logo

కదలని దస్త్రం..

పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. కానీ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అవసరమైన దస్త్రాలు తెప్పించుకోవడానికి నెలలు పడుతోంది.

Updated : 28 Nov 2022 06:51 IST

తేలని మెడికల్‌ లీవ్‌లు, ఇంక్రిమెంట్లు
పరిష్కారం కాని జిల్లాల విభజన సమస్యలు
ఈనాడు, అమరావతి

పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. కానీ ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అవసరమైన దస్త్రాలు తెప్పించుకోవడానికి నెలలు పడుతోంది. దీంతో ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలు నెలల తరబడి అపరిష్రృతంగా ఉంటున్నాయి. సాక్షాత్తు ఉద్యోగులకు చెందిన సర్వీసు వ్యవహారాలు పరిష్కరించడానికే నెలలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండటంపై వారి నుంచి విస్మయం వ్యక్తమవుతోంది.

గుంటూరు నుంచి పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు మధ్య దూరం 40 కి.మీ మాత్రమే. అక్కడి నుంచి గుంటూరు జిల్లా పోలీసులు కొన్ని దస్త్రాలు తెచ్చుకోవటానికి నెలలు సమయం తీసుకోవటంపై ఉద్యోగుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు,.తెనాలి, దుగ్గిరాల, కొల్లూరు, తుళ్లూరు, ఫిరంగిపురం మండలాలు గతంలో గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసుల పరిధిలో ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో అవి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చాయి. అప్పటి దాకా రూరల్‌ జిల్లా పోలీసుల పరిధిలో పనిచేసి కొత్త జిల్లాలు ఏర్పాటైన సమయంలో మెడికల్‌ లీవు, ఇతరత్రా సెలవుల్లో ఉన్న ఉద్యోగులు ఆ తర్వాత వారికి కేటాయించిన జిల్లాల్లో చేరారు. ఆ నాటి నుంచి మాత్రమే కొత్త జిల్లాల్లో వారికి జీతాలు చెల్లిస్తున్నారు. అంతకు ముందు లీవులో ఉంటే మెడికల్‌ లీవు శాంక్షన్‌ చేసి మిగిలిన చేసిన రోజులకు జీతాలు చెల్లించి ఆ మేరకు ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి. కనీసం ఆ లీవులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించడం లేదని పలువురు పోలీసులు వాపోతున్నారు. జిల్లాల ఏర్పాటు సమయంలో ఎవరైతే మెడికల్‌ లీవ్‌, ఇతరత్రా సెలవుల్లో ఉన్నారో ఆ కాలానికి సంబంధించిన జీతభత్యాలు, ఇతరత్రా సెలవులను పరిష్కరించాలని ప్రతి శుక్రవారం ఉద్యోగులకు మాత్రమే నిర్వహించే స్పందన కార్యక్రమానికి హాజరై ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నా ఫలితం ఉండడం లేదని చెబుతున్నారు. ఆ రికార్డులు నరసరావుపేట, బాపట్లలో ఉన్నాయని, అవి తీసుకొచ్చాక సెలవులు, జీతాల బిల్లులు పెడతామని కార్యాలయ అధికారులు చెబుతూ తమను ఇబ్బంది పెడుతున్నారని బాధిత పోలీసు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ఇలాంటి సమస్యలతో బాధపడే పోలీసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారంతా ఎంతో ఆశతో వచ్చి స్పందనలో అధికారులను కలిసి  విన్నవిస్తున్నా సమస్యకు పరిష్కారం లభించకపోవటంతో కొందరు ఇక తిరగలేమని ఊరుకుంటున్నారు. గుంటూరు నుంచి నరసరావుపేట, బాపట్లకు రెండు గంటల్లో వెళ్లొచ్చు. ఉమ్మడి గుంటూరులోనే ఆ రికార్డులు ఉన్నా వాటిని సేకరించి తమకు రావల్సిన ప్రయోజనాలు అందించటానికి నెలలు సమయం తీసుకోవటం చూస్తుంటే బాధ్యులైన ఉద్యోగులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో  ఊహించుకోవచ్చు.

ఉద్యోగుల సమస్యలు మచ్చుకు..

* తుళ్లూరులో పనిచేసే ఉద్యోగి జిల్లాల విభజన సమయంలో రూరల్‌ పరిధిలో ఉన్నారు. అప్పట్లో మెడికల్‌ లీవు పెట్టుకుని 20 రోజులకు పైగా సెలవులో ఉన్నారు. ఆ లీవు సమస్యను పరిష్కరించాలని సదరు ఉద్యోగి జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ) చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. పలుమార్లు కలవగా ఆ రికార్డులు నరసరావుపేట నుంచి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఆ రికార్డులను జులై 17న గుంటూరు నుంచి నరసరావుపేట పట్టుకెళ్లారు. సదరు ఉద్యోగికి లీవులు మంజూరు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
* గుంటూరులో పనిచేస్తున్న మరో ఉద్యోగి జూన్‌లో మెడికల్‌ లీవు పెట్టారు. ఆ ఉద్యోగి గతంలో రూరల్‌ జిల్లా పోలీసుల పరిధిలో ఉన్నారు. ఆ కాలానికి సదరు ఉద్యోగికి ఇంక్రిమెంట్‌ ఆపారు. ప్రస్తుతం తాను గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చి నెలలు గడిచినా తన ఇంక్రిమెంట్‌ మాత్రం పరిష్కరించలేదని సదరు ఉద్యోగి చెప్పారు.
* తెనాలిలో పనిచేసే ఉద్యోగి ఒకరు అడిషనల్‌ సరండర్‌ లీవ్‌(ఏఎస్‌ఎల్‌) వినియోగించుకోలేదు. దానికి నగదు చెల్లించాలి. ఇవి చాలా మంది ఉద్యోగులకు రాలేదు. .
* ఆయా జిల్లాల నుంచి మెమోలు రావాలని చెబుతున్నారు. నరసరావుపేట, బాపట్ల జిల్లాలు ఏమైనా గుంటూరుకు సుదూరాన ఉన్నాయా అని బాధిత ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
* ఆయా జిల్లాల నుంచి లీవ్‌ మెమోలు తెప్పించి జీతాలు, ఇంక్రిమెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని