logo

విద్యుదాఘాతంతో వడ్రంగి దుర్మరణం

‘ఇంటి యజమాని త్వరగా పని పూర్తి చేయమన్నారు. అందుకే ఆదివారం కూడా పనికి వెళ్లక తప్పడం లేదు. సాయంత్రం త్వరగా ఇంటికి తిరిగొస్తానని’ చెప్పి వెళ్లిన భర్త మధ్యాహ్నానికే శవమై ఇంటికి చేరడంతో ఏడు నెలల గర్భిణి అయిన అతని భార్య తల్లడిల్లిపోయింది.

Published : 28 Nov 2022 05:13 IST

పెళ్లయిన పదినెలలకే దారుణం
భార్య ఏడునెలల గర్భిణి

నాగరాజు (పాతచిత్రం)

వేమూరు, చెరుకుపల్లి, న్యూస్‌టుడే: ‘ఇంటి యజమాని త్వరగా పని పూర్తి చేయమన్నారు. అందుకే ఆదివారం కూడా పనికి వెళ్లక తప్పడం లేదు. సాయంత్రం త్వరగా ఇంటికి తిరిగొస్తానని’ చెప్పి వెళ్లిన భర్త మధ్యాహ్నానికే శవమై ఇంటికి చేరడంతో ఏడు నెలల గర్భిణి అయిన అతని భార్య తల్లడిల్లిపోయింది. జీవితాంతం కలిసి ఉంటానని బాస చేసిన భర్త పెళ్లయిన పది నెలలకే మృత్యువాత పడడంతో జన్మించాక తన బిడ్డ తండ్రి ఏడని అడిగితే ఏమని చెప్పాలని ఆమె కన్నీటిపర్యంతం కాగా ఆమెను ఓదార్చడం బంధువులకూ సాధ్యం కాలేదు. వృద్ధాప్యంలో తోడుగా ఉండాల్సిన ఒక్కగానొక్క కుమారుడు కానరాని లోకానికి చేరడంతో అతని తల్లిదండ్రులు ప్రసాద్‌, వాణి శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే...బాధితుల కథనం ప్రకారం వేమూరు మండలం చావలికి చెందిన కె.నాగరాజు (28)కు అదే గ్రామానికి చెందిన దీప్తితో పదినెలల క్రితం వివాహమైంది. నాగరాజు వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవాడు. పనిలో భాగంగా అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురితో కలసి చెరుకుపల్లి మండలం కావూరులో ఓ ఇంటి పనికి ఆదివారం వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో అల్యూమినియం రాడ్లను పైకి తీసుకువచ్చే క్రమంలో అవి సమీపంలోని 11కేవీ విద్యుత్తు తీగలకు తాకాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. అతనితో పనిచేస్తున్న వారు గుళ్లపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని చావలి తరలించారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెరుకుపల్లి పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు సంఘటనా స్థలానికి చేరుకుని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని