logo

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా కబళించిన మృత్యువు

కుమార్తె ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై మోపెడ్‌ వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా  వేగంగా వచ్చిన కోళ్ల లోడు లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Published : 28 Nov 2022 05:13 IST

కోళ్ల లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం

ప్రమాదానికి కారణమైన కోళ్ల లారీ

గుంటూరు రూరల్‌, న్యూస్‌టుడే: కుమార్తె ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై మోపెడ్‌ వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా  వేగంగా వచ్చిన కోళ్ల లోడు లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌కు చెందిన మేడా ఏసు (50), అదే గ్రామానికి చెందిన ఆయన మరదలు వెంకాయమ్మ(45) బుడంపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మేడా ఏసు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఏసు నిమ్మకాయల వ్యాపారం చేస్తుంటాడు. శనివారం ఏసు, ఆయన మరదలు వెంకాయమ్మలు టీవీఎస్‌ వాహనంపై బాపట్ల సమీపంలోని చల్లపాడు వెళ్లారు. అక్కడ జరిగిన శుభకార్యానికి హాజరై ఆదివారం ఉదయం అమీనాబాద్‌కు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న టీవీఎస్‌ బుడంపాడు సమీపంలోని ఇంజినీరింగ్‌ కళాశాల వద్దకు వచ్చిన సమయంలో కోళ్ల లోడుతో తెనాలి వైపు వెళుతున్న మినీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏసు, వెంకాయమ్మలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టీవీఎస్‌ మోపెడ్‌ మంటల్లో కాలిపోయింది. ప్రమాదానికి కారణమైన కోళ్ల లోడు లారీ డ్రైవర్‌ వాహనం అక్కడ వదిలేసి పరారయ్యాడు. నల్లపాడు పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జీజీహెచ్‌కి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించటంతో వారు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఏసు కుమార్తె తోకల కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఏడు కొండలు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు.

కాలిపోయిన మోపెడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని