logo

ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం

ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పౌరసరఫరాల డీఎం శ్రీలక్ష్మి తెలిపారు.

Updated : 28 Nov 2022 06:49 IST

 రైతులకు 21 రోజుల్లో నగదు చెల్లింపు
‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పౌరసరసరఫరాల డీఎం శ్రీలక్ష్మి
బాపట్ల, న్యూస్‌టుడే

ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పౌరసరఫరాల డీఎం శ్రీలక్ష్మి తెలిపారు. సేకరణ ప్రక్రియలో వేబ్రిడ్జి వద్ద ధాన్యం కాటా వేసే పనులు మాత్రమే రైతుమిత్రల (వాలంటీర్లు)కు అప్పగించినట్లు చెప్పారు. రెండు లక్షల గోతాలు ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రం)లకు పంపించామన్నారు. కంబైన్డ్‌ హార్వెస్టర్‌తో నూర్చిన తర్వాత ధాన్యాన్ని రెండ్రోజులు ఆరబెట్టి నమూనాను రైతులు ఆర్‌బీకేకు తీసుకురావాలని సూచించారు. తేమ శాతం 17లోపు ఉంటే గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు టోకెన్లు జారీ చేస్తారని, ధాన్యం సేకరించిన తరువాత 21 రోజులలోపు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని వివరించారు. డీఎం శ్రీలక్ష్మి ‘న్యూస్‌టుడే’తో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..

1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల  సేకరణ లక్ష్యం

జిల్లాలో ఖరీఫ్‌లో 5.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశాం. రైతుల నుంచి 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గ్రేడ్‌ ‘ఏ’ రకం క్వింటా ధాన్యం బస్తాకు రూ.2060, 75 కేజీల బస్తాకు రూ.1545, సాధారణ రకం క్వింటా ధాన్యం బస్తాకు రూ.2040, 75 కేజీలకు రూ.1530 కనీస మద్దతు ధరగా చెల్లిస్తాం. మొత్తం 153 ఆర్‌బీకేలు, 109 సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆర్‌బీకేలకు రెండు లక్షల గోతాలు, తేమ నిర్ధారణ యంత్రాలు, ఇతర పరికరాలు పంపించాం. సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రెండుసార్లు శిక్షణ ఇచ్చాం. ఆర్‌బీకేలతో 78 రైస్‌మిల్లులు అనుసంధానం చేశాం. డీసీఎంఎస్‌, సహకార సొసైటీలు, ఎఫ్‌పీవోలు ధాన్యం సేకరణ బాధ్యతలు చేపట్టాయి.

రవాణా ఛార్జీలు కూడా..

వీఏఏ, సాంకేతిక సహాయకులు ధాన్యాన్ని పరిశీలించిన ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల మేరకు ధాన్యం ఉందని నిర్ధారిస్తే రైతు పొలం నుంచి ట్రాక్టర్లలో ధాన్యాన్ని ఆర్‌బీకేలతో అనుసంధానం చేసిన రైస్‌మిల్లుకు పంపించే ముందు వేబ్రిడ్జిల వద్ద వాలంటీర్లు బరువు చూస్తారు. వీఏఏ టోకెన్‌ ఇచ్చిన తర్వాత ధాన్యాన్ని నింపడానికి పౌరసరఫరాల సంస్థ పంపిన గోతాలు రైతులకు అందజేస్తారు. రైతులే తమ గోతాల్లో ధాన్యం పట్టి తీసుకువస్తే రూ.3 చొప్పున ధాన్యం నగదుతో కలిపి వారికి చెల్లిస్తాం. రవాణా ఛార్జీల కింద వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల పరిధిలో టన్ను ధాన్యం కి.మీ. దూరం రవాణాకు రూ.251.67లు, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల పరిధిలో రూ.277 చొప్పున ఇస్తాం. హమాలీలకు క్వింటాకు రూ.25 చొప్పున చెల్లిస్తాం. రైతులు ట్రాక్టర్లలో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే రవాణా ఛార్జీలకు వారికే ఇస్తాం.

చెల్లింపులకు సమస్య లేకుండా చేశాం

ధాన్యం సేకరించిన ఇరవై ఒక్క రోజుల్లో ఖ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం. చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తాం. ఈకేవైసీ చేయడంతో సాంకేతిక పరమైన సమస్యలు రావు. గతేడాది సాంకేతికపరమైన సమస్యల వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగింది. ఈసారి సాంకేతిక సమస్యలు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. గత రబీలో సేకరించి ధాన్యానికి ఎలాంటి బకాయిలు లేవు. రైతులకు మొత్తం సొమ్ము చెల్లించాం. కస్టమ్‌ రైస్‌ మిల్లింగ్‌ విధానం కింద రైస్‌ మిల్లర్లకు 75 శాతం సొమ్ము చెల్లింపులు జరిపాం. మరో రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. త్వరలో ఆ బకాయిలు ఇస్తాం.

ఏ జిల్లా పరిధిలో పొలం ఉంటే అక్కడే..

ఏ జిల్లా రైతులు ఆ జిల్లాలోనే ధాన్యాన్ని విక్రయించాలి. ముఖ్యంగా జిల్లా సరిహద్దు మండలాల్లోని గ్రామాల రైతులు తమ భూమి ఏ జిల్లా పరిధిలోని ఆర్‌బీకే కిందకు వస్తుందో అక్కడికి వెళ్లి ధాన్యం నమూనా ఇచ్చి వీఏఏ వద్ద టోకెన్‌ తీసుకోవాలి. ప్రస్తుతానికి ఒక జిల్లా పరిధిలోని భూముల్లో పండించిన ధాన్యాన్ని మరో జిల్లాలో  సేకరించే అవకాశం లేదు. దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు

ఆరబెడితే మంచి ధర

యంత్రాలతో నూర్పిడి చేసిన తర్వాత ధాన్యాన్ని రెండ్రోజులు ఆరబెడితే తేమ శాతం 17లోపు ఉంటుంది. తేమ శాతం 17కన్నా తక్కువ ఉంటే ఆర్‌బీకేల ద్వారా తక్షణమే ధాన్యం కొనుగోలు చేస్తాం. కొందరు రైతులు తక్షణమే నగదు కోసం ఆరబెట్టకుండా తేమ శాతం 25కు పైగా ఉన్నా ప్రైవేటు వ్యాపారులకు 75 కేజీల బస్తాను రూ.1300 నుంచి రూ.1400కు విక్రయిస్తున్నారు. ఆరబెడితే కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని