logo

వైద్యుడి దయ.. రోగి ప్రాప్తం!

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్‌)కు అత్యవసరమై రాత్రి పూట వైద్య సేవలకు వచ్చేవారికి వైద్యుడి దయ.. రోగి ప్రాప్తం అనేలా ఉంటోంది.

Updated : 30 Nov 2022 06:00 IST

రాత్రి పూట పీజీలపైనే ఆధారపడిన సేవలు
జీజీహెచ్‌లో ‘ఈనాడు-ఈటీవీ’ పరిశీలన

ఈనాడు, అమరావతి: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్‌)కు అత్యవసరమై రాత్రి పూట వైద్య సేవలకు వచ్చేవారికి వైద్యుడి దయ.. రోగి ప్రాప్తం అనేలా ఉంటోంది. సాధ్యమైనంత వరకు రాత్రివేళ సేవలు పీజీ వైద్యులపై ఆధారపడి కొనసాగుతున్నాయి. రెగ్యులర్‌ డ్యూటీ డాక్టర్లు, కాల్‌డ్యూటీ డాక్టర్లు అనేవారు భూతద్దం పెట్టి వెతికినా కనిపించని పరిస్థితి. సోమవారం రాత్రి ‘ఈనాడు-ఈటీవీ’ బృందం ఆస్పత్రిలో పరిశీలనకు వెళ్లగా ఇది బయటపడింది.

ఒకవైపు పొదిలి ప్రసాద్‌ మిలీనియం బ్లాక్‌లోని క్యాజువాల్టీకి రహదారి ప్రమాదాలు, ఆత్మహత్యలు, అకస్మాతుగా రక్తపోటు, మధుమేహం పడిపోయి వచ్చే కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. వాటిల్లో తక్షణం చూడాల్సిన కేసులు ఏమిటి? ఎవరికి ప్రాణాపాయం ఉంది? వారికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన రెగ్యులర్‌ వైద్యులు క్యాజువాల్టీలో ఉండడం లేదు. ప్రతి కేసును పీజీ వైద్యులే (పీజీ స్టూడెంట్స్‌) చూస్తున్నారు. ఒక కేసు చూస్తుండగానే మరో అత్యవసర కేసు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. వాటిల్లో ఏ కేసుకు హాజరుకావాలో తెలియకుండా ఉంటోంది. సీనియర్‌ వైద్యులైన డ్యూటీ డాక్టర్లు ఆ సమయంలో విధుల్లో ఉంటే వారి పర్యవేక్షణలో మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందని పీజీ వైద్యులు అంటున్నారు..

 వెతుక్కోవాలి?

రోగులు క్యాజువాల్టీకి చేరుకోగానే వారికి ఏమైందని చెప్పి ఆరా తీయాలి. కానీ అది జరగడం లేదు. రోగి సహాయకులే వైద్యుల కోసం క్యాజువాల్టీలో పరుగులు పెట్టాల్సిన దుస్థితి, బతిమాలి వైద్యం చేయించుకుంటున్నారు. అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రొటేషన్‌ పద్ధతిలో ఒక వారం పగలు చేస్తే మరో వారం రాత్రిపూట సేవలకు హాజరయ్యేలా డ్యూటీ రోస్టర్‌ను వేసుకుని విధులకు హాజరుకావాలి. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఓ, అసిస్టెంట్‌ ఆర్‌ఎంఓలతో పాటు ఆ విభాగం విభాగాధిపతిపైనా ఉంటుంది.కేవలం పీజీ వైద్యులపైనే ఆధారపడి సేవలు కొనసాగుతుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

వైద్యం అందక ఇబ్బంది పడిన కేసులు మచ్చుకు..

* తెనాలి మండలం కొలకలూరుకు చెందిన భీముడు కాలు బాగా వాయడంతో తొలుత తెనాలి జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. సోమవారం సాయంత్రం 6గంటలకు వచ్చిన ఆయనకు రాత్రి 11 గంటల వరకు స్ట్రెచర్‌ మీదే ఉంచి వారి కుటుంబీకులు వైద్యుల కోసం తిరిగారు. ఎవరూ పట్టించుకోలేదు. కేవలం సెలైన్‌ బాటిల్‌ ఒకటి పెట్టి వదిలేశారని బాధితుడి కుటుంబీకులు ఆవేదన చెందారు. మరోవైపు బాధితుడు విపరీతమైన నొప్పి వస్తోందని అల్లాడిపోయారు.
* దోర్నాలకు చెందిన 70 ఏళ్ల ఎల్లయ్య కిందపడగా గూడ జారింది. సోమవారం ఉదయం 11 గంటలకు అత్యవసర విభాగానికి రాగా ఎక్సరే తీసి దానికి సర్జరీ చేస్తే వయస్సు దృష్ట్యా మీరు తట్టుకోలేరని మందులు రాసిస్తాం అవి వాడుకుని తిరిగి 15 రోజుల తర్వాత రావాలని సూచించారు. ఆ రోగికి ఐదు రోజులకే మందులిచ్చారు. రాత్రి 9 గంటలకు డిశ్ఛార్జి రాసి వెళ్లిపోమన్నారు. ఆ మందులు బయట దొరకవని కనీసం పది రోజులకు ఇవ్వాలని కోరినా మందులు లేవని చెప్పారు. ఈ రాత్రి వేళ అంతదూరం వెళ్లలేమని ఉదయం వెళతామని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. బలవంతంగా వెళ్లాలని ఆదేశించడంతో కుటుంబీకులే స్ట్రెచర్‌ మీద బయటకు తీసుకొచ్చి అద్దె కారు మాట్లాడుకుని ఆ రాత్రి వేళ ఇంటికి వెళ్లడం కనిపించింది.
* గుంటూరులో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని ఒకరు ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వచ్చిన పది నిమిషాలకు కూడా డాక్టర్లు ఎవరూ హాజరుకాలేదు. మరోవైపు విద్యార్థిని తల్లి కనిపించిన ప్రతి వైద్యుడిని మా అమ్మాయిని చూడాలని వేడుకున్నారు. 20 నిమిషాల తర్వాత వచ్చి ఆ బాలికకు వైద్యసేవలు అందించారు.
* తెనాలికి చెందిన 50 ఏళ్ల మహిళ ఒకరు లోబీపీతో ఇంటి వద్ద పడిపోగా హుటాహుటిన కుటుంబీకులు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చేరే సమయానికే కళ్లు తేలేస్తున్నారని, వెంటనే వైద్యం అందించాలని బాధితురాలి కుమార్తె గగ్గోలు పెట్టారు. ఓ పావు గంట తర్వాత వచ్చి ఆమెకు సీపీఆర్‌ చేశారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని