logo

సంప్రదాయబద్ధంగా కోడిపోరు

పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో నాలుగో రోజు శనివారం కోడిపోరు నిర్వహించారు. పల్నాటి యుద్ధానికి బీజం వేసిన కోడిపోరును నాటకీయ పరిణామాలతో వీర్లదేవాలయం ముందు బ్రహ్మన్నగా పీఠాధిపతి..

Published : 27 Nov 2022 05:56 IST

కారంపూడి, న్యూస్‌టుడే: పల్నాటి వీరుల ఆరాధనోత్సవాల్లో నాలుగో రోజు శనివారం కోడిపోరు నిర్వహించారు. పల్నాటి యుద్ధానికి బీజం వేసిన కోడిపోరును నాటకీయ పరిణామాలతో వీర్లదేవాలయం ముందు బ్రహ్మన్నగా పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ చిట్టిమల్లు కోడితో, నాగమ్మ వేషంలో ఆచారవంతుడు సివంగిడేగ కోడితో పోరుకు సిద్ధమవగా ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పీఠాధిపతిని అనుసరించారు. ఈక్రమంలో బరిలో మూడు పర్యాయాలు కోడి పోరు సలిపి బ్రహ్మన్న కోడి ఓడినట్లుగా రాజ్యం వీడి అరణ్యవాసం చేయాలంటూ మలిదేవుల పరివారానికి సూచించినట్లు చూపారు. కోడిపోరు ఘట్టాన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. వీరవిద్యావంతుల గానాలాపన మధ్య క్రతువు ముగించారు. ఉదయం నాగులేరు గంగదారి మడుగులో కొణతాలకు పవిత్రస్నానాలు చేయించి వీరగంధం పూసి ప్రత్యేకంగా అలంకరించారు. వీర్లదేవాలయ ప్రాంగణంలో ఆచారవంతులు కత్తిసేవ చేశారు. గ్రామోత్సవంగా చెన్నకేశవస్వామి దేవాలయంలో పూజలు చేసి శంకుతీర్థం తీసుకొని బ్రహ్మన్న విగ్రహం వద్ద సేవ చేశారు. అనంతరం అంకాళమ్మ గుడికి చేరి ఆచారవంతులు కత్తులు శరీరాలపై మోదుకుంటూ ఆచారం నిర్వహించారు. పీఠాధిపతి ఇల్లు చేరి ఆయన సమక్షంలో సేవ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున వీర్లదేవాలయం, చెన్నకేశవస్వామి, అంకాళమ్మ దేవాలయాల్లో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని