logo

అనాథలుగా వదిలేశారు

వద్దన్నా వినలేదు... అందరు వెళుతున్నారు... మేము వెళ్లాలని మొండికేసి మరీ వెళ్లారు... ప్రమాద విషయాన్ని విలేకర్ల ద్వారా తెలుసుకున్నాం... యాజమాన్యం కనీసం విషయం చెప్పలేదు... ఘటనా స్థలానికి వెళితే వైద్యశాలలో శవాలను అనాథలుగా వదిలేశారు... అదే వారి పిల్లలైతే ఇలా చేస్తారా...

Published : 08 Oct 2022 04:23 IST

కమిషన్‌ సభ్యులు ముందు వాపోయిన బాలికల తల్లిదండ్రులు

బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకుంటున్న

కమిషన్‌ సభ్యురాలు పద్మావతి తదితరులు

వేటపాలెం, న్యూస్‌టుడే: వద్దన్నా వినలేదు... అందరు వెళుతున్నారు... మేము వెళ్లాలని మొండికేసి మరీ వెళ్లారు... ప్రమాద విషయాన్ని విలేకర్ల ద్వారా తెలుసుకున్నాం... యాజమాన్యం కనీసం విషయం చెప్పలేదు... ఘటనా స్థలానికి వెళితే వైద్యశాలలో శవాలను అనాథలుగా వదిలేశారు... అదే వారి పిల్లలైతే ఇలా చేస్తారా... ఈ రోజు వరకు యాజమాన్యం పరామర్శించిన దాఖలాలులేవని... తమకు న్యాయం చేయాలని కమిషన్‌ సభ్యుల ముందు మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాపోయారు. అనుజ్ఞ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు ఇటీవల విహారయాత్రకు వెళ్లగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో సోకిలేరు వాగులో పడిన గుమ్మడి జయశ్రీ, సువర్ణ కమల, సూది గీతాంజిలు అనే విద్యార్థినులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఎలా జరిగింది... అసలు విహారయాత్రకు అనుమతి ఉందా... నీటిలో స్నానాలు చేయడానికి దిగే ముందు జాగ్రత్తలు తీసుకున్నారా.. అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు బి.పద్మావతి శుక్రవారం వేటపాలెం వచ్చారు. ఈ సందర్భంగా మృతిచెందిన ముగ్గురు బాలికల తల్లిదండ్రులు, బంధువులను పరామర్శించి మాట్లాడగా వారు పైవిషయాలు వివరించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, ఆరోజు యాత్రకు వెళ్లిన విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి వారి నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు నీలిమ, సీడీపీవో కె.ఉమ, ఎంఈవో జె.వి.సుబ్బయ్య, పోలీసులు ఉన్నారు.

మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ఆగ్రహం

వేటపాలెం బాలికోన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు బి.పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బడిలో అమలవుతున్న భోజన పథకాన్ని పరిశీలించారు. దాదాపు వెయ్యిమంది పిల్లలున్న ఇక్కడ కేవలం 30 మంది తీసుకోవడం ఏమిటని.... జులైలో ఇవ్వాల్సిన చిక్కీలను ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారని ప్రధానోపాధ్యాయుడు దుర్గాప్రసాదును ప్రశ్నించారు. దసరా సెలవులు తరువాత ఈ రోజే పాఠశాల తీయడంతో తక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, రోజూ ఎక్కువ మంది దీన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆమె చెప్పారు. ఎంఈవో, ఉపాధ్యాయులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని