logo

మారని తీరు

ప్రభుత్వ నిబంధనలు అక్కడ అమలుకావు.. అధికారులు చెప్పినా గుత్తేదారు లెక్కచేయరు.. నదిలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలకు నీళ్లొదిలారు..

Published : 30 Nov 2022 04:40 IST

టన్ను ఇసుకకు రూ.625 వసూలు
గుత్తేదారు సంస్థపై చర్యలు శూన్యం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-కొల్లిపర: ప్రభుత్వ నిబంధనలు అక్కడ అమలుకావు.. అధికారులు చెప్పినా గుత్తేదారు లెక్కచేయరు.. నదిలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయకూడదన్న నిబంధనలకు నీళ్లొదిలారు.. నిర్ణీత ధరకు మించి అదనంగా వసూలు చేస్తారు.. క్షేత్రస్థాయిలో ఇసుక కొనుగోలుదారులు, సంస్థ ప్రతినిధులను విచారణ చేసి అదనపు వసూళ్లు నిజమేనని డివిజన్‌ స్థాయి అధికారి నిర్ధారించి పంపిన నివేదికపై కనిపించని చర్యలు.. ఇదీ కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం ఇసుక రీచ్‌లో దుస్థితి.

నివేదిక ఏమైంది...?

ఈనెల 22న ‘ఇసుక అమ్మకాల్లో ఇష్టారాజ్యం’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి 22వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో తెనాలి సబ్‌కలెక్టర్‌, గనులు, భూగర్భవనరులశాఖ సహాయ సంచాలకులు, కొల్లిపర తహశీల్దారు ఆధ్వర్యంలో అధికారుల బృందం బొమ్మువానిపాలెం ఇసుక రీచ్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. గుత్తేదారు సంస్థకు చెందిన మేనేజరు, క్యాషియర్‌ను అధికారుల బృందం విచారించగా టన్ను ఇసుక రీచ్‌లో రూ.475కు బదులు రూ.625కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. గుత్తేదారు సంస్థ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలు మేరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. నగదు పుస్తకం, వారు జారీ చేస్తున్న వేబిల్లులను పరిశీలించగా ఎక్కడా ఇసుక ధర నమోదు చేయలేదు. కేవలం ఇసుక పరిమాణాన్ని మాత్రమే నమోదు చేస్తున్నట్లు బృందం గుర్తించింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరకు వసూలుచేస్తున్నట్లు గుర్తించి ‘ఈనాడు’ పత్రికలో వచ్చిన కథనం వాస్తవమేనని నిర్ధారించారు. ఈ మేరకు ఇసుక రీచ్‌ను సీజ్‌ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈనెల 22న నివేదిక పంపితే ఇప్పటివరకు చర్యలు లేవు. అప్పటి నుంచి అదనపు వసూళ్లు కొనసాగుతున్నాయి. 29వ తేదీ కూడా గుత్తేదారు సంస్థ టన్నుకు రూ.625 వసూలు చేస్తోంది. వే బిల్లుల్లో ధర వివరాలు నమోదు చేయడం లేదు. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.

నదిలోనే డంపింగ్‌ యార్డు

కొల్లిపర మండలం బొమ్మవానిపాలెంలో ఇసుక రీచ్‌ నిర్వాహకులు నదిలోనే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేశారు. నదికి వరద వస్తే డంపింగ్‌యార్డు నిర్వహిస్తున్న ప్రాంతంలోనూ నీటి ప్రవాహం ఉంటుంది. నది నుంచి ఇసుకను తవ్వి నది వెలుపల ప్రభుత్వం అనుమతించిన ప్రాంతంలో నిల్వ చేసుకుని విక్రయించాలి. నది నుంచి డంపింగ్‌యార్డుకు తరలించినందుకు రవాణా ఛార్జీలను కొనుగోలుదారుల నుంచి వసూలు చేసుకునే వెసులుబాటును సైతం గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం కల్పించింది. అయితే ఇందుకు విరుద్ధంగా నదిలోనే తవ్వకాలు చేస్తున్న ప్రాంతానికి 500 మీటర్లలోపే నది మధ్యలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసి ఇసుక నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ టన్నుకు రూ.625 వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుక తవ్వి తెనాలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే డంపింగ్‌యార్డులో రూ.535కు విక్రయించాలని ప్రభుత్వం ప్రతి వారం ప్రకటన ఇస్తోంది. ఇది ఆచరణలో అమలుకావడం లేదు. ఇసుక కొనుగోలుదారులు ఇదే విషయాన్ని రీచ్‌లో గుత్తేదారు సంస్థ ప్రతినిధులను ప్రశ్నిస్తే ఇసుక ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడి వచ్చి ఇసుక కొనుగోలు చేయమని తాము బతిమాలుతున్నామా? అని ఎదురుదాడికి దిగుతున్నారు.

అక్రమాలు వెలుగులోకి వస్తాయనే..

బొమ్మువానిపాలెం రీచ్‌లో కొనుగోలుదారులకు ఇస్తున్న వేబిల్లులో ఇసుక పరిమాణం, ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. టన్ను ఇసుక ధర, మొత్తం చెల్లించిన సొమ్ము నమోదుచేయకుండా బిల్లులు ఇస్తున్నారు. ఈ విషయం ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైంది. బిల్లులో టన్నుకు రూ.625 వసూలు చేస్తున్నట్లు బిల్లులు ఇస్తే ఇబ్బందులు వస్తాయని వివరాలు నమోదుచేయకుండా ఇస్తున్నారు. లారీడ్రైవర్లు, కొనుగోలుదారులు ఎవరైనా ప్రశ్నిస్తే తాము ఇలాగే చేస్తామని సమాధానం చెబుతున్నారు. ఇసుక తవ్వకాల వెనుక జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధితోపాటు పొరుగు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ఉండటంతో యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. క్షేత్రస్థాయి యంత్రాంగం నివేదిక పంపి మిన్నకుండిపోగా ఉన్నతాధికారులకు నివేదిక వచ్చి వారం రోజులైనా చర్యలు మాత్రం తీసుకోకపోవడం గమనార్హం. గుత్తేదారు అదనపు వసూళ్లు మాత్రం బహిరంగంగా కొనసాగుతూనే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని