logo

రైతుకు కోత వినియోగదారులకు వాత

ఆరుగాలం కష్టపడి కూరగాయలు పండిస్తున్న రైతులకు కష్టం మిగులుతుండగా గంటల వ్యవధిలో లావాదేవీలు నిర్వహించే మార్కెట్‌లో మధ్యవర్తులు లాభాలు ఆర్జిస్తున్నారు.

Published : 27 Nov 2022 05:56 IST

కూరగాయల క్రయవిక్రయాల్లో మధ్యవర్తుల మాయాజాలం

ఈనాడు, గుంటూరు: ఆరుగాలం కష్టపడి కూరగాయలు పండిస్తున్న రైతులకు కష్టం మిగులుతుండగా గంటల వ్యవధిలో లావాదేవీలు నిర్వహించే మార్కెట్‌లో మధ్యవర్తులు లాభాలు ఆర్జిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు రైతుకు రవాణా ఖర్చులు కూడా భారమై పంట ఉత్పత్తులను పారబోయాల్సిన పరిస్థితి.
టోకు మార్కెట్‌లో విక్రయించడానికి తెచ్చిన రైతుకు దక్కుతున్న ధరకు.. రిటైల్‌ మార్కెట్‌లో వినియోగదారులకు విక్రయించే ధరకు వ్యత్యాసం ఎక్కువగా ఉంటోంది. ఒక్కొక్కసారి ఇది 50 శాతం వరకు ఉండటం గమనార్హం. డిమాండ్‌కు మించి దిగుబడులు వచ్చినప్పుడు, వివిధ ప్రాంతాల నుంచి టోకుమార్కెట్‌కు ఎక్కువ సరకు వచ్చినప్పుడు ధరలు పతనమవుతున్నాయి. జోక్యం ద్వారా వినియోగదారులు, రైతులకు ప్రయోజనం కల్పించే దిశగా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. రైతులు, వినియోగదారుల మధ్య ధర వ్యత్యాసాన్ని తగ్గించగలిగితే ఇరువర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. రైతుల నుంచి దళారులు సేకరిస్తున్న కూరగాయల ధరకు, రిటైల్‌ వ్యాపారులు వినియోగదారులకు విక్రయిస్తున్న ధరకు కిలోకు రూ.8 నుంచి రూ.20 వరకు వ్యత్యాసం ఉంటోంది. ఇరువర్గాల నడుమ వ్యత్యాసం మొత్తం మధ్యవర్తుల చేతుల్లోకి వెళుతోంది. రైతుల నుంచి కమీషన్‌ ఏజెంట్ల ద్వారా టోకు వ్యాపారులు కొనుగోలు చేసి లాభం వేసుకుని రిటైల్‌ వర్తకులకు విక్రయిస్తారు. చిల్లర వ్యాపారులు లాభం కలుపుకుని వినియోగదారులకు విక్రయిస్తారు. మార్కెట్‌లో సరకు దించే వరకు ఖర్చులన్నీ రైతు భరిస్తారు. రైతులు, టోకు వ్యాపారులకు నడుమ అనుసంధానం చేసిన ఏజెంట్లకు కమీషన్‌ రూపంలో సొమ్ము వస్తోంది. పచ్చి సరకు పేరుతో తరుగు తీసేసిన వ్యాపారులు లబ్ధి పొందుతారు.

నారాకోడూరుకు కూరగాయల బస్తాలతో వచ్చిన రైతులు


వివిధ ప్రాంతాల్లో వ్యత్యాసం ఇలా..

* గుంటూరు పీవీకేనాయుడు  మార్కెట్‌లో శనివారం ధరలు ఇలా ఉన్నాయి. టమోటా కిలో రూ.20, వంకాయలు, దొండ, బెండకాయలు రూ.20, దోసకాయలు, బీరకాయలు రూ.30, మిర్చి రూ.50-60లు, పెద్దచిక్కులు రూ.60-70కు విక్రయిస్తున్నారు.

* చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన గుంటూరు బాజి 55 కిలోల దొండకాయల బస్తాను శుక్రవారం నారాకోడూరు మార్కెట్‌లో రూ.500కు కొనుగోలు చేశారు. ఈ లెక్కన కిలో దొండకాయలకు రైతుకు రూ.9 లభించింది.  అదే దొండకాయలు గుంటూరు నగరంలో రిటైల్‌ మార్కెట్‌లో రూ.20కు విక్రయిస్తున్నారు. రైతుకు దక్కిన ధర కంటే రూ.11 అదనంగా కొనుగోలుదారులపై భారం పడుతోంది. టోకు, రిటైల్‌ వ్యాపారులకు కలిపి కిలోకు రూ.11లు లబ్ధి చేకూరుతోంది.

* చేబ్రోలు మండలం శేకూరుపాలెం గ్రామానికి చెందిన గ్యారా ప్రభాకర్‌ 60 కిలోల బీరకాయల బస్తా నారాకోడూరు మార్కెట్‌కు తీసుకువచ్చారు. పది కిలోలను రూ.200 చొప్పున విక్రయించారు. ఈ లెక్కన రైతుకు కిలోకు రూ.20 ధర లభించింది. బీరకాయలు గుంటూరు రిటైల్‌ మార్కెట్‌లో శనివారం కిలో రూ.30కు విక్రయిస్తున్నారు.

* నారాకోడూరు గ్రామానికి చెందిన తోట శ్రీనివాసరావు పది కిలోల చిక్కుళ్ల బస్తా రూ.420కు విక్రయించారు. రైతుకు కిలోకు రూ.42 లభించింది. గుంటూరు రిటైల్‌ మార్కెట్‌లో రూ.60, రూ.70 అమ్మారు.


లాభమంతా కూలి ఖర్చు, రవాణాకే..

- బొంతు సాంబశివరావు, యనమదల

1.40 ఎకరాల్లో దొండ పంట సాగుచేశాను. కోత కోసినప్పుడల్లా నాలుగు బస్తాల నుంచి 15 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. కిలో కోతకు రూ.3.50, గ్రామం నుంచి మార్కెట్‌కు తరలించేందుకు బస్తాకు రూ.60, మార్కెట్‌లో దింపుడు కూలీ బస్తాకు రూ.12, కమీషన్‌ 10 శాతం కలుపుకుని కిలోకు రూ.6 వరకు ఖర్చవుతోంది. బుధవారం మార్కెట్‌కు 9 బస్తాలు తీసుకువస్తే కిలో రూ.13లు చొప్పున ధర లభించింది. ఖర్చుల పోనూ కిలోకు రూ.7 మాత్రమే మిగిలింది. కిలో రూ.20 విక్రయిస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని