logo

పొలాల్లో ఆగని చోరీలు

అన్నదాతలకు సాగునీటిని అందించే వ్యవసాయ మోటర్లు, సోలార్‌ పరికరాల చోరీలు అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

Published : 29 Nov 2022 04:51 IST

అంతకంతకూ పెరుగుతున్న ఘటనలపై రైతుల ఆందోళన

మార్టూరు, యద్దనపూడి, న్యూస్‌టుడే

న్నదాతలకు సాగునీటిని అందించే వ్యవసాయ మోటర్లు, సోలార్‌ పరికరాల చోరీలు అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రబీ వ్యవసాయ పనులు జోరందుకుంటున్న తరుణంలో సాగుకు వినియోగించే పరికరాలు దొంగలపాలవడంతో పైర్లు దెబ్బతిని పంటలు నాశనమవుతాయని రైతులు దిగాలు చెందుతున్నారు. మార్టూరు, అద్దంకి, బల్లికురవ మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్తు మోటర్లు, సోలార్‌ పలకలు రాత్రికి రాత్రి కొల్లగొడుతున్నారు. రూ.లక్షలతో ఏర్పాటు చేసుకున్న విలువైన వ్యవసాయ పరికరాలు, సామగ్రిని దొంగలు ధ్వంసం చేసి తీసుకెళ్లడంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ఒక్కరోజే 30 యూనిట్లు..

ఇసుకదర్శి వద్ద నాలుగు నెలలక్రితం ఒక్కరోజే అర్ధరాత్రి ప్రాంతంలో సుమారు 30 సోలార్‌ యూనిట్లలో చోరీ జరిగింది. శ్రీరంగ క్షేత్రం నుంచి నాగరాజుపల్లి వెళ్లే మార్గం వెంట ఉన్న పొలాల్లోని సోలార్‌ పలకల కింద ఉన్న ఖరీదైన తీగలను దొంగలు తీసుకెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజుపల్లిలో సోలార్‌ పలకలను ధ్వంసం చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. మార్టూరులోని రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసుకున్న సోలార్‌ పరికరాల తీగలను దొంగిలించి పొలాల్లోనే కాఫర్‌ తీగ వలుచుకుని తీసుకెళ్లారు. మార్టూరు ప్రాంతంలో రైతుల పొలాల్లో చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. రాత్రివేళ పోలీసులు, రైతుల సమన్వయంతో పహరా ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.


ఏడాదిలో రెండోసారి..

మార్టురు మండలంలోని జొన్నతాళిలో ఆదివారం సోలార్‌ పలకల నుంచి విద్యుత్తు సరఫరా జరిగే విలువైన తీగ, బోరు మోటరుకు చెందిన సర్వీసు తీగను దొంగలు కత్తిరించుకెళ్లారు. గ్రామానికి చెందిన మురకొండ అప్పారావు అనే రైతుకు చెందిన జనుము పంట మధ్యలో ఉన్న ఈ పథకం వద్ద ఏడాదిలో రెండోమారు వ్యవసాయ పరికరాలకు చెందిన కరెంటు తీగను చోరీ చేయడం గమనార్హం. రాజుగారిపాలెంలో వాగు వెంట ఉన్న పాలాల్లో రైతులు సొంత నిధులతో విద్యుత్తు మోటర్లను ఏర్పాటు చేసుకుని పంటల సాగుకు ఉపక్రమిస్తున్నారు. నాలుగు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు రూ.వేలు విలువ చేసే మోటర్లను దోచుకెళ్లారు. సమీపంలోని విద్యుత్తు పరివర్తకాన్ని పగులగొట్టి అందులో ఉన్న కాఫర్‌ తీగను దోచుకెళ్లారు.


రెండు కంచెలు ఉన్నా వదల్లేదు

కోలలపూడిలోని నా మామిడి తోట చుట్టూరా ఫెన్సింగ్‌ ఉంది. లోపలి భాగంలో ఉన్న సాలార్‌ చుట్టూరా మరో కంచె ఏర్పాటు చేసుకున్నాను. అయినా దొంగలు నా సోలార్‌ పరికరాలను వదలలేదు. నాతోపాటు పక్కనున్న పొలాల్లోని సోలార్‌ పథకం వద్ద ఉన్న ప్యానల్‌ బోర్డులోని సామగ్రి దోచుకెళ్లారు. ఒక్కోటి రూ.30 వేల విలువైన పరికరాలను దొంగలు దోచుకెళ్లారు.

సాదినేని కోటేశ్వరరావు, మామిడి తోట యజమాని, కోలలపూడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని