logo

రొయ్యకు మద్ధతు ఒట్టిదే..

బాపట్లకు చెందిన రైతు భార్గవ్‌ మూడు ఎకరాల్లో వనామీ రొయ్యలు సాగు చేపట్టాడు. ఒక చెరువులో వంద కౌంట్కు వచ్చిన రొయ్యలు విక్రయించాడు.

Updated : 29 Nov 2022 05:28 IST

వంద  కౌంటుకు దక్కని   రూ.210

ప్రభుత్వ ఆదేశాలు అమలుకాకపోవడంపై సాగుదారుల ఆవేదన

బాపట్ల, న్యూస్‌టుడే

బాపట్లకు చెందిన రైతు భార్గవ్‌ మూడు ఎకరాల్లో వనామీ రొయ్యలు సాగు చేపట్టాడు. ఒక చెరువులో వంద కౌంట్కు వచ్చిన రొయ్యలు విక్రయించాడు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా వంద కౌంట్కు వ్యాపారి రూ.210 ధర ఇవ్వలేదు. కేజీ రూ.180కే విక్రయించుకోవాల్సి వచ్చింది. టన్నుకు రూ.30 వేల చొప్పున నష్టపోయాడు. 70 కౌంట్ రొయ్యలు అమ్మకానికి పెట్టినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ కౌంట్‌ అయితే దళారులు కేజీకి రూ.230 మాత్రమే ఇస్తామంటున్నారు. రైతుకు కేజీ రొయ్యల ఉత్పత్తికి రూ.320 ఖర్చయింది. రెండు టన్నులకు రూ.1.80 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది.

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రూ.లక్షలు ఖర్చు చేసి పండించిన రొయ్యలు విక్రయించలేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వంద కౌంట్ కేజీకి ప్రభుత్వం ప్రకటించిన రూ.210 ధర పూర్తిగా అమలు కావడం లేదు. పెద్ద కౌంట్వి కొనేవారు లేకపోవడంతో చెరువులో రొయ్యలు పట్టలేక, కరెంటు బిల్లులు, సాగు వ్యయం విపరీతంగా పెరిగి ముందుకు వెళ్లలేక సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్తు సిబ్బంది కనెక్షన్లు తొలగిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రొయ్యల సాగుదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. రూ.లక్షల్లో నష్టాలు రావడంతో అప్పులపాలైన కౌలు రైతులు సాగుకు దూరం జరుగుతున్నారు. చెరువులు వదిలేస్తున్నారు.

జిల్లా నుంచి విదేశాలకు రొయ్యల ఎగుమతులు నిలిచిపోయాయి. ఎగుమతిదారులు రెండు నెలల క్రితం పంపించిన రొయ్యలకు నగదు ఇంకా అందలేదు. ఈ నేపథ్యంలో రొయ్యలు విక్రయించిన రైతులు రెండు నెలలు గడిచినా వ్యాపారులు నగదు చెల్లించలేదు. శీతలీకరణ గిడ్డంగుల్లో రొయ్యల నిల్వలు పేరుకుపోయాయి. దీంతో 70 శాతం మంది వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు వచ్చిన ఒకట్రెండు ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ప్రతినిధులు మాత్రమే 90 నుంచి 120 కౌంట్ రొయ్యలు కొనుగోలు చేస్తున్నారు. చెన్నై, హైదరాబాద్‌ మార్కెట్లకు సరఫరా చేసి విక్రయించే స్థానిక వ్యాపారులు 150 నుంచి 210 కౌంట్ వరకు మాత్రమే రొయ్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను దళారులు తమకు అనుకూలంగా మలుచుకుని చాలా తక్కువ ధరకు రొయ్యలు కొనుగోలు చేస్తున్నారు. వంద కౌంట్ రొయ్యలకు రూ.170 నుంచి 180లు మాత్రమే చెల్లిస్తున్నారు. నష్టాలు వస్తున్నా వనామీ రైతులు ముందుకు వెళ్లలేక రొయ్యలు విక్రయిస్తున్నారు. టైగర్‌ రొయ్యలు సాగు చేసేవారు ప్రస్తుతం 20 కౌంట్వి కొనుగోలు చేయకపోవడంతో ఏడు నెలలు గడిచినా 15, 12 కౌంట్ వరకు రొయ్యలు పెంచేందుకు అప్పులు తెస్తున్నారు. కనీసం డిసెంబరు నెలాఖరు తర్వాత అయినా ధరలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆక్వా నిపుణులు వచ్చే ఏడాది జులై వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. 2023 మే వరకు ఆగి అప్పటి పరిస్థితులను చూసి సాగు ప్రారంభించాలని ఎక్కువ మంది భావిస్తున్నారు.


కర్లపాలేనికి చెందిన రైతు సుబ్బారావు 13 ఎకరాల్లో టైగర్‌ రొయ్యలు సాగు చేశాడు. ఏప్రిల్‌లో చెరువుల్లో పిల్లలు పోశారు. 20 కౌంట్ రొయ్యల పంట చేతికి వచ్చే సరికి మార్కెట్లో ధర కుప్పకూలింది. వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. పన్నెండు, పదిహేను కౌంట్ వరకు పెంచితే కొనుగోలు చేస్తామని పలువురు చెప్పారు. ఐదు నెలల పంట కాలం కాస్తా ఏడు నెలలు అయింది. కరెంటు బిల్లుల బకాయి రూ.లక్షన్నరకు చేరుకుంది. బిల్లు చెల్లించి మేత కొనుగోలుకు నగదు చేతిలో ఉంచుకుందామని ఐదు ఎకరాల్లో రొయ్యలను తక్కువ ధరకే వ్యాపారికి విక్రయించారు. నెలన్నర గడిచినా విదేశాలకు ఎగుమతి కాలేదని రైతుకు నగదు ఇవ్వలేదు. బిల్లు చెల్లించలేదని సిబ్బంది కరెంటు కనెక్షన్‌ తొలగించారు. సుబ్బారావు తెలిసినవారి వద్ద అందినకాడికి అప్పు చేసి డీజిల్‌ కొనుగోలు చేసి జనరేటర్ల ద్వారా ఎనిమిది ఎకరాల్లో ఏరియేటర్లు తిప్పుతూ వ్యాపారులు కొనుగోలు చేసే 12 కౌంట్కు రొయ్యలు పెంచుతున్నాడు.


నిర్ణయించిన ధర  చెల్లించాల్సిందే..

వంద కౌంట్ రొయ్యలకు రూ.210 చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించి ఈ ధర చెల్లించాల్సిందే. మత్స్యశాఖ అధికారులను రైతులు కలిసి చెబితే ప్రభుత్వం నిర్దేశించిన ధరకే కంపెనీలు, వ్యాపారులు కొనుగోలు చేసేలా చూస్తాం. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో శీతాకాలం ముగిసే వరకు సాగుదారులు ఆగి చెరువులు ఎండబెట్టుకుని ఆ తర్వాత సాగు ప్రారంభించాలి.

సురేష్‌, మత్స్యశాఖ జేడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని