Pawan Kalyan: ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా సజ్జల: పవన్‌ కల్యాణ్‌

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు డ్యాం కొట్టుకుపోయిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉంటూ.. రాయలసీమకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని విమర్శించారు.

Updated : 27 Nov 2022 17:22 IST

మంగళగరి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇసుక తవ్వకాల వల్లే అన్నమయ్య ప్రాజెక్టు డ్యామ్‌ కొట్టుకుపోయిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఈ ప్రమాదంలో వందలాది పశువులు ప్రాణాలు కోల్పోయాయన్నారు. నాడు లష్కర్‌ రామయ్య అనే ఉద్యోగి అక్కడ లేకపోతే మరింత ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు. దాదాపు 200 మంది ప్రాణాలను ఆయన కాపాడారని చెప్పారు. ఆయన కృషిని జనసేన మనస్ఫూర్తిగా అభినందిస్తోందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. విపత్తు నిర్వహణ సంస్థ చేయాల్సిన పనిని రామయ్య చేశారని కొనియాడారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి ఉగ్రవాద పార్టీకి సలహాదారుగా ఉన్నారని పవన్‌ విమర్శించారు. రాయలసీమకు ఆయన చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో చెట్లను విపరీతంగా నరికేస్తున్నారని, అలాంటి వారంతా గరుడపురాణం చదవాలని పవన్‌ అన్నారు. వైకాపా బాధ్యతా రాహిత్యం వల్లే డ్యామ్‌ కొట్టుకుపోయిందని దుయ్యబట్టారు. జనసేన రౌడీ సేన కాదని, విప్లవ సేన అని పవన్‌ పేర్కొన్నారు. అన్నమయ్య డ్యామ్‌ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు వంశీకృష్ణ అనే జాతీయస్థాయి క్రీడాకారుడు నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్నారు.

గత ఏడాది నవంబరులో విస్తారంగా కురిసిన వర్షాలతో అన్నమయ్య, పింఛ జలాశయాల వద్ద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని