logo

భక్తి మాటున దోపిడీ!

ప్రజల్లోని భక్తిని ఆసరాగా తీసుకుని కల్తీ దీపారాధన నూనెల విక్రయాలు చేస్తూ రూ.లక్షలు దోచుకుంటున్నారు... అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరు... వీటిని సరఫరా చేసే వాహనాలను తూతూమంత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకొంటున్నారు...

Published : 27 Nov 2022 05:52 IST

జోరుగా కల్తీ దీపారాధన నూనె విక్రయాలు...
స్పందించని అధికారులు

చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రజల్లోని భక్తిని ఆసరాగా తీసుకుని కల్తీ దీపారాధన నూనెల విక్రయాలు చేస్తూ రూ.లక్షలు దోచుకుంటున్నారు... అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరు... వీటిని సరఫరా చేసే వాహనాలను తూతూమంత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకొంటున్నారు... ఫలితంగా ఈ వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.

కొంతమంది వ్యాపారులు ప్రజల్లో నెలకొన్న భక్తిని దీపారాధన నూనె పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కల్తీ చేసి రూ.లక్షలు దండుకుంటున్నారు. పలు రకాలకు చెందిన నూనెలు కలిపిన వాటితో దీపారాధన చేస్తే అంతా శుభం జరుగుతోందని చెబుతూ కల్తీవి అంటగడుతున్నారు... వీటిల్లో మడ్డి ఆయిల్‌, పామోలిన్‌, రంగు కోసం కెమికల్స్‌ సైతం కలిపి నాసిరకం నూనెలు అమ్ముతున్నారు. ప్రధానంగా ఇటువంటి నూనె విక్రయాలు ఏడాదిలోని మిగిలిన నెలల్లో తక్కువగా ఉన్న నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లో మూడింతలు జరుగుతోంది. ఇదే సమయంలో వ్యాపారులు కల్తీలు జోరుగా చేసి మార్కెట్‌కి తరలిస్తున్నారు. ఇటువంటి నూనెతో దీపారాధన చేయడం ద్వారా వెలువడే కాంతిని ఎక్కువ సేపు చూడడం శ్రేయస్కరం కాదని, దీని నుంచి వచ్చే నుసిని బొట్టుగా పెట్టుకున్నా చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చీరాలలో రూ.కోటి వరకు అమ్మకాలు

చినముంబయిగా ప్రసిద్ధి చెందిన చీరాలలో కార్తిక మాసంలోనూ, సంక్రాంతి, మాలాధారణ స్వాములు ఎక్కువగా ఉండడంతో ఈ సమయంలో దాదాపు రూ.కోటి వరకు దీపారాధన నూనెల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. అదే జిల్లా వ్యాప్తంగా మరో రూ.3 కోట్ల వరకు ఉంటోంది. మిగిలిన ఎనిమిది నెలల్లో సరాసరి మరో రూ.3 కోట్ల వరకు సాగు తోంది. ప్రధానంగా ఇది పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల నుంచి ఇక్కడకు సరఫరా అవుతోంది. రాష్ట్ర పన్నులశాఖ నిబంధనల మేరకు రూ.49 వేలలోపు సరకులు కొనుగోలు చేస్తే వాటిని రవాణా చేయడానికి వేబిల్లు అవసరం ఉండదు. దీన్ని అడ్డుగా పెట్టుకుని నిత్యం రూ.లక్షల విలువైన నూనెను అక్రమార్కులు సరఫరా చేస్తూ పన్నులు చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. చీరాలతో పాటు ప్రధాన పట్టణాలకు వీటిని ఆటోల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఒకవేళ తనిఖీ అధికారులు వాహనాలను నిలుపుదల చేసినా వేబిల్లు లేకపోవడంతో పెద్దగా పట్టించు కోవడంలేదు. దీనికితోడు కొన్నాళ్లుగా ఈ తరహా వ్యాపారం బహిరంగంగా సాగుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంలో ఆంతర్యం అర్థం కాకుంది. సీసాల్లో ఉన్న వాటి పరిమాణం తక్కువగా ఉన్నా తూనికలు కొలతల శాఖాధికారులు దృష్టిసారించని స్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కల్తీలు నివారించవచ్చు.


తూకంలో మోసం

ఈ నూనెలను ప్రధానంగా సీసాల్లో సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా పావు, అర, లీటరు పేరుతో విక్రయిస్తున్నారు. వీటిల్లో ఆ మేరకు ఉండడంలేదని వినియోగదారుల వాదన... లీటరు డబ్బాలో 800 గ్రాములు ఉండడంలేదు...వాస్తవానికి 910 గ్రాములు ఉండాలి.. ఇక అరలీటరులో 400 వరకు ఉంటోంది. కొన్ని బ్రాండ్‌లతో మార్కెట్‌లోకి వస్తున్న సీసాలపై ప్యాకింగ్‌ తేది, ధర ఉండడంలేదు. వీటిపై లాభాలు(మార్జిన్‌) ఎక్కువగా ఉండడంతో చిల్లర వ్యాపారులు ఇటువంటివి అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా కొబ్బరికాయల దుకాణాలు, పచారీ షాపులు, చిల్లర  కొట్టుల్లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని