logo

చిత్ర వార్తలు

ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పాఠశాలల్లోకి నీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రేపల్లె పట్టణం 24వ వార్డులోని ఎన్టీఆర్‌ ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగుతున్నాయి. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు.

Published : 08 Oct 2022 04:23 IST

తరగతి

తరగతి గదిలోకి చేరిన వర్షపు నీరు

ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల పాఠశాలల్లోకి నీరు చేరి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రేపల్లె పట్టణం 24వ వార్డులోని ఎన్టీఆర్‌ ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగుతున్నాయి. 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. వర్షాలకు పాఠశాల తరగతి గదుల్లోకి నీరు చేరడంతో పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో పిల్లలను కూర్చోబెట్టి ఉపాధ్యాయులు బోధన చేపట్టారు. అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించారు. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య ఎదురవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కొరవడింది. 2019లో పాఠశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. - న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్‌

గుడి ఆవరణలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు


ఆస్పత్రికి సుస్తీ

వైద్యులు పరీక్షించే గది దారుణంగా...

పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనం ఘోరంగా ఉంది. వైద్యుల గదులు, ల్యాబ్‌, ఓపీ కేంద్రం ఇలా అన్ని విభాగాల్లో పెచ్చులూడి ప్రమాదకరంగా మారింది. వర్షం వస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. పదేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించినా స్థితి మారడం లేదు. జబ్బుతో వచ్చే రోగులు ఆస్పత్రిని చూసి బెంబేలెత్తుతున్నారు. - పెదనందిపాడు (ఈనాడు-గుంటూరు)

శిథిఫలావస్థకు చేరిన ల్యాబ్‌


స్కాన్‌ చేసి తెలుసుకో

విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఆయుర్వేదవనం విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతోంది. 100కు పైగా వ్యాధులను రూపమాపే ఔషధ మొక్కలను పెంచారు. ప్రతి మొక్క వద్ద క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటుచేశారు.దాన్ని స్కాన్‌చేస్తే మొక్క శాస్త్రీయనామం, పేరు, ఏఏ వ్యాధులకు ఉపకరిస్తుందో అయా వివిరాలు వస్తాయి. నిత్యం వందల మంది విద్యార్థులు ఈ వనాన్ని సందర్శించి ప్రతి మొక్కను ప్రత్యక్షంగా చూసి క్యూఆర్‌ కోడ్‌ద్వారా వివరాలు సేకరించి పూర్తి పరిజ్ఞానం పొందుతున్నారని వృక్షశాస్త్ర అధ్యాపకురాలు జలజ తెలిపారు.  - వడ్లమూడి (ఈనాడు, గుంటూరు)

వాగులు వంకలు ఏరులై..

అనంతవరం వద్ద పత్తి పొలంలో నీరు

కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు పిల్లకాల్వలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని గృహాల వద్ద వరద నీరు నిలిచి తటాకాలను తలపిస్తోంది. క్రోసూరు మండలంలోని ఊటుకూరు-బయ్యవరం గ్రామాల మధ్యనున్న కప్పలవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - న్యూస్‌టుడే, క్రోసూరు

బయ్యవరం వద్ద ఎద్దువాగు ఉద్ధృతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని