logo

పత్తి ప్రయోగాత్మక సాగుతో ఫలితం

పత్తి పరిశ్రమకు చెందిన జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌, స్పిన్నింగ్‌, గార్మెంట్‌ మిల్లుల వ్యాపారులు పొలంబాట పట్టారు. పత్తి పంటను లాభదాయకంగా పండించడంపై గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 120 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుచేయించారు.

Updated : 27 Nov 2022 06:23 IST

ఈనాడు-అమరావతి: పత్తి పరిశ్రమకు చెందిన జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌, స్పిన్నింగ్‌, గార్మెంట్‌ మిల్లుల వ్యాపారులు పొలంబాట పట్టారు. పత్తి పంటను లాభదాయకంగా పండించడంపై గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 120 ఎకరాల విస్తీర్ణంలో పంట సాగుచేయించారు. రైతులకు విత్తనం నుంచి తీత వరకు అవసరమయ్యే ఉత్పాదకాలను ఉచితంగా అందించారు. నెలలో రెండుసార్లు ప్రయోగ క్షేత్రాలను పరిశీలించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, నిపుణులైన రైతులతో కలిసి సాగులో సమస్యలపై చర్చించి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకున్నారు. పంటకు సోకే చీడపీడలు నివారణకు మేలైన పద్ధతులు పాటించేలా చైతన్యం కల్పించారు. ప్రయోగ క్షేత్రాల్లో సాగుచేసిన పంటలో మంచి ఫలితాలు వచ్చాయి. ఎకరాకు 8-9క్వింటాళ్ల వరకు దిగుబడులు తీయగా మరో 4 నుంచి 5 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈవిధంగా రైతులు, పరిశ్రమ నిర్వాహకులు కలిసి పనిచేస్తే ఉభయతారకంగా ఉంటుందని నిరూపించారు.
ఫలించిన ప్రయోగం.. ఆంధ్రప్రదేశ్‌ కాటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మూడు జిల్లాల్లో ప్రయోగ క్షేత్రాలను సాగుచేస్తున్నారు. ఇందుకు ఆసోసియేషన్‌ కొంత మొత్తాన్ని వెచ్చిస్తోంది. రైతులు కోరిన విత్తనాలను ఎకరాకు 3-4 సంచులు సమకూర్చారు. విత్తనశుద్ధి చేసి నాటడంతో మొలకశాతం, మొక్క ఎదుగుదల ఆరోగ్యంగా ఉంది. 45రోజుల వరకు రసం పీల్చే పురుగుల నివారణకు మందులను పిచికారీ చేయాల్సిన అవసరం రాలేదు. కలుపును రసాయనాలతో సకాలంలో నిర్మూలించారు. భూమిలో సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించి అవసరమైన మేరకు వాటిని వాడుతూ పురుగులు, తెగుళ్లు నివారణకు రసాయనాలు చల్లారు. విత్తనశుద్ధి, అధికసాంద్రతలో మొక్కలు నాటడం, పెరుగుదల నిరోధక మందుల వినియోగం, లింగాకర్షకబుట్టలు, ఎర అట్టలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. గులాబీరంగు పురుగు నివారణకు జెల్‌ను వాడటం వల్ల ఉద్ధృతి తగ్గిందని రైతులు వివరించారు. పురుగులు, తెగుళ్ల నిర్మూలనకు సమర్థమైన రసాయనాలను పిచికారీ చేయడం కర్షకులకు కలిసొచ్చింది.

సంప్రదాయ సాగుతో నష్టం .. ఉమ్మడి జిల్లాలో ఎకరాకు సగటున 5-6 క్వింటాళ్లు మాత్రమే రాగా గరిష్ఠంగా 7-8క్వింటాళ్లు వచ్చింది. ఎకరాకు రూ.70వేల పెట్టుబడి పెట్టారు. 8క్వింటాళ్లు సాధించిన రైతులకు పెట్టుబడులు దక్కగా మిగిలినవారికి నష్టాలు వచ్చాయి.  సింహభాగం రైతులు పత్తి సాగుతో నష్టాలు చవిచూడగా కాటన్‌ అసోసియేషన్‌ ప్రయోగ క్షేత్రాల్లో సాగుచేసినవారు మాత్రం లాభపడ్డారు.


మేలైన పద్ధతులతో లాభదాయకం

-రామాంజనేయులు, ఉపసంచాలకులు, వ్యవసాయశాఖ

కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో నాలుగుచోట్ల రైతులతో ప్రయోగాత్మకంగా పత్తి సాగుచేయించాం. ఎకరాకు రూ.20వేల వంతున కాటన్‌ ఆసోసియేషన్‌ సహకారం అందించింది. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు కలిసి పంటను పరిశీలిస్తూ తగు మెళకువలు పాటించేలా చూశాం. దీంతో ఎకరాకు సగటున 15క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయి. పెట్టుబడి పోగా రైతుకు ఎకరాకు రూ.50వేల వరకు మిగులు ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని