logo

కానిస్టేబుల్‌ ఈశ్వర్‌.. ఏడు ముఠాల లీడర్‌!

కానిస్టేబుల్‌ విధులకు డుమ్మా కొట్టి నేరస్థులకు సహకరించటం. వాటాలు తీసుకొనే స్థాయి నుంచి దొంగల ముఠాలను తయారు చేయటం.

Published : 28 Nov 2022 05:13 IST

పోలీసు కస్టడీలో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

ఈశ్వర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ విధులకు డుమ్మా కొట్టి నేరస్థులకు సహకరించటం. వాటాలు తీసుకొనే స్థాయి నుంచి దొంగల ముఠాలను తయారు చేయటం. పోలీసులకు పట్టుబడితే బెయిల్‌పై తీసుకురావటం. ఇదీ ఇటీవల నల్గొండ పోలీసులు అరెస్ట్‌ చేసిన నగర టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ తీరు. నల్గొండలో చరవాణుల చోరీలు పెరగడంపై దృష్టిసారించిన అక్కడి పోలీసులు సీసీ ఫుటేజీలతో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ‘ఇవన్నీ.. మా సార్‌ చేయిస్తున్నారంటూ’ చెప్పడంతో కూపీ లాగారు. కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ బండారం బట్టబయలైంది. అతన్ని నల్గొండ పోలీసులు కస్టడీలోకి తీసుకొని మూడు రోజులు విచారించారు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. కస్టడీలో తొలుత నోరు విప్పకపోయినా.. కాల్‌డేటా, హఫీజ్‌పేట్‌, చీరాలలోని నివాసాల్లో దొంగలకు వసతి కల్పించటంపై సాక్ష్యాలు చూపటంతో పలు అంశాలు చెప్పినట్లు తెలిసింది.

మేకల ఈశ్వర్‌ స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం. కానిస్టేబుల్‌గా నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించాడు. నేర విభాగంలో పనిచేయటంతో దొంగలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్రాష్ట్ర ముఠాల ఆచూకీ కోసం ఇన్‌ఫార్మర్ల సహాయం తీసుకునేవాడు. సొత్తు రికవరీలో చేతివాటం ప్రదర్శించాడు. కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలకు భాగాలు పంచేవాడనే ఆరోపణలున్నాయి. ఏపీ, తెలంగాణల్లో దొంగలతో స్నేహసంబంధాలు ఏర్పరచుకున్నాడు. వారి కుటుంబాల్లోని పిల్లలు, మహిళలతో ముఠాలు రూపొందించి హఫీజ్‌పేట్‌లోని తన నివాసంలో వసతి కల్పించాడు. బహిరంగసభలు, జనసమ్మర్థ ప్రాంతాలు, రైతుబజార్లు తదితర చోట్ల పిక్‌పాకెటింగ్‌, చరవాణులు, గొలుసు చోరీలు చేయించాడు. ప్రతినెలా ఆయా కుటుంబాలకు రూ.40,000-50,000 వరకూ వేతనంగా ఇచ్చేవాడు. ప్రస్తుతం అతడి వద్ద 7 ముఠాలు పనిచేస్తున్నాయి. వీరితో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, చరవాణులు చోరీ చేయిస్తున్నాడు. ఇతని వేధింపులు భరించలేక కొందరు అజ్ఞాతంలోకి, మరికొంతమంది ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇద్దరు మహిళలను బెదిరించి లైంగికదాడికి పాల్పడినట్టు వస్తోన్న ఆరోపణలపై వివరాలు సేకరిస్తున్నారు. అపహరించిన సెల్‌ఫోన్లను సెకండ్‌హ్యాండ్‌ మార్కెట్‌లో విక్రయించాడు. ఇతడి ముఠాలోని దొంగలు పట్టుబడినపుడు సంబంధిత ఠాణాల అధికారులతో మాట్లాడి బయటకు తెచ్చేవాడు. రిమాండ్‌లో ఉన్న వారికి బెయిల్‌ ఇప్పించేవాడు.

అంతా గప్‌చుప్‌

ఈశ్వర్‌ అరెస్ట్‌తో కొందరు సీఐలు, ఎస్సైల్లో గుబులు మొదలైంది. నలుగురు సీఐల సహకారంపై అంతర్గత విచారణ సాగుతోంది. వీరిలో ఇద్దరు హైదరాబాద్‌, మరో ఇద్దరు సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్నట్లు తెలిసింది. దొంగలతో జట్టుకట్టిన మరో ఇద్దరు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుళ్లు, సహకరిస్తున్న హోంగార్డుల వివరాలపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్పెషల్‌బ్రాంచి పోలీసులు.. ఇంటిదొంగల అవినీతి బాగోతంపై నగర సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక అందజేసినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని