logo

‘పేదల భూముల్ని అన్యాక్రాంతం కానివ్వం’

పేదల భూముల్ని కొందరు స్వార్థపరులు ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని దీన్ని సహించబోమని స్థానిక రైతులు ఆరోపించారు.

Updated : 27 Nov 2022 06:17 IST

రావిలంకలో  భూములను పరిశీలించేందుకు వెళుతున్న రైతులు

పోతార్లంక, (కొల్లూరు), న్యూస్‌టుడే: పేదల భూముల్ని కొందరు స్వార్థపరులు ఆక్రమించుకుని, సాగు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని దీన్ని సహించబోమని స్థానిక రైతులు ఆరోపించారు. మండలంలో పోతార్లంక పంచాయతీ పరిధిలో కృష్ణానది మధ్యలో ఉన్న రావిలంకలో అన్యాక్రాంతమైన భూమిని వందలాది మంది రైతులు తరలి వచ్చి  శనివారం పరిశీలించారు. తమ ఆధీనంలో ఉన్న భూముల్లోని చెట్లను కొందరు అక్రమంగా నరికి తరలించి, ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పలు మార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో అక్రమార్కుల ఆగడాలను అడ్డూఅదుపూ లేకుండా పోయిందని చెప్పారు. పోతార్లంక, తోకలవానిపాలెం, తిప్పలకట్ట, కిష్కింథపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాల్లోని పేదలు ముఖ్యంగా ఎస్సీ కుటుంబాలకు చెందిన వారు 1950లో ఆది ఆంధ్ర కో-ఆపరేటివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీగా ఏర్పడి రావిలంక భూముల్ని ఈ సొసైటీ పర్యవేక్షణలో ఉమ్మడి సాగులోకి తెచ్చి ఫలసాయాన్ని పొందుతున్నామని చెప్పారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపిన అక్రమార్కులు జిల్లా అధికారులను సైతం తప్పుదోవ పట్టించి, సొసైటీ సభ్యుల తప్పుడు జాబితాను సృష్టించి తద్వారా సొసైటీని రద్దు చేయించేందుకు యత్నించారని వారు ఆరోపించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇక్కడకు వచ్చి సమావేశం ఏర్పాటు చేసిన అధికారులను అడ్డుకుని తిప్పి పంపామన్నారు. ఇప్పటికైనా నదీ పరిరక్షణ, రెవెన్యూ శాఖాధికారులు స్పందించి వాస్తవ సాగుదారుల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి రూపొందించాలని కోరారు. కొలతలు నిర్వహించి, అన్యాక్రాంతమైన భూముల్ని స్వాధీనం చేసుకుని హక్కుదారులైన పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. అధికారులు పట్టించుకోని పక్షంలో తామే ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణం కలిగిన రావి లంకలోని భూముల్ని పరిశీలించేందుకు వచ్చిన వారిలో మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కార్యక్రమానికి సీపీఎం నాయకులు కృష్ణమోహన్‌, సురేష్‌, నాగమల్లి, ఎంపీటీసీ సభ్యులు ఆనంద్‌ కుమార్‌, రామారావు నేతృత్వం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని