logo

ప్రాణహాని అయినా.. కాసులే పరమావధి

కాలం చెల్లిన ప్యాకెట్లలోని కుర్‌కురేలు తిని శనివారం సత్తెనపల్లి పట్టణంలో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

Published : 28 Nov 2022 05:13 IST

కాలం చెల్లిన తినుబండారాల విక్రయాలు
అసలును పోలిన నకిలీలూ బాహాటంగా అమ్మకం    
నిఘా కొరవడటంతో దెబ్బతింటున్న పిల్లల ఆరోగ్యం
సత్తెనపల్లి, న్యూస్‌టుడే

తినుబండారాల ప్యాకెట్లు పరిశీలిస్తున్న ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుందరరామిరెడ్డి

* కాలం చెల్లిన ప్యాకెట్లలోని కుర్‌కురేలు తిని శనివారం సత్తెనపల్లి పట్టణంలో నలుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆదివారం పిల్లలకు కాలం చెల్లిన ప్యాకెట్లు అమ్మిన దుకాణంలో జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు నిర్వహించగా, మరో పది ప్యాకెట్లు కాలం చెల్లినవి లభించాయి. పిల్లల అనారోగ్య సమస్యను తల్లిదండ్రులు గుర్తించి చైతన్యంతో వ్యవహరించడంతో ఇక్కడ ఆహార కలుషితం బయటపడింది. వెలుగుచూడని ఈ తరహా సంఘటనలు జిల్లాలో ఎన్నో ఉంటున్నాయి.

* ప్రముఖ కంపెనీకి చెందిన తినుబండారాల ప్యాకెటు రూ.5కు విక్రయిస్తుండగా, ఆ కంపెనీ కేవలం 90 పైసలు మార్జిన్‌ ఇస్తోంది. అదే కంపెనీ పేరును అటూఇటూ కొద్దిగా మార్చి తయారు చేసిన ప్యాకెట్‌కు రూ.2 నుంచి రూ.2.50 వరకు మార్జిన్‌ ఇస్తున్నారు. అసలును పోలిన ప్యాకెట్లను చిల్లర దుకాణాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఎక్కువగా ఇష్టత చూపిస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట వంటి పట్టణాల్లో ఏమాత్రం నాణ్యత లేని నకిలీలు భారీఎత్తున తయారవుతున్నాయి.

ప్రజల్లో నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని కొందరు కాసులుగా మలుచుకుంటున్నారు. కాలం చెల్లిన వాటిని బయటపడేయాల్సి ఉండగా, కొందరు బాహాటంగా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాలం చెల్లినవే గాకుండా నకిలీలు తయారు చేసి ఇబ్బడిముబ్బడిగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాయి. నీకింత, నాకింత అన్నట్లు ఈ తినుబండారాలను పిల్లలకు అంటగడుతున్నారు. కలుషితమైన వీటిని తిన్న పిల్లలు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం.. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.

చూడగానే ఆకట్టుకునేలా రంగురంగుల బొమ్మలతో ఉండే తినుబండారాల ప్యాకెట్లను పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌ నుంచే సింహభాగం ప్యాకెట్లు జిల్లాకు వస్తున్నాయి. కాకుంటే వాటిలోనే కొన్ని నకిలీ, కల్తీ ప్యాకెట్లు కలుస్తున్నాయి. ఉదాహరణకు చట్‌పట్‌, రింగ్స్‌, తేడామేడో కుర్‌కురే ప్యాకెట్‌లపై ఉండే ఆంగ్ల అక్షరాల్లో ఒకటి, రెండు అక్షరాలు అటూఇటూమార్చి నకిలీవి అమ్ముతున్నారు. నిశితంగా పరిశీలిస్తే కానీ అవి కనిపించట్లేదు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కాలం చెల్లిన ప్యాకెట్లు జోరుగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని హోల్‌సేల్‌ వ్యాపారులు వందల్లో ఉంటే.. రిటైల్‌గా వాటిని విక్రయించేవారు వేలల్లో ఉన్నారు. ఐదు వేల జనాభా ఉన్న ముప్పాళ్ల మండలంలోని ఓ గ్రామంలో ఈ ప్యాకెట్లు అమ్మే వ్యాపారులు 30 మంది ఉండటం పరిశీలనాంశం. పిల్లలను ఆసరాగా చేసుకొని పాఠశాల పరిసరాల్లోనూ, ప్రధాన కూడళ్లలో ఈ వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుంది. ఆంగ్ల అక్షరాల్లోని పేర్లను అటూఇటూ మార్చి డిమాండ్‌ ఉన్న వాటితో సమానంగానే కల్తీవి అమ్ముతున్నారు. మరోవైపు పాఠశాలలకు 200 మీటర్లలోపు ఈ తరహా ప్యాకెట్లు అమ్మేందుకు నిషేధం అమల్లో ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా అది అమలవ్వట్లేదు.

చోద్యం చూస్తున్న అధికారగణం

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు సుమారు 2 వేలు ఉండగా వాటిలో 2.10 లక్షల మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. సగం మంది పిల్లలకు ఈ తరహా తినుబండరాలతో అనారోగ్య సమస్య ఎదురవుతుంది. అసలును పోలిన నకిలీ.. కాలం చెల్లిన ఆహారం అందుబాటులో ఉండటమే అసలు సమస్యగా ఉంది. ఒక్కో చిన్నారి కుర్‌కురే వంటి చిరుతిండిపై రోజుకు రూ.10 నుంచి రూ.20 వరకు వెచ్చిస్తున్నారు. వీటి విక్రయాలు నిరోధించకున్నా, కాలం చెల్లినవి, నకిలీలు రాకుండా అధికారులు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో అసలును పోలిన నకిలీ, కల్తీ తయారీ, విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. సత్తెనపల్లి ఘటన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించే దుకాణాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు.


రోగ నిరోధక శక్తిపై ప్రభావం

దైనా ఆహారం తీసుకుంటే బలాన్ని ఇవ్వాలి. కానీ ఇవి తినడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆహార నిల్వకు ఉపకరించే రసాయనాలతో ఈ జంక్‌ఫుడ్‌ను తయారు చేస్తారు. అవి పిల్లలు తినేందుకు రుచికరంగా అనిపించిన క్రమంగా వారి ఆరోగ్యాన్ని ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి. పిల్లల్లో ఆకలి మందగించడం.. సక్రమంగా ఆహారం తినకపోవడం.. కడుపు ఉబ్బరమని పిల్లలు తరచూ చెప్పడం వంటివి వీటి లక్షణాలుగా తల్లిదండ్రులు గుర్తించాలి.

డాక్టర్‌ బీవీ రంగారావు, ఏపీవీపీ డీసీ, పల్నాడు జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని