logo

ఈ రోజు ఇసుక ధర ఎంతో?

ఇసుక ధరల్లో మార్పులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. రోజుకో రేటు.. రకానికో ధర అన్నట్లు సరఫరాదారులు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఎంత ధర ఉంటుందో తెలియడంలేదు. పర్చూరు యార్డులోని నిల్వ కేంద్రానికి అమరావతి నుంచి ఇసుక తెచ్చి నిల్వ చేశారు.

Published : 08 Oct 2022 04:23 IST

ఇసుక టన్ను రూ.925 వసూలు చేసిన పాత ధర

పర్చూరు, న్యూస్‌టుడే: ఇసుక ధరల్లో మార్పులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. రోజుకో రేటు.. రకానికో ధర అన్నట్లు సరఫరాదారులు వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఎంత ధర ఉంటుందో తెలియడంలేదు. పర్చూరు యార్డులోని నిల్వ కేంద్రానికి అమరావతి నుంచి ఇసుక తెచ్చి నిల్వ చేశారు. గతంలో టన్ను రూ.925 చొప్పున ప్రజలకు విక్రయించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి టన్ను రూ.775 చొప్పున వసూలు చేశారు. కొద్ది రోజులుగా నాణ్యమైనదిగా భావిస్తున్న ఇసుక కొంత పర్చూరు యార్డులోని నిల్వ కేంద్రానికి వస్తోంది. దీన్ని టన్ను రూ.1100 చొప్పున అమ్ముతున్నారు. ప్రభుత్వం నియమించిన ఏజెన్సీ ద్వారా సరఫరా చేసే ఇసుక ధర టన్నుకు రూ.150 తగ్గించి నాలుగు రోజుల వ్యవధిలోనే మళ్లీ టన్ను రూ.850 పెంచారు. నాణ్యమైన ఇసుక ధర మాత్రం రూ.250 అదనంగా వసూలు చేస్తున్నారు. అమరావతి నుంచి తెచ్చి నిల్వ చేసిన ఇసుక గతంలో టన్ను రూ.925 చొప్పున వసూలు చేయగా కొద్ది రోజులు రూ.775 చొప్పున తీసుకొని, తాజాగా రూ.850 పెంచడం ఏమిటో అర్థంకాని పరిస్థితి. ఎర్రగా ఉండే ఇసుక కొంత తెచ్చి టన్ను రూ.1100 చొప్పున అమ్ముతున్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందనేది వెల్లడి కావాల్సి ఉంది. అమరావతి నుంచి తీసుకువచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. టన్ను రూ.1100 చొప్పున అమ్ముతున్న ఇసుక అమరావతి నుంచి వస్తున్నది కాదని నిర్మాణ రంగంలో అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతిచ్చిన రీచ్‌ నుంచి వస్తుందా.. మరెక్కడ నుంచైనా అనధికారికంగా తరలిస్తున్నారా! అనేది తేలాల్సి ఉంది. అన్నిటికీ ఒకే ఏజెన్సీ పేరుతో రసీదులు జారీ చేస్తున్నారు. ఇసుక ధరలో మార్పులు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జయప్రకాష్‌ కేకేఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట లిమిటెడ్‌ సంస్థకు సరఫరా బాధ్యతను సర్కారు అప్పగించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో నిల్వ కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. నిల్వ కేంద్రం వద్ద ఇసుక లోడు చేసుకొని కాటా వేసిన తర్వాత పరిమాణం ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంది.


టన్ను రూ.775 వసూలు చేస్తున్నట్లు జారీ చేసిన రసీదు


టన్ను రూ.850 చొప్పున జారీ చేసిన రసీదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని