logo

9.14 లక్షల మందికి ఆరోగ్య భరోసా

విజయదశమి వేళ కేంద్ర ప్రభుత్వం అల్పాదాయ కుటుంబాలకు శుభవార్త పంపింది. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేసేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో పేదలకు భరోసా ఇవ్వబోతోంది. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తరహాలో ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య కార్డులు(ఏబీపీఎంజీఏవై) అర్హులకు పంపిణీ చేయనున్నారు.

Updated : 08 Oct 2022 05:33 IST

ఆరోగ్యశ్రీ తరహాలో కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు

ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5లక్షల వరకు వైద్యం ఉచితం

న్యూస్‌టుడే, సత్తెనపల్లి

విజయదశమి వేళ కేంద్ర ప్రభుత్వం అల్పాదాయ కుటుంబాలకు శుభవార్త పంపింది. ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేసేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో పేదలకు భరోసా ఇవ్వబోతోంది. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ తరహాలో ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య కార్డులు(ఏబీపీఎంజీఏవై) అర్హులకు పంపిణీ చేయనున్నారు. వారికి ఇక నుంచి రూ.5లక్షల వరకు వైద్యం ఉచితంగా అందనుంది. వచ్చే నెల 15నాటికి కార్డులను పంపిణీ చేయాలనే మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు అర్హుల జాబితాలు చేరాయి. రిజిస్ట్రేషన్లు పకడ్బందీగా చేపట్టి పంపిణీకి కార్డుల్ని వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.

జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్‌హెచ్‌ఏ) ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద లబ్ధిదారుల్ని గుర్తించింది. పల్నాడు జిల్లాలో 2,80,510 కుటుంబాలు అర్హత సాధించాయి. ఆ కుటుంబాల్లో 9,14,381 మందికి పూర్తిస్థాయిలో వైద్య భరోసా దక్కబోతోంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాతోపాటు దేశంలో ఎక్కడైనా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద బియ్యం కార్డుదారులందరూ అర్హులుగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6,35,168 కుటుంబాలకు బియ్యం కార్డులు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డులు 6,20,625 ఉన్నాయి. వీరికి ఆరోగ్యశ్రీ పరిధిలో 2,246 రకాల వైద్య సేవలందిస్తున్నారు.

దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబాల్ని ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఎంపిక చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్రం సర్వే ద్వారా గుర్తించిన లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపింది. వాలంటీర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల వివరాల్ని ఏబీపీఎంజీఏవై యాప్‌లో పొందుపరుస్తున్నారు. లబ్ధిదారుల ముఖచిత్రాన్ని యాప్‌ ద్వారా నిక్లిప్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేసి జిల్లా కార్యాలయం నుంచి విజయవాడలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి పంపిస్తున్నారు. అక్కడ కార్డులను ముద్రించి జిల్లాలోని సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లబ్ధిదారులు తమ వివరాల్ని యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఈ నెల 5వరకు గడువు ఇచ్చారు. కార్డుల పంపిణీకి వచ్చే నెల 15 వరకు కేంద్రం గడువు విధించింది. ఇప్పటివరకు జిల్లాలో 12,962 మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 12,355 మందికి అనుమతులు లభించాయి. మిగిలిన వారు కూడా కార్డులకు దరఖాస్తు చేస్తున్నారు. కార్డు చేతికందినప్పటి నుంచి దేశంలో గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ వైద్య సేవలు పేదలకు అందుబాటులోకి రాబోతున్నాయి.

ఎన్‌హెచ్‌ఏ ద్వారా పల్నాడు జిల్లాలో ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకానికి 2.80 లక్షల కుటుంబాలు ఎంపికైనట్లు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ పి.సునీల చెప్పారు. కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని తెలిపారు. పథకానికి అర్హులై యాప్‌లో నమోదవ్వనివారు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఆమె కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని