logo

కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించరే!

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అధికారులు స్పందన అర్జీలు పరిష్కరించాలి. ఒకే సమస్యపై  అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు.

Updated : 28 Nov 2022 06:48 IST

తీరని అర్జీదారుల అవస్థలు
బాపట్ల, న్యూస్‌టుడే

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అధికారులు స్పందన అర్జీలు పరిష్కరించాలి. ఒకే సమస్యపై  అర్జీదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు.

విజయకృష్ణన్‌, కలెక్టర్‌

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్న ‘స్పందన’లో ఎన్నిమార్లు అర్జీలు ఇచ్చినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోతున్నారు. అన్ని అర్హతలూ ఉండి పింఛను కోసం దివ్యాంగుడు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, పేదలు, వృద్ధులు భూ సంబంధ సమస్యలపై రెవెన్యూ అధికారులను పలుమార్లు కలిసి అర్జీలు అందిస్తున్నా అధికారుల్లో కనికరం కరవైంది. ‘స్పందన’పై పలుమార్లు ముఖ్యమంత్రి సహా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించి ఒకే సమస్యపై ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దని ఆదేశాలిస్తున్నా అవి అమలు కావడం లేదు. తమ అర్జీల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ఆశగా ఎదురుచూస్తున్న వారి కన్నీటి గాథ వారి మాటల్లోనే..


ఆన్‌లైన్లో నమోదుకు అష్టకష్టాలు

అంధుడైన కుమారుడు శ్రీనివాసరావు, మనవరాళ్లతో సూరగాని లక్ష్మయ్య

కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలేనికి చెందిన సూరగాని లక్ష్మయ్య 30 ఏళ్ల క్రితం గ్రామంలో ముగ్గురు రైతుల నుంచి రెండెకరాల సాగు భూమి కొనుగోలు చేశారు. అప్పట్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఈ భూమిలో అతడే పంటలు సాగు చేస్తున్నారు. కుమారుడు శ్రీనివాసరావు అంధుడు. ముగ్గురు కుమార్తెలు పుట్టిన తర్వాత శ్రీనివాసరావును భార్య వదిలి వెళ్లిపోయింది. అంధుడైన శ్రీనివాసరావు ముగ్గురు కుమార్తెలను పెంచుతున్నారు. దీంతో కుమారుడి పేరు మీద రెండెకరాల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయటానికి స్థానిక రెవెన్యూ అధికారులకు లక్ష్మయ్య దరఖాస్తు చేశారు. దాన్ని అధికారులు దరఖాస్తు తిరస్కరించారు. ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు కోసం తహసీల్దారు కార్యాలయం చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నారు. స్పందనలో పలుమార్లు అర్జీలు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. అంధుడైన కుమారుడిని తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు.


96ఏళ్ల వయసులోనూ..

మస్తానమ్మ, శేషమ్మ

పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలేనికి చెందిన 96ఏళ్ల శేషమ్మ తన 2.26 ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం కుమార్తె మస్తానమ్మతో కలిసి 8 నెలలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆమె భూమిని మనవడు అక్రమంగా అతడి పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోగా న్యాయపోరాటం చేసి గత ఏడాది డిసెంబరులో పర్చూరు కోర్టులో విజయం సాధించారు. కోర్టు ఆదేశాలు చూపి ఆమె పేరు మీద భూమిని ఆన్‌లైన్లో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని ఇంకొల్లు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. వారు స్పందించకపోవటంతో 45 రోజుల క్రితం కలెక్టరేట్లో జేసీ శ్రీనివాసులును కలిసి సమస్య వివరించారు. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో న్యాయం చేయమంటూ రెండు వారాల క్రితం మరోసారి కలెక్టరేట్కు వచ్చారు. వృద్ధాప్యం కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా తన భూమికి పాసుపుస్తకం ఇవ్వాలని కోరుతున్నారు.


పింఛను పునరుద్ధరించాలని..

మేకల మోషే, దివ్యాంగుడు

బాపట్ల పట్టణం చెంగల్రాయ తోటలో నివసించే దివ్యాంగుడు మోషే మూడు చక్రాల సైకిల్‌కే పరిమితం. భార్య కూలీ పనులకు వెళ్లి సంపాదించే సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తోంది. చేతివేళ్ల రేఖలు అరిగిపోవడంతో 13 ఏళ్లుగా ఈయనకు పింఛను నిలిచిపోయింది. పింఛను పునరుద్ధరించాలంటూ ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి ఇక గత్యంతరం లేక రెండు వారాల క్రితం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో అధికారులను కలిసి సమస్య వివరించి వినతిపత్రం అందించారు. పింఛను పునరుద్ధరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు

రోజ్‌మేరి, మాజీ సర్పంచి, మూల్పూరు

అమృతలూరు మండలం మూల్పూరు గ్రామ సర్పంచిగా 2013-18 మధ్య రోజ్‌మేరీ పనిచేశారు. ఐదేళ్ల తన పాలనా కాలంలో రూ.మూడు కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల తాలూకూ రూ.25లక్షలు, 14 వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి రూ.4.50 లక్షల బిల్లు ఈమెకు ఇంకా అందాల్సి ఉంది. బిల్లుల చెల్లింపునకు పంచాయతీరాజ్‌ ఈఈ ఆదేశాలు జారీ చేసినా గ్రామంలో అధికార పార్టీ నేతలు స్థానికంగా ఇబ్బంది పెడుతూ బిల్లుల తాలూకూ బకాయి సొమ్ము చెల్లించడం లేదని వాపోయారు. గతంలో ఓ సారి కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌, జేసీకి ఈమె ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. బిల్లులు చెల్లించకుండా ఎస్సీ వర్గానికి చెందిన తనను వేధించటం తగదని మాజీ సర్పంచి వాపోయారు. రెండువారాల క్రితం ‘స్పందన’లో కలెక్టర్‌, జేసీకి వినతిపత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని