logo

గదుల్లేవ్‌.. గురువులూ లేరు

‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు.

Published : 29 Nov 2022 04:51 IST

ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా విద్యార్థులను పీడిస్తున్న సమస్యలు

ఈనాడు-అమరావతి

‘ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సర్కారీ బడుల్లో చదివే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వీరు ప్రపంచంతో పోటీ పడతారు. లేదంటే ఉద్యోగాలు  దక్కించుకోవటంలో వెనకబడిపోతారు’ అని అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల దాకా సభల్లో వల్లెవేస్తారు.

సత్తెనపల్లిలో ఓ పాఠశాలలో ఇదీ పరిస్థితి..

క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో బోధనకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా? లేరా? అనేది పట్టించుకోవటం లేదు. టీచర్లు, గదులు కొరతే కాదు నిన్న, మొన్నటి దాకా పుస్తకాల కొరత సమస్యలతోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు సతమతమయ్యారు. నాడు-నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించలేదు. టీచర్ల కొరతతో ఒకే టీచర్‌ తాను బోధించే సబ్జెక్టుతో పాటు అదనంగా మరో  సబ్జెక్టును బోధిస్తున్న పరిస్థితి ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ఉంది. ఇలా ఉపాధ్యాయులపై పనిభారం పెరగటంతో మొక్కుబడి బోధన చేస్తున్నారు.. సబ్జెక్టు టీచర్ల ఖాళీల్లో కనీసం వాలంటీర్లను నియమించినా తమకు కొంత వెసులుబాటు కలుగుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఆదివారం పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ హెచ్‌ఎస్‌ విద్యార్థులు బోధనకు సరిపడా టీచర్లు లేరని రోడ్డెక్కారు. గణితం, సైన్సు, సోషల్‌ బోధించే ఉపాధ్యాయులు లేరు. గతేడాది ఎక్కువమంది హిందీ, సోషల్‌, గణితంలో తప్పారు. ప్రధానంగా టెన్త్‌ విద్యార్థులకు టీచర్లు లేకపోతే నష్టపోతారు. వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో సిలబస్‌ పూర్తి చేసి తిరిగి పునశ్చరణ ప్రారంభించాలి. ఆ సమయానికి అయినా డిప్యూటేషన్‌పై సర్దుబాటు చేయాలని విద్యార్థులు  కోరుతున్నారు.

పల్నాడు నుంచి డిప్యూటేషన్లు..

పల్నాడు ప్రాంతం నుంచి  కొందరు టీచర్లు డిప్యూటేషన్‌, సర్దుబాటు పేరుతో ప్రభుత్వ స్థాయిలోనే పైరవీలు చేసుకుని గుంటూరు చుట్టుపక్కలకు వచ్చేశారు. దీంతో పల్నాడు పాఠశాలల్లో బాగా కొరత ఉంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి, గుంటూరు నగరపాలక ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తోంది. హైస్కూళ్లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్‌ఏలు, ఎస్‌జీటీ, పీఈటీ, పీడీలు ఇలా అన్ని క్యాడర్లలో కొరత ఉంది. కొందరు ఉద్యోగ విరమణ చేయగా మరికొందరు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లటం, విలీనం, గత మూడేళ్లుగా డీఎస్సీ నియామకాలు చేపట్టకపోవటం వంటివి టీచర్ల కొరతకు కారణాలుగా ఉపాధ్యాయ సంఘాలు నాయకులు తెలిపారు.


మచ్చుకు కొన్ని పాఠశాలల్లో కొరత ఇలా..

గుంటూరు కొల్లిశారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్లం బోధించేవారు లేరు. స్వర్ణాంద్రనగర్‌ అప్‌గ్రేడెడ్‌ స్కూల్‌, అశోక్‌నగర్‌ యూపీ పాఠశాలలోనూ టీచర్ల సమస్య నెలకొంది.

మంగళగిరి మున్సిపల్‌ వీవర్స్‌ కాలనీ పాఠశాలలో పెద్ద సంఖ్యలో పిల్లలు ఉన్నారు. కానీ వారికి తగ్గ నిష్పత్తిలో ఉపాధ్యాయులు లేరు. అదనంగా టీచర్లను సమకూర్చాలని  లేఖలు పెట్టారు. స్థానికంగానే ఉన్న బ్రహ్మానందరెడ్డి తదితర స్కూళ్లల్లోనూ ఈ సమస్య ఉంది.

వట్టిచెరుకూరు మండలం ముట్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్ల సమస్య నెలకొంది.

కొల్లిపర మండలం తూములూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2020 నుంచి ఒకే ఒక్క టీచర్‌ బయాలజీ బోధిస్తున్నారు. ఇద్దరికి ఒక్కరే ఉన్నారు.

అమరావతి మండలం మల్లాది జడ్పీహెచ్‌ఎస్‌లో పిల్లలను ఆడించటానికి పీడీ లేరు

సత్తెనపల్లి మండలం అబ్బూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం, బయాలజీ చెప్పేవారు లేరు.
వెన్నాదేవి అప్‌గ్రేడెడ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్‌, బయాలజీ టీచర్లు లేరు.

మాచవరం మండలం వేమవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌, సోషల్‌ చెప్పేవారు లేరు

నూజెండ్ల మండలం పీఎన్‌పల్లి ఉన్నత పాఠశాలలో హిందీ, ఫిజిక్స్‌, బయాలజీ మూడు సబ్జెక్టులు బోధించేవారు లేరు

దుర్గి మండలం ఓబులేశునిపల్లె ఎస్‌కేఎస్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో 2017 నుంచి హిందీ ఉపాధ్యాయుడి పోస్టు ఖాళీగా ఉంటోంది.

మాచర్ల మండలం కొప్పునూరు జడ్పీహెచ్‌ఎస్‌లో సాంఘికశాస్త్రం బోధించేవారు లేరు.

గురజాల మండలం తేలుకుట్ల జడ్పీహెచ్‌ఎస్‌లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు