట, బాపట్ల

బాపట్లలో ప్రారంభించని రైతుబజారు

కూరగాయలను పండించే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం... వినియోగదారులకు సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందించడమే లక్ష్యంగా రైతుబజార్లు ఏర్పాటయ్యాయి. రోజువారీగా టోకు మార్కెట్‌ను పరిశీలించి మార్కెటింగ్‌ శాఖ ఇక్కడ ధరలు నిర్ణయిస్తుంది. ప్రైవేటు మార్కెట్లతో పోల్చితే తక్కువగా ఉండటంతో వినియోగదారుల ఆదరణ పొందాయి. ప్రయోగాత్మకంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన రైతుబజార్ల వ్యవస్థ విభజిత రాష్ట్రంలోనూ కొనసాగింది. నగరపాలక సంస్థల నుంచి మున్సిపల్‌ పట్టణాల వరకు ఇవి విస్తరించాయి. కొన్ని కారణాలతో బాపట్ల, నరసరావుపేటలో ఇప్పటికీ అవి అందుబాటులో లేవు. గుంటూరు నగరంలో మూడు, తెనాలిలో మూడు, పొన్నూరు, మంగళగిరి, సత్తెనపల్లిలో రైతుబజార్లు ప్రస్తుతం నడుస్తున్నాయి.

నరసరావుపేటలో తొలుత స్టేషన్‌రోడ్డులో గాంధీపార్కు ఎదురుగా రైతుబజారు ఏర్పాటు చేశారు. ఇది పట్టణవాసులకు అనుకూలంగా ఉండటంతో ఎప్పుడూ రద్దీగా ఉండేది. ఇక్కడ వాణిజ్య దుకాణ సముదాయం నిర్మించడంతో మున్సిపల్‌ కార్యాలయం పక్క నున్న స్థలంలో షెడ్లు నిర్మించి అక్కడికి మార్చారు. అనంతరం జనం తగ్గిపోవడంతో కొన్నాళ్లకు మూతపడింది. 2018లో గ్రామీణ పోలీసుస్టేషన్‌ పక్కన 66 దుకాణాలు నిర్మించి రైతుబజారు, మెప్మాబజారు ప్రారంభించారు. ఇక్కడి పరిసరాలు మురుగుతో ఉండటం, పట్టణవాసులకు అనుకూలంగా లేకపోవడంతో వినియోగదారుల ఆదరణ లేక ఏడాదిలోపే మూసేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు రైతుబజారు ఏర్పాటు పట్టా లెక్కలేదు. గుంటూరు, తెనాలి తర్వాత పెద్ద రెవెన్యూ డివిజన్‌, పెద్ద మున్సిపాలిటీగా ఉన్న నరసరావుపేటలో రైతుబజారు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేట నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో 1.32 లక్షల మంది నివాసం ఉంటున్నారు. వీరితోపాటు పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. కొత్త జిల్లా కేంద్రం ఏర్పడి ఆరు నెలలు గడిచినా రైతుబజారు ఊసే లేదు. దీని ఏర్పాటులో మార్కెటింగ్‌ శాఖ వెనుకబడింది. సాధారణంగా కూరగాయల మార్కెట్లు, పండ్ల అమ్మకాలన్నీ మున్సిపల్‌శాఖ ఆధీనంలోని దుకాణాల్లో నిర్వహిస్తారు. నరసరావుపేటలో మున్సిపల్‌ శాఖకు, జనావాసం అధికంగా ఉండే ప్రాంతాల్లో స్థలాలు, భవనాలు, దుకాణాలు ఉన్నాయి. మార్కెటింగ్‌శాఖకు బస్టాండు ఎదురుగా దుకాణాలతో కూడిన విశాల దుకాణ సముదాయం ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ రైతుబజార్‌ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఉప్పలపాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, లింగంగుంట్ల, రావిపాడు, కేసానుపల్లి రోడ్డు వైపు పట్టణం బాగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌ కూడలిలో ప్రైవేటు వ్యాపారులతో కూరగాయల మార్కెట్‌ ఒకటే నడుస్తోంది. పెరుగుతున్న జనసాంద్రత, రద్దీ కూడళ్లు, ట్రాపిక్‌ అంతరాయాలు తదితర అంశాలను పరిశీలించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైతుబజార్లను ఏర్పాటుపై తక్షణమే దృష్టిసారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

నిర్మించినా... నిరుపయోగం

బాపట్ల పట్టణం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటైనా రైతుబజారు అందుబాటులో లేదు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ కూరగాయల మార్కెట్‌కు సమీపంలో రూ.60లక్షలు వెచ్చించి రైతుబజారు నిర్మించారు. 2019లో దీన్ని ప్రారంభించిన వెంటనే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో అందుబాటులోకి రాలేదు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు ప్రారంభించలేదు. పట్టణంలో లక్ష మంది జనాభా ఉన్నారు. చీరాల, పొన్నూరు, నిజాంపట్నం, కర్లపాలెం ప్రాంతాలకు ప్రధానకూడలిగా ఉండటంతో రోజువారీగా వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పూల సాగు ముమ్మరంగా జరుగుతుంది. గోంగూరతోపాటు పలురకాల ఆకుకూరలు, మరువం, దవనం, లైన్‌ఆకు, తులసి తదితర పంటలకు ప్రసిద్ధి. వంకాయలు, పచ్చిమిరప ఇక్కడ బాగా ప్రసిద్ధి. రైతుబజారు లేకపోవడంతో రైతులు, విక్రయదారులు బహిరంగంగా ప్రధాన రహదారిలో అమ్ముతున్నారు. బస్టాండ్‌ కూడలి నుంచి నరసాయపాలెం పైవంతెన రోడ్డు వరకు ప్రధాన రహదారిలో పూల విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించి ఇక్కడ రైతుబజారు ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని