logo

ఇళ్లు కట్టుకోలేమన్నా..

వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జగనన్న కాలనీలు చిట్టడవులను తలపిస్తున్నాయి. గురజాల డివిజన్‌ పరిధిలోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలక సంఘాలు మినహా ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టలేదు.

Published : 27 Nov 2022 05:56 IST

గురజాల డివిజన్‌లో గ్రామాల్లో మొదలు కాని నిర్మాణం


గురజాల మండలం దైద లే ఔట్‌లో మొలిచిన కంపచెట్లు  

గురజాల, న్యూస్‌టుడే: వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జగనన్న కాలనీలు చిట్టడవులను తలపిస్తున్నాయి. గురజాల డివిజన్‌ పరిధిలోని గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలక సంఘాలు మినహా ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టలేదు. లేఔట్‌ వేసి 29 నెలలు గడిచిపోయాయి. జగనన్న లేఔట్‌లు కంపలు, పిచ్చిచెట్లు, పొదలతో నిండిపోయాయి. ఆనాడు వేసిన రహదారులు దుస్థితికి చేరాయి. రెండు సంవత్సరాలుగా కురుస్తున్న అధిక వర్షాలకు గ్రావెల్‌ రోడ్లు పాడైపోయాయి. రోడ్డుకు ఇరువైపులా పెరుగుతున్న కంపచెట్లు ఆ రోడ్లను కప్పివేస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల మంజూరు కార్యక్రమం వైకాపా ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టింది. పట్టణాల్లో సెంటు భూమి, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున భూమిని అందించే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. దీనికితోడు రోడ్లు, నీటి, విద్యుత్తు వసతి కల్పిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో జగనన్న కాలనీల పేరిట లేఔట్‌లు వేసి మరీ పట్టాల పంపిణీని 2020 సంవత్సరం జులై నెల మొదటి వారంలో భారీఎత్తున ఈ పంపిణీలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాల్గొని సందడి చేశారు. ఒక్కో లేఔట్‌ నిర్మాణానికి సరాసరి రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చు చేశారు. గురజాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో మొత్తం 134 వరకు లేఔట్‌లు వేశారు. మొత్తం 38,432 మందికి పట్టాలను మంజూరు చేసి అందజేశారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాలలో మొత్తం రూ.67 కోట్ల వరకు నిధులను వెచ్చించారు.

గడ్డితో మూసుకుపోతున్న రహదారి

ఇచ్చి ఏం లాభం?

ఇళ్లు కట్టించి ఇస్తామన్నా ప్రభుత్వ మాటలు నెరవేరడం లేదు.. ఇచ్చి ఏం లాభం.. అంటూ పట్టాలు పొందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలు చేసి ఇస్తే ఎంతో ఉపయోగంగా ఉండేదని చెబుతున్నారు. ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేస్తే తప్ప సొంతంగా కట్టుకునే స్థితి లేదని చెబుతున్నారు. ప్రస్తుతం మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. లబ్ధిదారులకు చేతకాకపోతే తామే కట్టిస్తామని ఆర్భాటంగా మొదట ప్రకటించారు. ప్రతిఒక్కరూ కట్టించి ఇవ్వమని కోరినా ప్రభుత్వం స్పందించకుండా వెనకడుగు వేసింది. దశల వారీగా డబ్బులు ఇస్తా.. లబ్ధిదారులే కట్టుకోండని.. ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకుంది. ప్రారంభించిన పట్టణ ప్రాంత లేఔట్‌ల్లోనూ నిర్మాణాలు నత్తనడక నడవడం, సగం వరకు మాత్రమే ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తే తప్ప కట్టుకోవడం కష్టమని లబ్ధిదారులు చెబుతున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఉన్న జగనన్న లేఔట్‌లు బాగు చేయడానికి మరోసారి నిధులను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులు విన్నవించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని