logo

దోపిడీ దొంగలను పట్టించిన ‘ఏటీఎం కార్డు’

విద్యుత్తు శాఖ లైన్‌మెన్‌పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ముగ్గురిని పెదకాకాని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 28 Nov 2022 05:13 IST

విద్యుత్తు లైన్‌మెన్‌పై దాడి చేసిన ముగ్గురి అరెస్ట్‌ 

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రాంబాబు, సీఐ బండారు సురేష్‌బాబు, ఎస్సై కోటేశ్వరరావు

పెదకాకాని, న్యూస్‌టుడే : విద్యుత్తు శాఖ లైన్‌మెన్‌పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ముగ్గురిని పెదకాకాని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెదకాకాని పోలీస్‌స్టేషన్లో డీఎస్పీ రాంబాబు, సీఐ బండారు సురేష్‌బాబు, ఎస్సై కోటేశ్వరరావు నిందితుల అరెస్ట్‌ వివరాలను వెల్లడించారు. తెనాలి మండలం కొలకలూరుకి చెందిన వ్యక్తి పల్నాడు జిల్లా నరసరావుపేటలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 22న తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. నందివెలుగు రోడ్డులోని ఓ బార్‌లోకి లైన్‌మెన్‌ తన వెంట తెచ్చుకున్న మద్యం సీసాతో వెళ్లారు. అక్కడి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న గుంటూరులోని పొట్టిశ్రీరాములు నగర్‌కి చెందిన మావులూరి అంబేడ్కర్‌ అనే వ్యక్తి లైన్‌మెన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై మానస సరోవరం పక్కనున్న ఖాళీ స్థలంలోకి వెళ్లి మద్యం తాగారు. అనంతరం అంబేడ్కర్‌ లైన్‌మెన్‌ని కొట్టి, చంపుతానని బెదిరించి ద్విచక్రవాహనంతో పరారయ్యాడు.

గంట వ్యవధిలో రెండో సారి దోపిడీకి గురి.. ద్విచక్ర వాహనం లేకపోవడంతో లైన్‌మెన్‌ తక్కెళ్లపాడు పై వంతెన కింద కూర్చున్నాడు. గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికులు శివరాత్రి వెంకటేశ్వర్లు, గట్టుపల్లి వెంకటేశ్‌ అటుగా వెళ్తూ లైన్‌మెన్‌ని ఏం జరిగిందని ప్రశ్నించగా తన ద్విచక్ర వాహనాన్ని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడని చెప్పాడు. ఆ వ్యక్తి తమకు తెలుసని వాహనం ఇప్పించడానికి రూ.4వేలు అడిగారు. ముగ్గురూ కలిసి పెదకాకాని ఏటీఎం కేంద్రానికి వెళ్లి బ్యాంకు కార్డు ద్వారా రూ.3 వేల నగదు విత్‌డ్రా చేశారు. అనంతరం వారు లైన్‌మెన్‌ను పెదకాకాని భ్రమరాంబపురం కాలనీలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రాయితో కొట్టి చేతికి ఉన్న నాలుగు ఉంగరాలు(32గ్రాములు), ఏటీఎం కార్డు లాక్కొని వెళ్లారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డులోని ఏటీఎం సెంటర్‌కి వెళ్లి రూ.34,500 డ్రా చేశారు. తీవ్ర గాయాలైన లైన్‌మెన్‌ని స్థానికులు పెదకాకానిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నెల 25వ తేదీ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చ్రేశారు.

దొంగలు ఇలా దొరికారు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏటీఎం సెంటర్‌, బార్‌లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో బాధితుడితో కొంత మొత్తాన్ని ఖాతాలో జమ చేయించారు. నిందితులు లైన్‌మెన్‌ ఏటీఎం కార్డుతో నగదు విత్‌డ్రా చేశారు. బాధితుడు ఈ విషయం పోలీసులకు తెలపగా వారు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. ఏటుకూరి రోడ్డు సెంటర్‌లోని బార్‌లో ఉన్న ఇద్దరిని, అంబేడ్కర్‌ను అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. వారి నుంచి నాలుగు ఉంగరాలు(32గ్రాములు), రూ.37,500 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన క్రైం పార్టీ కానిస్టేబుళ్లు శ్యాంసన్‌, బిక్షునాయక్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావును అభినందించి రివార్డు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని